Feed Section

Search

Recent Readers

Powered by Blogger.

Saturday 21 September 2013

Ash Gourd

కూరగాథలు : వీరీ...వీరీ... గుమ్మడి



గుమ్మడి పండు దీర్ఘకాలం పాటు నిల్వ ఉంటుంది. అందుకే పుణ్యకార్యాలకూ, పురోహితులకు సంభావనగానూ ఇవ్వడానికి ఇంట్లో గుమ్మడి పళ్ళు నిల్వ చేస్తారు గృహస్థులు. గుమ్మడి కున్న ఔషధ విలువల కారణంగా గుమ్మడి పండుతో చేసిన కూరగాని, పులుసుగాని ఏడాదికొకసారైనా తినాలంటారు పెద్దలు. గతంలో కొన్ని వైపరీత్యాల మూలంగా గుమ్మడికాయలు దొరకని పరిస్థితి ఉండేది. అలాంటప్పుడు గుమ్మడికాయను దొంగిలించినా తప్పులేదనే భావం ప్రజలలో ప్రబలింది. అందరూ సర్వసామాన్యంగా చేసే తప్పు కనుకనే 'గుమ్మడికాయల దొంగ ఎవరంటే తమ భుజాలు తడుముకున్నార'నే సామెత ఏర్పడిందేమో.

'వార్తాకం కోమలం పథ్యం - కూష్మాండం కోమలం విషం' అని ఆర్యోక్తి. దీని అర్థం తినేందుకు లేత వంకాయలు శ్రేష్టమే కాని లేత గుమ్మడికాయలు మాత్రం విషంతో సమానమని. (ముదురు వంగ విత్తనాల్లో మత్తును కలిగించే విషపదార్థాలున్నట్లే లేత గుమ్మడిలోనూ హానికారక విషపదార్థాలుంటాయి.) అందుకే పచ్చి గుమ్మడి తినరాదు. గుమ్మడి పండు మాత్రమే తినదగినది.

గుమ్మడి ఏకవార్షిక తీగ మొక్క. దీని పెద్ద ఆకులకూ, కాండానికీ మెత్తటి నూగు ఉంటుంది. ప్రతి కణుపు వద్ద స్ప్రింగుల వంటి 'ట్రెండిల్స్' వస్తాయి. వీటి సాయంతోనే గుమ్మడి తీగ ఎగబాకుతుంది. దీని పసుపు పచ్చని పెద్ద పూలు ఏకలింగ పుష్పాలు. మగ, ఆడ పూలు ఒంటరిగానే ఉంటాయి. గుజ్జు, అసంఖ్యాకమైన విత్తనాలు కలిగి ఉండే గుమ్మడి పళ్ళు గట్టి పైపొర కారణంగా మనం కోస్తే తప్ప వాటికి అవిగా పగలవు. గుమ్మడి పళ్ళు సాధారణంగా ఏడెనిమిది కేజీలు, అరుదుగా ఇరవై కేజీల బరువు వరకు కూడా ఉంటాయి. విత్తనాలు అండాకారంలో అణగగొట్టినట్లుంటాయి.


గుమ్మడిగుంట, గుమ్మడిదొడ్డి, గుమ్మడిపూండి వగైరా గ్రామనామాలు... గుమ్మడి, గుమ్మడిదల, గుమ్మళ్ళ మొదలైన ఇళ్ళ పేర్లు గుమ్మడితో మన ప్రాచీన అనుబంధానికి తార్కాణాలు. దక్షిణ అమెరికాలోని అతి ప్రాచీన రెడ్ ఇండియన్ సమాధుల్లో లభించిన అవశేషాలను బట్టి వేల ఏండ్ల క్రితం నుంచీ గుమ్మడిని మానవులు ఆహారంగా వాడేవారని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. భారతదేశంలో చరిత్ర పూర్వ యుగాల నుంచీ గుమ్మడిని పండించడం ఉంది. అయినా గుమ్మడి జాతి తొట్టతొలి జన్మస్థలం మాత్రం పదివేల సంవత్సరాలకు పూర్వమే ఉభయ అమెరికా ఖండాల్లో అత్యుష్ణ ప్రాంతాల్లో ఆవిర్భవించిందని వారి అంచనా.

అయితే గుమ్మడి జాతుల్లో కొన్నింటికి ఉన్న సంస్కృత పేర్లు కూడా అతి ప్రాచీన కాలం నాటివని నిర్ధారణ అయింది. ఉభయ అమెరికా ఖండాల నుంచి ఎటువంటి నౌకాయానాలు లేనట్టి అంత ప్రాచీన కాలంలోనే ఈ మొక్క భారతదేశం దాకా ఎలా విస్తరించి ఉంటుందనే దానిపైన కూడా శాస్త్రజ్ఞులు విస్తృతంగా చర్చించారు. చివరికి ఎండిన గుమ్మడిపళ్ళు అతి తేలికైనవైనందున అవి మహాసముద్రాల నీటిపై తేలుతూ, మొలకెత్తే సామర్థ్యం కోల్పోని విత్తనాలతో సహా ఒక ఖండం నుంచి మరో ఖండానికి విస్తరించి, అక్కడ అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తి ఉండవచ్చుననే నిర్ధారణకు వచ్చారు. అమెరికన్లు 'రెడ్ పంప్కిన్' అని పిలిచే మంచి గుమ్మడి భారతదేశంలో ప్రవేశించి, 'లాల్ కుమ్రా' అని పిలువబడుతున్నది.

అమెరికాలోనే పుట్టిన కషో అనే మరో జాతి గుమ్మడిని భారతీయ మార్కెట్లలో 'ఆఫ్రికన్ గోర్డ్' అనడాన్ని బట్టి మూలంలో అమెరికాలో జన్మించిన ఆ జాతి అక్కడ నుంచి ముందు ఆఫ్రికా ఖండానికి విస్తరించి, ఆ తరువాత భారతదేశానికి విస్తరించి ఉంటుందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ప్రస్తుతం ఆఫ్రికన్ గోర్డ్‌గా పిలవబడుతున్నప్పటికీ, ఈ జాతి భారతదేశానికి అతి ప్రాచీన కాలంలోనే వచ్చి చేరింది. విచిత్ర వీణ, తంబూరా వంటి సంగీత వాద్యాలు తయారుచేసేందుకు అతి పెద్దవైన ఈ జాతి గుమ్మడి పండు బుర్రల్నే అత్యం త ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఉపయోగించేవారు.


గుమ్మడి పండునే కాదు; వాటి లేత ఆకులు, కాండం, పూలు కూడా కూరకు వాడుకుంటారు. గుమ్మడి గింజల్ని తింటారు. హల్వాలు వంటి స్వీట్లలో బాదం, పిస్తా, చార (సార) పప్పు లాగే ఈ గింజలలోని పప్పును కూడా డ్రెస్సింగ్‌గా వాడతారు. కొందరైతే గుమ్మడి పండుతోనే హల్వా చేసుకుంటారు. గుమ్మడిలో పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఉపయుక్త ఖనిజాలే కాక, విటమిన్ ఎ (అధికంగానూ), కొద్దిగా విటమిన్ సి (కొద్దిగానూ) ఉన్నందున అది ఆహారపరంగా విలువైనదని గుర్తించారు. గుమ్మడి పండుకు ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. కడుపులోని 'టేప్ వార్మ్స్' నిర్మూలన కోసం గుమ్మడి గింజల్ని పంచదారతో తినిపిస్తారు.

రాత్రి పడుకోబోయే ముందు తినిపించి, తెల్లవారుఝామునే ఆముదం తాగిస్తారు. గనేరియా, మూత్ర వ్యాధులున్న రోగులకు మూత్రం సాఫీగా వెడలేందుకు గుమ్మడి విత్తులు పంచదార లేక తేనెతో తినిపిస్తారు. సెగగడ్డలు, మొండి వ్రణాలకు గుమ్మడి పండు గుజ్జును మలాం పట్టీగా వేస్తారు. తేళ్ళు, కాళ్ళజెర్రులు, మండ్రగబ్బలు మొదలైనవి కుట్టినప్పుడు, గుమ్మడిపండు తొడిమను ఎండబెట్టి పొడి చేసి, దానితో తయారుచేసిన పేస్టును రాస్తే తక్షణ ప్రయోజనం ఉంటుంది. కాలిన గాయాలకు గుమ్మడి పండు గుజ్జుతో పట్టు వేస్తారు. గుమ్మడి విత్తులు మూత్రకారిగానే కాక, నరాల బలహీనత ఉన్నవారికి టానిక్‌లా పనిచేస్తాయి. ఇన్ని ఔషధ గుణాలున్న గుమ్మడిని దొరికినప్పుడల్లా మనం ఆహారంలో ఉపయోగించుకోవడం ఎంతైనా మంచిది కదూ! ఇదండీ గుమ్మడి గాథ.
- ముత్తేవి రవీంద్రనాథ్
http://www.andhrajyothy.com/ContentPage.jsp?story_id=54163&category=sunday_special
21:21 - By Swathi 0

0 comments:

THYROID

హోమియోకేర్ చెంత థైరాయిడ్ నుంచి నిశ్చింత

హోమియోకేర్ చెంత థైరాయిడ్ నుంచి నిశ్చింత
హైదరాబాద్ : ఆధునిక జీవితంలో ప్రతి 20 మందిలో ఒక వ్యక్తికి థైరాయిడ్ సమస్య రాగలదు. థైరాయిడ్ గ్రంథి నుండి విడుదలైన హార్మోనులు రక్త ప్రవాహంలో కలిసి శారీరక పెరుగుదలకు, జీవక్రియలు జరగడానికి తోడ్పడతాయి. థైరాయిడ్ గ్రంథిలో వచ్చే మార్పుల వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్, అందువల్ల జీవక్రియలన్నీ నెమ్మదిస్తాయి. ప్రస్తుత జీవన పరిస్థితులలో మానసిక ఒత్తిళ్ళ వల్ల, ఆహార సమతుల్యం/ శారీరక శ్రమ లోపించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఎక్కువ.

 అప్పుడే పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఏ వయసువారికైనా ఈ సమస్య రావచ్చు. అయితే వయసును అనుసరించి కారణాలు మారవచ్చు. శిశువులలో... థైరాయిడ్‌గ్రంథి నిర్మాణంలో ఏదైనా లోపం ఉన్నపుడు సాధారణంగా ఈ సమస్య కనిపిస్తుంది. దీన్ని కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటారు. పెద్దవారిలో హషిమోటో థైరాయిడిటైటిస్, ఈ హైపోథైరాయిడిజం సమస్య రావడానికి ఒక సాధారణ కారణం.

 రకాల: థైరాయిడ్ సమస్యలు 2 రకాలు
 1.హైపోథైరాయిడిజం: జీవక్రియలు సజావుగా జరగడానికి సరిపడా థైరాక్సిన్ హార్మోన్‌ను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయకపోవడాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ఫలితంగా అలసట, చర్మం పొడిబారడం, అధిక బరువు, స్త్రీలలో నెలసరి సమస్యలు, మగత, మలబద్దకం చలికి తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, చిరాకు, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 2.హైపర్ థైరాయిడిజం:
 థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం వలన ఈ సమస్య వస్తుంది. గుండెదడ, చేతులు, కాళ్ళు వణకడం, నిద్రలేమి, ఆందోళన, బరువు తగ్గిపోవడం, వేడిని తట్టుకోలేకపోవడం, ఆకలి పెరగడం, నెలసరి సమస్యలు, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 థైరాయిడ్ హార్మోన్‌లు అధికంగా స్రవించడం వల్ల థైరోటాక్సికోసిస్ వస్తుంది. ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది.

 కంటి కండరాలు వాచి, కంటి గుడ్లు ముందుకు వచ్చినట్లు కనిపిస్తే దీన్ని Grave's disease అంటారు.

 కొంతమందికి థైరాయిడ్‌గ్రంథి పెద్దదై మెడభాగంలో వాపు వస్తుంది. దీన్ని గాయిటర్ అంటారు.

 పరీక్షలు: థైరాయిడ్ సమస్య ఉందా లేదా అని తెలుసుకోవడానికి టి3, టి4, టిఎస్‌హెచ్ హార్మోన్ల లెవల్స్‌ను రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పై లెవల్స్‌లో ఉండే హెచ్చుతగ్గులను బట్టి వ్యాధిని నిర్థారిస్తారు. రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందేమో నిర్థారించడానికి థైరాయిడ్ యాంటీ టాడిస్ (యాంటీ టిపిఓ బాడిస్) పరీక్షలు అవసరమవుతాయి.

 మెడ లోపలి భాగంలో సీతాకోక చిలుక ఆకృతిలో ఉండే థైరాయిడ్‌గ్రంథి అత్యంత కీలకమైన విధులను నిర్వహిస్తుంటుంది.

 థైరాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో కొందరికి కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా ఉంటాయి. మరికొందరిలో గాయిటర్ సమస్య వస్తుంది.

 హోమియో వైద్యం
 హోమియో కేర్ వైద్యవిధానంలో రోగి శారీరక, మానసిక పరిస్థితి ఆకలి, నిద్ర, ఆందోళనలు తదితర అంశాలలో పాటు వంశపారంపర్యత, ఆరోగ్యచరిత్ర వంటివి పరిగణనలోకి తీసుకొని మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా థైరాయిడ్ సమస్యకు వైద్య చికిత్స ఇవ్వబడుతుంది. ప్రపంచంలో మొదటిది కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతి ద్వారా హోమియోకేర్ థైరాయిడ్ సమస్యలకు అత్యధిక శాతం రోగులకు పూర్తిగా తగ్గించడం జరుగుతుంది.

Article on Sakshi Link
http://www.sakshi.com/news/family/thyroid-solution-from-homeocare-66929
21:07 - By Swathi 0

0 comments:

bolli disease

బొల్లి ఇప్పుడు తగ్గుతుంది!


బొల్లి ఇప్పుడు తగ్గుతుంది!
హైదరాబాద్ :  ఒంటిపై తెల్లటి మచ్చలతో కనిపించే బొల్లి వల్ల ఎలాంటి హానీ ఉండదు. కానీ దీనివల్ల వివక్షకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి బొల్లి మానసికంగా కుంగదీస్తుంది. మన జనాభాలో 0.5 శాతం మందిలో అది కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు బొల్లికి మంచి మంచి కొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. వాటితో గతంలో పోలిస్తే చాలావరకు దీన్ని నయం చేసే ఆస్కారమూ ఇప్పుడుంది. బొల్లి ఎందుకు వస్తుంది, దానికి అందుబాటులో ఉన్న చికిత్సలేమిటి అన్న అంశంపై అవగాహన కోసమే ఈ కథనం.

 మన శరీరంలోని పిగ్మెంట్ అనే రంగునిచ్చే పదార్థం వల్ల మేనిచాయ వస్తుంది. ఇది వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. కొంతమందిలో ఈ పిగ్మెంట్ ఒకేచోట కుప్పపోసినట్లుగా ఉంటే అక్కడ పుట్టుమచ్చ వస్తుంది. ఒకవేళ కొన్నిచోట్ల అది లోపిస్తే...? అప్పుడు అక్కడ చర్మం రంగును కోల్పోయి తెల్లగా మెరుపును కోల్పోయినట్లుగా ఉంటుంది. ఇలా చర్మపు రంగు లోపించడానికి... రంగును ఇచ్చే పదార్థమైన పిగ్మెంట్‌లోని కణాలు తమను తామే దెబ్బతీసుకోవడం (ఆటోఇమ్యూన్ అంశం) కూడా ఒక కారణం. మరికొందరిలో జన్యుపరంగా కూడా ఇది రావచ్చు. మరికొందరిలో ఏ కారణమూ లేకుండానే ఇది కనిపించవచ్చు. కారణం ఏదైనా బొల్లి వచ్చిన వారిలో శరీరంపై తెల్లటి మచ్చలు ప్యాచ్‌లలా కనిపిస్తాయి. వీటివల్ల ఎలాంటి నొప్పీ ఉండదు. ఆరోగ్యానికి హాని కూడా ఉండదు. కానీ చూడటానికి ఇది అంతగా బాగుండదు. కాబట్టి దీన్ని ఎవరూ కోరుకోరు.

 ఇంగ్లిష్‌లో దీన్ని విటిలిగో అంటారు. వైద్య పరిభాషలో ల్యూకోడెర్మా అంటారు. ఈ తెల్లటి మచ్చలు సాధారణంగా చేతులు, పాదాలు, భజాలు, ముఖం, పెదవులు లాంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి. కొందరిలో బాహుమూలాలు, పొత్తికడుపు కింది భాగం, నోటి చుట్టూ, కన్ను పరిసర ప్రాంతాలు, మర్మావయవాల ప్రాంతంలో ఉంటాయి. ఈ మచ్చలకు తోడుగా విటిలిగో ఉన్నవారికి ఆ తెల్లప్రదేశంలో ఉండే (అంటే ఉదాహరణకు మాడు, కనురెప్పలు, కనుబొమలు, గడ్డంలోని ప్రాంతాల్లోని) వెంట్రుకలు తెల్లగా మారిపోతాయి. చర్మం నల్లగా ఉండే వారిలో ఈ రంగు కోల్పోయిన గుణం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది.

 వైద్య చికిత్స ప్రక్రియలు...
 శరీరంపై ఉండే ఆ మచ్చల పరిమాణం, అవి వచ్చిన చోటు, అక్కడ అవి ఎంతమేర విస్తరించాయన్న అనేక అంశాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. చికిత్స కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. అలాగే చికిత్స ఫలితంగా కూడా ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో ఫలితం చాలా వేగంగా కనిపిస్తే, మరికొందరిలో ఆలస్యంగా కనిపిస్తుంది. అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలివే...

 మెలనిన్ కణాలు మరింత నాశనం కాకుండా చూడటం : ఈ ప్రక్రియలో చర్మానికి రంగును ఇచ్చే మెలనిన్ కణాలు మరింతగా నాశనమైపోకుండా చేస్తారు. అంతేకాదు... రంగు కోల్పోయిన శరీర భాగానికి మునుపటి రంగు వచ్చేలా చేస్తారు.

  స్టెరాయిడ్ క్రీములు: పైపూతగా వాడే విధంగా కొన్ని రకాల స్టెరాయిడ్ క్రీములు, టాక్రోలైమస్ క్రీములు రాస్తారు. అవి చర్మం మామూలు రంగును సంతరించుకోడానికి, మచ్చలు మరింత విస్తరించకుండా సహాయపడతాయి.

  ఫొటో థెరపీ: ట్యాబ్లెట్లు, లోషన్ రూపంలోని సోరాలెన్స్ అనేవి ఈ తరహా చికిత్సలో ఉపయోగపడతాయి. అయితే ఈ ట్యాబ్లెట్‌లు లేదా క్రీములను సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అవుతూ వాడాల్సి ఉంటుంది. సూర్మరశ్మికి బదులుగా హానికరం కాని మోతాదులో అల్ట్రావయొలెట్ కిరణాలకు కూడా ఎక్స్‌పోజ్ చేయవచ్చు. దీన్ని పూవా థెరపీ అంటారు. ఫొటోథెరపీ ప్రక్రియ నిపుణులైన డెర్మటాలజిస్ట్‌ల ఆధ్వర్యంలో మాత్రమే ప్రత్యేక ఫొటోథెరపీ ఛాంబర్లలో  చేయాల్సి ఉంటుంది.

  ఇతర ప్రక్రియలు:
 జింక్‌గో బైలోబా, లీవామీసోల్... ఇవి ఇమ్యూన్ మాడ్యులేటర్స్. ఇవి మన ఇమ్యూనిటీని పెంచడం ద్వారా విటిలిగోతో పోరాడతాయి. వీటిని ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు.

 డి-పిగ్మెంటేషన్ ట్రీట్‌మెంట్ : కొంతమందిలో దాదాపు 80 శాతం పైగా శరీరం తెల్లబడి పోతుంది. ఇలాంటివారిలో నల్లగా ఉన్న మిగతా ప్రాంతాన్ని కూడా తెల్లగా చేస్తారు.

 శస్త్రచికిత్స (సర్జికల్ ట్రీట్‌మెంట్) : ఇందులో పంచ్‌గ్రాఫ్టింగ్, స్ప్లిట్ స్కిన్ గ్రాఫ్టింగ్,  రకరకాల సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక శస్త్రచికిత్సలో భాగంగా ఇప్పుడు చర్మంపై ఇతరచోట్ల ఉండే రంగునిచ్చే పిగ్మెంట్ కణాలను అవి కోల్పోయిన ప్రాంతంల్లోకి బదిలీ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇతర సాధారణ చికిత్స ప్రక్రియల వల్ల సాధ్యం కాని సందర్భాల్లో మాత్రమే ఈ శస్త్రచికిత్స పద్ధతిని అవలంబిస్తారు. శరీరంలోని కొన్ని భాగాల్లో ... అంటే... పెదవులు, చేతులు, కాళ్ల చివరన ఉండే భాగాలు) సాధారణ చికిత్స ప్రక్రియలు అంతగా సత్ఫలితాలు ఇవ్వవు. అలాంటి సందర్భాల్లో ఈ శస్త్రచికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. అయితే విస్తరించని విటిలిగో మచ్చలు ఉన్న పేషెంట్ల  విషయంలోనే ఈ శస్త్రచికిత్స విధానాన్ని ఆలోచిస్తారు. వ్యాప్తి చెందకపోవడం అంటే... ఒక ఏడాది వ్యవధిలో మచ్చ సైజు విస్తరించకపోవడం, కొత్త ప్రాంతాల్లో మచ్చలు రాకపోవడాన్ని మచ్చలు వ్యాప్తిచెందని పేషంట్లుగా పరిగణిస్తారు. ఈ సర్జికల్ ప్రక్రియలో ఇతర చోట్ల నుంచి చర్మాన్ని తీసుకుని గ్రాఫ్ట్ చేస్తారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన శాస్త్రవిజ్ఞాన ప్రక్రియల వల్ల మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. సర్జరీ తర్వాత మళ్లీ అక్కడ సాధారణ పిగ్మెంట్ వచ్చేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చు. అయితే ఒక్కోసారి అనుకున్న ఫలితాలు వచ్చేందుకుగాను... సర్జరీ తర్వాత సాధారణ వైద్యచికిత్స కూడా అవసరం కావచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియల వల్ల విటిలిగో రోగులు మునుపటిలా ఆత్మన్యూనతకు గురికావాల్సిన అవసరంగాని, బాధపడాల్సిన పరిస్థితిగాని లేదు. అనేక నూతన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చినందున వాటి సహాయం తీసుకుని మళ్లీ మేని రంగును  మామూలుగా మార్చుకునేందుకు మంచి అవకాశాలున్నాయి.

 - నిర్వహణ: యాసీన్

 డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
 చీఫ్ డెర్మటాలజిస్ట్,
 త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్.
This is Sakshi Article, Here I am Giving for Public Benefit.
http://www.sakshi.com/news/family/-67184
21:00 - By Swathi 0

0 comments:

Ram Gopal Varam With Sakshi

మా అమ్మాయి పెళ్లికి కూడా గెస్ట్‌లాగానే వెళ్లాను...

మా అమ్మాయి పెళ్లికి కూడా గెస్ట్‌లాగానే వెళ్లాను...
హైదరాబాద్ : తొంభైలలో వర్మ కనిపించేవాడు కాదు.
 అతడి సినిమాలు మాత్రమే కనిపించేవి.
 ఇప్పుడు వర్మ మాత్రమే కనిపిస్తున్నాడు.
 అతడి సినిమాలు కనిపించడం లేదు!
 ఇలాంటివి వంద...
 వంద బ్లైండ్ అండ్ రూడ్ కామెంట్లు వర్మ మీద!
 మీడియా యావ ఎక్కువైందని...
 ఎప్పుడేం చేస్తాడో తెలియదనీ...
 ఎవర్నేమంటాడో చెప్పలేమనీ...
 సెల్ఫిష్ అనీ, ‘కాంట్రావర్ట్’ అనీ...
 పద్ధ్దతీ పాడూ లేని మనిషనీ...
 మొత్తానికే ‘మోస్ట్ అన్‌వాంటెడ్’ అని...
 ఇండస్ట్రీ లోపల, బయట వర్మపై...
 ఓ గొప్ప ‘సదభిప్రాయం’!
 వర్మ దేన్నీ కాదనడు.
 అనకపోగా, ‘నేనింతే’ అంటాడు.
 అతడంతే కాకపోయినా అలాగే అంటాడు!
 కనీసం ఖండించడా?
 వర్మకంత టైమ్ లేదు, ఉండదు కూడా.
 ఇప్పుడతడు ‘సత్య-2’లో బిజీ.
 సత్యాసత్యాల వివరణ అతడి దృష్టిలో...
 పెద్ద టైమ్ వేస్ట్ కార్యక్రమం. అంతే.
 ఈవారం ‘తారాంతరంగం’ చదవండి.
 రామ్‌గోపాల్ వర్మను తిట్టుకోడానికిఫెష్‌గా మరికొన్ని కారణాలు కనిపిస్తాయి!


 మీ దగ్గర కథలు అయిపోయాయా? ‘సత్య-2’ అని సీక్వెల్ చేస్తున్నారు?
 రామ్‌గోపాల్‌వర్మ: ఇది ‘సత్య’కు సీక్వెల్ అని ఎవరు చెప్పారు? టైటిల్‌లో ‘సత్య’ అని ఉన్నంత మాత్రాన సీక్వెల్ అనేసుకోవడమేనా? సిటీ అన్నాక చాలామంది మనుషులు వస్తుంటారు. 1997లో సత్య అనేవాడు సిటీకి వచ్చి మాఫియాలో ఎలా ఇరుక్కున్నాడన్నది ఆ ‘సత్య’ కథ. 2013లో సిటీకొచ్చిన ఇంకో సత్య కథ ఇది. అసలు దానికీ దీనికీ కథ విషయంలో కాని, పాత్రల విషయంలో కానీ ఎటువంటి పోలికా లేదు. నేపథ్యం మాత్రం ఒక్కటే.

 అందుకేనా... జేడీ చక్రవర్తిని వదిలేసి శర్వానంద్‌ని తీసుకున్నారు?
 వర్మ: ‘ప్రస్థానం’లో శర్వానంద్ రియలిస్టిక్ అప్రోచ్ నాకు బాగా నచ్చింది. ‘సత్య-2’ కూడా రియలిస్టిక్ మూవీ కాబట్టి, తను కరెక్ట్ అనిపించింది.

 ‘సత్య’ నాటి రామ్‌గోపాల్‌వర్మకు, ‘సత్య-2’ రామ్‌గోపాల్‌వర్మకు చాలా వ్యత్యాసమొచ్చేసినట్టుంది?
 వర్మ: డెఫినెట్‌గా వ్యత్యాసం ఉంది. మనిషెప్పుడూ ఒకేలా ఉండడు కదా. మనం బ్లాంక్ మైండ్‌తో పుడతాం. పెరిగిన వాతావరణం, కలిసిన మనుషులు, చదివిన పుస్తకాలు... వీటన్నిటితో మనకో ఆలోచనా విధానం ఏర్పడుతుంది. అది ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతూ ఉంటుంది. ‘శివ’లో సైకిల్ చైన్ ఎపిసోడ్ నాకప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అదే ఇప్పుడు చాలా ఛైల్డిష్ థాట్‌లాగా అనిపిస్తుంది.

 తెలుగు సినిమా ఓ దారిలో వెళ్తుంటే, మీరో కొత్తమార్గం చూపించారు. అదిప్పుడు పాతబడిపోయింది. మళ్లీ ఇంకో కొత్త రూట్ కనిపెట్టాలనుకోవడం లేదా?
 వర్మ: దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత... ఇలా ఎవరైనా కావచ్చు, ఒక్కొక్కరికీ ఒక్కో టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్‌తోనే చివరివరకూ పని చేస్తాడు. రాబిన్ కుక్ ఫేమస్ రైటర్. 40 ఏళ్ల నుంచి రాస్తూనే ఉన్నాడు. అన్నీ మెడికల్ థ్రిల్లర్సే. కథలు వేరు కావచ్చు. పాత్రలు వేరు కావచ్చు. కానీ కోర్ ఎలిమెంట్ మాత్రం ఒక్కటే. నేను కూడా అలాంటి టేస్ట్‌తోనే పని చేస్తుండొచ్చు. నేను ‘శివ’ తీసే సమయానికి నేనేదో బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్నానని, కొత్త రూట్ కనిపెట్టబోతున్నానని ఏ మాత్రం అనుకోలేదు. నేనెలా ఆలోచిస్తానో, నాకెలాంటి సినిమా నచ్చుతుందో... సరిగ్గా అలానే ‘శివ’ తీశానంతే. మీడియాతో కూడా అప్పుడెలా మాట్లాడానో ఇప్పుడూ అంతే. ప్రశ్నలు మారొచ్చు, జవాబులు మారొచ్చు కానీ, నా ఐడియాలజీ మాత్రం మారలేదు.

 ఓకే... అయితే అప్పుడు మీడియాతో ఇంతలా మాట్లాడేవారు కాదు. ఇప్పుడు మీరు మాట్లాడేది కేవలం మీడియాతోనే కదా!
 వర్మ: నేనెప్పుడూ మాట్లాడతాను. అయితే అప్పట్లో ఇంత మీడియానే లేదు. ఉండుంటే, అప్పుడూ ఇలాగే మాట్లాడేవాణ్ణి.

 ఏమో... మునుపటితో పోలిస్తే మీరు ఫిలిం మేకింగ్‌పై కన్నా ప్రమోషనల్ యాక్టివిటీస్‌పైనే ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నట్టనిపిస్తోంది?
 వర్మ: అంటే నాకు పబ్లిసిటీ వ్యామోహం ఎక్కువైందనేగా మీ ఉద్దేశం? నేనిలాంటి కామెంట్లని అస్సలు ఖాతరు చేయను. ఈ రోజుల్లో ఫిలిం మేకింగ్ ఎంత ఇంపార్టెంటో, ప్రమోషనూ అంత ఇంపార్టెంట్. నేనొక్కణ్ణే కాదు, ప్రపంచం అంతా చేస్తున్న పని ఇదే.

 దేశంలో ఏం జరిగినా రియాక్టయ్యి వెంటనే సినిమా ఎనౌన్స్ చేసేస్తుంటారు...
 వర్మ: అలా నేనెప్పుడూ చేయలేదు. అయినా నేను అన్ని సంఘటలనకూ రియాక్ట్ కాను. కొన్నే కదిలిస్తాయి. నన్ను కదిలించిన వాటితోనే సినిమా చేయాలనుకుంటాను. ముంబై తాజ్‌హోటల్లో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ‘ది ఎటాక్స్ ఆఫ్ 26/11’ తీశాను. ఈమధ్య నేను చేసింది ఇదొక్కటే కదా.

 వీరప్పన్ చనిపోయినపుడు అతనిపై సినిమా తీస్తానన్నారు. ‘పెళ్లి’ టైటిల్‌తో అయిదుగురు దర్శకులతో కలిసి సినిమా అన్నారు. రాజకీయాలపై సినిమా అన్నారు. ఇలా ఎక్కువగా ప్రకటనలకే పరిమితమైపోతున్నారు?

 వర్మ: సినిమా అనేది ఒక ఐడియా. ఏదో ఒక ఆలోచన వచ్చి సినిమా చేద్దామనుకుంటా. అది స్క్రిప్ట్ రూపమో, సినిమా రూపమో దాల్చే సమయానికే ఆ ఆలోచన నాకే ఎగ్జైటింగ్‌గా అనిపించకపోవచ్చు. లేకపోతే అంతకన్నా గొప్ప ఆలోచన పుట్టొచ్చు. మనసు మార్చుకోవడమనేది అందరికీ కామన్. ప్రకటనలేమీ శిలాశాసనం కాదు కదా.

 మాఫియా, దెయ్యాలు... ఈ రెండు నేపథ్యాలను పట్టుకుని ఎన్నాళ్లు వేలాడతారండీ?
 వర్మ: నేను తీసిన మొత్తం సినిమాల జాబితా చూడండి. నేను చేసినన్ని వేరియేషన్స్ ఇండియాలో ఇంకే దర్శకుడూ చేయలేదు. ‘శివ’... స్టూడెంట్ పాలిటిక్స్, ‘క్షణక్షణం’... కీపర్ ఫిలిమ్, ‘గోవిందా గోవిందా’... అడ్వంచరస్, ‘అనగనగా ఒకరోజు’... సిట్యుయేషనల్ కామెడీ, ‘రంగీలా’... లవ్‌స్టోరీ, ‘కంపెనీ’... మాఫియా, ‘రన్’... మీడియా, ‘ఇట్స్ నాట్ ఎ లవ్‌స్టోరీ’... మర్డర్ మిస్టరీ, ‘రక్తచరిత్ర’... ఫ్యాక్షనిజమ్, ‘26/11’... టైజమ్, ‘భూత్’... హారర్. ఇలా డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేశాను. నేను టచ్ చేయనిది ఒకే ఒక్కటి... ఫ్యామిలీ డ్రామా. వాటిని చూడ్డానికే ఇష్టపడను కాబట్టి, నేను అలాంటివి చేయను.

 ఈ మధ్య మీరు పాటలు రాయడం, పాడడం కూడా చేసేస్తున్నారు?
 వర్మ: ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్నాను. ఏనాడూ రాయాలని, పాడాలని అనుకోలేదు. ఏంటో ఈ మధ్యనే అనిపిస్తోంది. ఓ రికార్డుగా పడుంటుందనే ఆలోచన కూడా కావచ్చు. అయితే, ఇదంతా హాబీగానే చేస్తున్నాను. పెద్ద సీరియస్‌నెస్ లేదు. ‘రక్తచరిత్ర’లో ‘కత్తులతో సావాసం’ పాట నేను పాడితేనే బావుంటుందనిపించింది. పాడేశానంతే. ‘సత్య-2’లో ‘ఓ ప్రియా...’ అనే రొమాంటిక్ సాంగ్‌ని మొదట వేరే సింగర్ పాడితే నచ్చలేదు. దాంతో మ్యూజిక్ డెరైక్టర్ నన్నే పాడమన్నాడు. నిజంగా నేను పాడితే బావుంటుందనుకున్నాడో, లేక ఈయనతో పాడిస్తే గొడవ వదిలిపోతుందనుకున్నాడో నాకైతే తెలియదు.

 ‘రక్త చరిత్ర’లో వాయిస్ ఓవర్ కూడా చెప్పారుగా...
 వర్మ: అది నేను సృష్టించిన కథ కాబట్టి, నాక్కావాల్సిన ఎమోషన్ ఏంటో నాకే తెలుస్తుంది. ఆ ఉద్దేశంతోనే వాయిస్ ఓవర్ చెప్పాగానీ, నా వాయిస్‌లో గాంభీర్యం ఉందని చాటుకోవడానిక్కాదు.

 యాక్టింగ్ కూడా చేస్తారా?
 వర్మ: అది ఇంపాజిబుల్. నేను స్టిల్ కెమేరా ముందు కూడా సరిగ్గా పోజివ్వలేను. ఇక మూవీ కెమేరా ముందు ఎక్కడ నిలబడగలను? నన్ను యాక్ట్ చేయమని ఇద్దరు, ముగ్గురు అడిగారు కూడా.

 అసలు ఇప్పుడున్న బిజీలో మీకు స్క్రిప్టులు రాసే ఓపిక, తీరిక ఉందా?
 వర్మ: మీకో నిజం చెప్పనా... అసలు నేనిప్పుడే స్క్రిప్టులు రాస్తున్నాను. అంతకుముందెప్పుడూ రాసేవాణ్ణి కాదు. స్క్రిప్టులు రాయడం మొదలెట్టాకే, నాకు ఎక్కువ ఫ్లాప్స్ రావడం మొదలైంది. కేర్‌ఫుల్‌గా రాస్తేనే, కేర్‌ఫుల్‌గా ఫ్లాప్ తీస్తానని తెలుసుకున్నాను.

 అదేంటి చిత్రంగా ఉంది మీ లాజిక్. ఏ సినిమాకైనా బౌండ్‌స్క్రిప్ట్‌తో వెళ్లాలని అందరూ చెబుతుంటారుగా?
 వర్మ: ఏమో... నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తోంది. ఒక ప్రేమకథ తీయాలనుకుంటాం. వారిద్దరి మధ్యనా ప్రేమ ఎలా పుడుతుందనేది మనం చూపించడాన్ని బట్టి ఉంటుంది. ఆ లొకేషన్స్, మ్యూజిక్, ఫొటోగ్రఫీ, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్... ఇవన్నీ కలిస్తేనే సినిమా బాగా తయారవుతుంది. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అనేది వట్టి కథ మూలంగా వస్తుందనుకోవడం భ్రమ. ఎందుకంటే మంచి కథల్ని చెడగొట్టిన దర్శకులూ ఉన్నారు. కథ బాగున్నంత మాత్రాన సినిమా బాగా వస్తుందనుకోవడం ఆబ్సెల్యూట్లీ రాంగ్ థింకింగ్.

 అంటే స్క్రిప్టు లేకుండా సినిమాలు చేసేయొచ్చునా?
 వర్మ: నేనైతే చాలా చేశాను. చాలా సినిమాలకు నా దగ్గర స్క్రిప్టు లేదు. అప్పటికప్పుడు ఆలోచించి తీశాను. కథ లేకపోయినా కేరెక్టర్లు మాత్రం తెలియాలి. ఫలానా సిట్యుయేషన్‌లో ఆ కేరెక్టర్లు ఏం చేస్తాయనే క్లారిటీ ఉంటే మాత్రం ఆ సినిమా బాగా వస్తుంది.

 మరి స్క్రిప్టు రాయడం ఎప్పటినుంచీ మొదలుపెట్టారు?
 వర్మ: సరిగ్గా గుర్తులేదు కానీ, గత ఏడెనిమిదేళ్ల నుంచీ స్క్రిప్టులు రాయడం మొదలుపెట్టినట్టున్నాను.

 ‘అంతం’ లో ‘నీ నవ్వు చెప్పింది నాతో...’ ఎక్స్‌ట్రార్డినరీ సాంగ్. మీ తొలినాటి సినిమాల్లో చాలా పాటలు అలా పొయిటిగ్గా, రొమాంటిగ్గా ఉండేవి. ఇప్పుడా ఫ్లేవరే కనబడడం లేదెందుకని?

 వర్మ: నాలుగైదేళ్లుగా నేను వేరే జానర్ సినిమాలు ఎక్కువ చేస్తుండడం వల్ల అలాంటి రొమాంటిక్ సాంగ్స్ పెట్టడం కుదరడం లేదు. ఆ కైండాఫ్ ఎమోషన్ కనెక్ట్ అయితే, మళ్లీ అలాంటి సాంగ్స్ పెడతాను.

 ఈ మధ్య ట్విట్టర్‌లో పవన్‌కల్యాణ్ మీద పడ్డారు. పవన్‌తో రాజకీయ పార్టీ పెట్టించాలని కంకణం కట్టుకున్నారా ఏంటి?
 వర్మ: నాకు పవన్‌కల్యాణ్ అంటే ఇష్టం. తను మాట్లాడుతుంటే ఓ ఇంటెన్సిటీ కనిపిస్తుంది. తనని చూస్తుంటే ఓ వోల్కనో తనలో దాగుందేమో అనిపిస్తుంది. నిజానికి నాకు పాలిటిక్స్ గురించి ఏమీ తెలియదు. ఎవరు ఏ పార్టీనో కూడా పట్టించుకోను. కానీ ఓ కామన్‌మేన్‌గా కల్యాణ్‌ని చూస్తే ఓ బాల్‌థాకరే లాగా కరిష్మా ఉన్న లీడర్‌ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. రాజ్‌థాకరేలాగా జనాల్ని బాగా ఎట్రాక్ట్ చేయగలడు తను. ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే ఎలాంటి ప్రభంజనం వచ్చిందో, తనకూ అలా వస్తుంది.

 ఇంతకూ మీకు పవన్‌కల్యాణ్‌తో పరిచయం ఉందా?
 వర్మ: పెద్దగా లేదు. ఇప్పటికి రెండుసార్లు కలిసి ఉంటానేమో. అది కూడా అయిదారేళ్ల క్రితమే.

 భవిష్యత్తులో పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తారా?
 వర్మ: కల్యాణ్‌కున్న ఫాలోయింగ్, ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయన అభిమానుల్ని రంజింపచేసే విధంగా సినిమా తీసే సామర్థ్యం, సెన్సిబిలిటీస్ నాకు లేవు. అందుకే నేను తీయను, తీయలేను.

 మీ ట్వీట్‌లన్నీ గిచ్చే విధంగా ఉంటాయి. అంత డోన్ట్‌కేరా?
 వర్మ: ఇక్కడ డోన్ట్‌కేర్ అనేది ప్రశ్నే కాదు. ట్విట్టర్ అనేది మన అభిప్రాయాల్ని పలువురితో పంచుకోవడానికి ఉపకరించే వేదిక. నచ్చినవాళ్లు ఫాలో అవుతారు. నచ్చనివాళ్లు పట్టించుకోరు. ఎవర్నీ బలవంతంగా ఫాలో కమ్మనలేం కదా. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. మనకు నచ్చింది ఏదైనా చెప్పగలిగే స్వేచ్ఛ మనకుంది.

 మనోభావాలు గాయపడతాయని అనుకోరా?
 వర్మ: ఎవరి మనోభావాలు గాయపడతాయి? ఒక విషయం గురించి నా అభిప్రాయం వెల్లడిస్తానే కానీ, వ్యక్తిగతంగా ఎవర్నీ కామెంట్ చేయను.

 బాలీవుడ్ దర్శకుడు కరణ్‌జోహార్‌ని ఎక్కువ కామెంట్ చేస్తుంటారుగా?
 వర్మ: నేనెప్పుడూ తనని వ్యక్తిగతంగా విమర్శించలేదు. మా ఇద్దరి మధ్యనా ఏదో కోల్డ్‌వార్ జరుగుతోందని మీడియానే ఎక్కువ ఊహించేసుకుంటూ ఉంటుంది.

 రాజకీయాల గురించి మీ అభిప్రాయం?
 వర్మ: ఇందాకే చెప్పానుగా. నాకస్సలు అవగాహన లేదు.

 పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజ్‌గోపాల్ మీకు క్లోజ్‌ఫ్రెండ్ కదా!
 వర్మ: ఫ్రెండ్‌షిప్ వేరు. ప్రొఫెషన్‌వేరు. అతని రాజకీయాల గురించి నాకు తెలియదు నా సినిమాల గురించి అతనికి తెలియదు.

 మిమ్మల్ని రాజ్యసభకు నామినేట్ చేస్తానంటే?
 వర్మ: తెలిసి తెలిసి అంత మూర్ఖపు పని ఎవ్వరూ చేయరు. అయినా ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశం నాకేమాత్రం లేదు. ప్రజల కోసం పాటు పడాలనే మనస్తత్వం నాకు ఒక్క శాతం కూడా లేదు.

 అంటే... మీరు, మీ ప్రపంచం తప్ప ఇంకేమీ అవసరం లేదన్నమాట?
 వర్మ: అవును. నాకు నేనే ముఖ్యం. ‘మనం’ అనే పదం నా డిక్షనరీలో ఉండదు.

 పైకి ఇలా మాట్లాడతారు కానీ, మీరు రిలేషన్స్‌కి ప్రాధాన్యమిస్తారని మీ సన్నిహితులే చెబుతుంటారు?
 వర్మ: అది వాళ్ల అపోహ అంతే. వాళ్లని ఆ భ్రమల్లోనే ఉండనివ్వండి. నేను అనుకున్నంత చెడ్డవాణ్ణి కాదనేది వాళ్ల అభిప్రాయం. కానీ నేను వాళ్లు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ చెడ్డవాణ్ణి.

 నిజంగా చెడ్డవాడు కూడా తాను మంచోణ్ణనే చెప్పుకుంటాడు కదా!
 వర్మ: కానీ నేను నిజంగా చెడ్డవాణ్ణే. పెద్దలను గౌరవించకపోవడం, దేవుడంటే భక్తి లేకపోవడం, లెక్కలేని తనం... ఇలా సమాజం చెడ్డతనానికి నిర్వచనాలు పెట్టింది. ఆ కొలతల ప్రకారం చూస్తే నేను మహా చెడ్డవాణ్ణి.

 మీ నాన్నగారంటే మీకు బాగా ఇష్టమట. మీ నాన్నగారు చనిపోయిన పదేళ్ల తర్వాత గుర్తు చేసుకుని మరీ నానాపటేకర్ దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారట?
 వర్మ: ఆ సందర్భం వేరు. ఆ ఒక్క సంఘటనతోనే నన్ను జనరలైజ్ చేసేయొద్దు. నాలో నిజంగానే సద్గుణాలు లేవు.

 మీరు మొదట్నుంచీ ఇంతేనా?
 వర్మ: అవును. నాది మొదట్నుంచీ రాడికల్ నేచరే.

 మీ నాన్నగారి ప్రభావం మీపై ఎంతవరకూ ఉంది?
 వర్మ: మా నాన్నగారు వెరీ డిఫరెంట్. నాపై ఎవ్వరి ఇన్‌ఫ్లుయెన్సూ లేదు.

 ఇంత కరడుగట్టినట్టుగా ఉండే మీరు, మీ అమ్మాయి పెళ్లిని దగ్గరుండి జరిపించారుగా?
 వర్మ: ఏం చేశాను దగ్గరుండి? నేను కూడా అందరు గెస్ట్‌ల్లాగానే వెళ్లాను. చివరకు స్టేజ్ కూడా ఎక్కలేదు. పెళ్లిళ్లలో ఏవో తంతులు చేస్తుంటారు కదా. అవి కూడా చేయలేదు. అసలు నాకు ఈ వివాహ వ్యవస్థ మీదే నమ్మకం లేదు. అయితే నా ఇష్టాన్ని ఎవ్వరిమీదా బలవంతంగా రుద్దను.

 కనీసం మీ అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేశారా?
 వర్మ: నా గురించి అందరికీ తెలుసు. కాబట్టి వాళ్లూ అడగలేదు. నేనూ కడగలేదు. నేను చాలా సిల్లీ పనులు చేశాను, చేస్తాను. కానీ నాకు ఇష్టంలేని పనులు మాత్రం చేయను.

 మీ అమ్మాయి తన ప్రేమ గురించి చెప్పినప్పుడు మీరేమన్నారు?
 వర్మ: తనకు నచ్చిన పని తను చేసింది. ఇందులో నా ప్రమేయం ఏముంది? ఇదనే కాదు, నేను ఏ విషయంలోనూ ఎవ్వరికీ సలహాలు ఇవ్వను. సలహాలు తీసుకోను.

 పెళ్లి మీద ఏహ్యభావం ఎందుకని?
 వర్మ: నా దృష్టిలో పెళ్లంటే ఓ జైలు. జీవితాంతం ప్రేమలో ఉండడం కరెక్ట్. పెళ్లి చేసుకుంటే ఆ ప్రేమ పోతుందనేది నా ఫీలింగ్.

 మన భారతీయ వ్యవస్థలో పెళ్లి అనేది చాలా ముఖ్యం కదా!
 వర్మ: అదొక ఏస్పెక్ట్ అంతే. భారతదేశంలో విడాకులు తీసుకోరా? ఇక్కడ అందరు భార్యాభర్తలూ సుఖంగానే ఉన్నారా? ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి.

 పెళ్లి మీద మొదట్నుంచీ ఇదే అభిప్రాయమా?
 వర్మ: ఏ అభిప్రాయమైనా ఓ అనుభవం నుంచో, ఓ అవగాహన నుంచో వస్తుంది. ఈ అభిప్రాయం ఎప్పుడు పుట్టిందో కరెక్ట్ టైమ్ నేనూ చెప్పలేను.

 మీ అమ్మాయి పెళ్లికి వచ్చినవాళ్లు మిమ్మల్ని చూసి ఏమన్నారు?
 వర్మ: అక్కడ పెళ్లికి వచ్చిన చాలామంది నన్ను జోకర్‌లా చూడ్డానికే వచ్చారని నా ఫీలింగ్. వీడేం చేస్తాడో చూద్దామనే క్యూరియాసిటీనే ఎక్కువ కనిపించింది వాళ్లలో.

 మీ అల్లుడితో మాట్లాడారా?
 వర్మ: మాట్లాడాను. డీటైల్సేమీ అడగలేదు. తను డాక్టరని తెలుసు అంతే. నాకు సినిమా ఇండస్ట్రీ గురించి తప్పితే, వేరే ఫీల్డ్ గురించి అస్సలు అవగాహన లేదు. వాళ్లిద్దరూ డాక్టర్లు. నాకేమో హాస్పిటల్స్ అంటేనే అసహ్యం.

 మీరెప్పుడూ హాస్పిటల్‌కి వెళ్లలేదా?
 వర్మ: నేను ఒక కలల ప్రపంచంలో బ్రతుకుతాను. అందమైన అమ్మాయిలు, పవర్‌ఫుల్ హీరోలు, మంచిమ్యూజిక్... ఇలా నా ప్రపంచమంతా ఇదే. హాస్పిటల్ అనగానే ఏదో డిస్కనెక్ట్‌లాగా అనిపిస్తుంది. డార్క్ రియలిజాన్ని ఎప్పుడూ ఎవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఒక మనిషిని హాస్పిటల్ బెడ్ మీద చూడ్డానికి అస్సలు ఇష్టపడను. ఎవరైనా చనిపోతే నేను చూడ్డానికి వెళ్లను. అమితాబ్ బచ్చన్ గారికి నేను చాలా క్లోజ్. ఆయన మదర్ పోయినప్పుడు నేను చూడ్డానికి వెళ్లలేదు. డెడ్‌బాడీని చూడ్డం నాకస్సలు ఇష్టం ఉండదు. మనీషా కొయిరాలా నాకు చాలా క్లోజ్. తనకు కేన్సర్ వచ్చినప్పుడు నేను చూడ్డానికి వెళ్లలేదు. ‘నా లైఫ్‌లో నాకు నచ్చిన  బ్యూటీవి నువ్వు. అలాంటి నిన్ను హాస్పిటల్లో జుట్టులేకుండా చూడలేను’ అంటూ ఓ మెసేజ్ పంపించాను. తనకు నా గురించి బాగా తెలుసు కాబట్టి, వెంటనే అర్థం చేసుకోగలిగింది. ఎవరేమనుకున్నా నా కలల ప్రపంచంలోంచి నేను బయటకు రాను.

 హాస్పిటల్‌కు వెళ్లడం, వెళ్లకపోవడమనేది మన చేతుల్లో ఉండదు కదా?
 వర్మ: అది తెలుసు నాకు. అందుకే మన చేతిలో లేని దాని గురించి ఆలోచించను.

 ఒకవేళ హాస్పిటల్‌కు వెళ్లాల్సివస్తే?
 వర్మ: అవసరమొస్తే చస్తామా? వెళ్తాను. కానీ వెళ్లడం ఇష్టం లేదు.

 మీకిలా ఒంటరిగా ఉండటమే ఇష్టమా?
 వర్మ: చాలా. ఒంటరిగా ఉన్నా నాకస్సలు బోర్ కొట్టదు.

 ‘5డి’ కెమెరాతో కూడా సినిమా చేయొచ్చని ‘దొంగల ముఠా’ సినిమాతో నిరూపించారు. దానివల్ల ఎంత మంచి జరిగిందో, అంత చెడు కూడా జరిగిందని తెలుసా?
 వర్మ: మైనస్ జరిగిందని నేననుకోను. నా ఉద్దేశంలో ‘5డి’  అనేది ఫిలిం మేకింగ్‌ని డెమక్రటైజ్ చేసేసింది. దీనివల్ల ఎవరైనా సినిమా చేసేయ్యొచ్చు. అయితే ఎంత బాగా తీస్తారు, ఎలా రిలీజ్ చేస్తారన్నది నెక్ట్స్ లెవెల్. ఈ 5డి వల్ల కొంతమందైనా వెలుగులోకొచ్చి, వాళ్ల బతుకు వాళ్లు బతుకుతున్నారు. వర్కవుట్ అవ్వడం, కాకపోవడమన్నది వేరే సంగతి. 5డి అనే కాదు, ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ఇలాంటివి సర్వసాధారణం.

 భవిష్యత్తులో సినిమా మేకింగ్ ఎలా ఉండబోతుందనేది మీ అంచనా?
 వర్మ: భవిష్యత్తులో యాక్టర్స్, యానిమేషన్ రెండూ కలగలిసిపోవాల్సిందే. సెపరేట్ చేయడమనేది చాలా కష్టమైపోతుంది. యాక్టర్స్ ఇంపార్టెన్స్ కంప్లీట్‌గా పోతుంది. హాలీవుడ్‌లో ఇప్పటికే స్టార్ సిస్టమ్ కొలాప్స్. ఫిలిం మేకింగ్‌లో ఇంకా ఇంకా అడ్వాన్స్ అయిపోతాం. కొత్త కొత్త కెమెరాలొస్తాయి. నా ఉద్దేశంలో రెండేళ్ల తర్వాత ఆర్టిస్టులు కెమేరా వైపు చూడనవసరం లేదు. అసలు షూటింగ్‌లో కెమేరా అనేదే ఉండదు. మన కళ్లల్లాగా అన్నీ పిన్‌పాయింట్ థింగ్స్ ఉంటాయి. మన ఐబాల్ సైజులో కెమేరాలొచ్చేస్తాయి. ఇక ఆర్టిస్టులు ఎంతసేపూ కెమేరాను చూడడం, క్లోజా, మిడ్‌క్లోజా అని ఆలోచించడం అవసరం లేదు. కెమేరా కనపడనప్పుడు కచ్చితంగా వాళ్ల పెర్‌ఫార్మెన్స్ మారిపోతుంది. అది డెఫినెట్‌గా వస్తుంది. చాలా తొందరగా కూడా వస్తుంది. లైటింగ్, కెమేరాలు ఉండవు. జస్ట్ యాక్టర్స్ ఉంటే, డెరైక్టర్ వేరే రూమ్‌లో ఉండి, చిన్న మానిటర్‌లో చూసి ఏదైనా డైలాగు ఛేంజ్ చేస్తారేమో కానీ, పెద్ద యూనిట్ అనేది ఉండదు.

 ప్రతిభను ప్రోత్సహించే విషయంలో ముందుంటారు కానీ, పారితోషికాలు చెల్లించే విషయంలో చాలా వెనుక ఉంటారని కామెంట్. నా దగ్గర పనిచేయడమే మీకో పెద్ద ఫేవర్ అన్న ఫీలింగ్ చూపిస్తారటగా?

 వర్మ: సినిమా ఇండ్రస్టీ అనేకాదు, ఎక్కడైనా సరే డిమాండ్ అండ్ సప్లయ్‌లో నాకు ఇంత వర్త్, నేను ఇంత వర్త్ అని ఎక్కడా ఉండదు. నేను సినిమా తీయడానికి కంపెనీ పెడతాను కానీ, కేవలం జీతాలివ్వడానికి కాదు. నువ్వేం చేస్తావ్... దానికి ఎంత తీసుకుంటావ్... అంతవరకే. నీకు నచ్చకపోతే పని చేయొద్దు. ఎక్కడైనా అంతే. మీరో సెక్రటరీని పెట్టుకోవాలనుకుని, పది రూపాయలే ఇస్తానంటారు. అతను చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇవ్వడం నీవంతు అయితే వద్దనడం, కాదనడం అతని వంతు. ఇందులో డిస్కషన్ దేనికి?

 హైదరాబాద్‌లో మీకో కోటరీ ఉందని, మీరేం చేసినా ఆహా ఓహో అంటారని, మీరు కూడా ఆ ప్రశంసల వలయంలో చిక్కుకుపోయారని ఓ కామెంట్. ఏమంటారు?
 వర్మ: నన్ను పొగిడినా, తిట్టినా నేను కేర్ చేయను. నేనేంటో నాకు తెలుసు. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ పొగిడితే, వాడు వెధవ అనుకుంటాను. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ విమర్శించినా వాడు వెధవ అనుకుంటాను. నాకు చాలా ఇగో ఎక్కువ. ఇగో లేనివాడే పొగడ్తలకు పడతాడు. నా అంత ఇగో ఉన్నవాడు పొగడ్తలకు అస్సలు పడడు.

 మీకో బ్రాండ్ వేల్యూ ఉంది. దాన్ని మీ చేతులతో మీరే సర్వనాశనం చేసుకుంటున్నారని ఎప్పుడూ అనిపించలేదా?
 వర్మ: నేను హిట్ సినిమాకైనా, ఫ్లాప్ సినిమాకైనా సేమ్ ఎఫర్ట్ పెడతాను. మొదట్నుంచీ అంతే. ఎవ్వరైనా కూడా ఇంతే. ఫ్లాప్ ఎందుకొస్తుందని నన్నడిగితే, అసలు హిట్ ఎందుకొస్తుందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలిస్తే ఎందుకు ఫ్లాప్ తీస్తాను. నేను చేసేది నేను చేస్తాను. ఎలా వస్తుందో, రాదో అనేది నా కంట్రోల్లో ఉండదు. నా కంట్రోల్‌లో ఉన్నప్పుడు ప్రతిదీ హిట్టే చేస్తానుగా

 మీ మీద ఇంకో అపప్రథ కూడా ఉంది. మంచి స్పీడ్‌లో ఉన్న హీరోతో సినిమా చేసి, వారి స్పీడ్‌కి బ్రేక్ వేస్తారని ప్రతీతి. రవితేజకి ‘షాక్’, సునీల్‌కి ‘అప్పల్రాజు’, సూర్యకి ‘రక్తచరిత్ర’...
 వర్మ: వాళ్లకి ఫ్లాప్ ఇవ్వడమే నా ఉద్దేశమా? ఆ ఫ్లాపు నాకూ తగిలిందిగా. కావాలని ఎందుకు చేస్తాన్నేను.

 మీ శ్రీదేవి మళ్లీ యాక్ట్ చేస్తున్నారుగా. ఆవిడతో సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా?
 వర్మ: లేదండీ. నేను శ్రీదేవిగారికి అభిమానినే. కానీ ఆ అభిమానం అందం వరకూ మాత్రమే. కేవలం పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా ఆవిడతో సినిమా చేసే ఐడియా లేదు. వేరేవాళ్లు ఎవరైనా తీస్తే నేను హాయిగా టికెట్ కొనుక్కుని చూస్తాను.

 మీరు దేనికి భయపడతారు?
 వర్మ: నేను దేనికీ భయపడను. కానీ మనుషుల్లోని స్టుపిడిటీకి భయపడతాను. వాళ్లల్లోని బ్యాడ్‌నెస్‌కి, ఈవిల్‌నెస్‌కి భయపడను.

 అండర్ వరల్డ్‌ని ఎలా ఫేస్ చేయగలిగారు? వాళ్ల మధ్యనే ఉంటూ, వాళ్ల మీద సినిమాలు తీస్తూ సురక్షితంగా ఎలా ఉండగలిగారు?
 వర్మ: చిన్నప్పట్నుంచీ నాకది వెన్నతో పెట్టిన విద్య. వాళ్లు నన్ను బెదిరిస్తుంటారు. నేను వాళ్లని బెదిరిస్తుంటాను. నాకు ఎంతమంది అండర్‌వరల్డ్ వాళ్లు తెలుసో, అంతమంది పోలీసులు కూడా తెలుసు.

 రియల్ మాఫియా డాన్‌ని ఎవరినైనా కలిశారా?
 వర్మ: నో కామెంట్.

 మీకు చాలామంది శిష్యులున్నారు కదా. వాళ్లల్లో ది బెస్ట్ ఎవరనుకుంటారు?
 వర్మ: నాకు తెలిసి శిష్యులనేవారు ఎవ్వరూ ఉండరు. గురువు అనే కాన్సెప్ట్‌ని నమ్మను. నేనెవ్వరికీ ఏమీ నేర్పలేదు. మరి నన్ను గురువు అని అంటే, నా ఉద్దేశంలో అది ఇన్‌సల్టే అవుతుంది. ఎవరి దగ్గరనుంచైనా ఏం చేయకూడదో నేర్చుకోవాలి గానీ, ఏం చేయాలో నేర్చుకోకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఇండివిడ్యువాలిటీ ఉండదు. ఒకర్ని ఫాలో అవ్వడమంటే గొర్రె కింద లెక్క.

 స్త్రీ అంటే మీ దృష్టిలో?
 వర్మ: నాకు దేవుడి మీద చాలా కంప్లయింట్స్ ఉన్నాయి. కేవలం స్త్రీని సృష్టించాడన్న ఒకే ఒక్క కారణం మీద దేవుణ్ణి క్షమించేశాను.

 ప్రేమంటే?
 వర్మ: అది ఒక డ్రగ్‌లాంటిది. తీసుకునేటపుడు హైలో ఉంటుంది. తర్వాత లో అయిపోతుంది. దాన్ని అదే హైలెవెల్‌లో సస్టెయిన్ చేయాలంటే అమ్మాయి, అబ్బాయిలో హెవీ ఇన్‌వాల్వ్‌మెంట్ ఉండాలి. అది 99 శాతం మందికి ఉండదనేది నా ఫీలింగ్. 99 శాతం ప్రేమలు బయట ఫెయిలవ్వడానికి కారణం అదే. కేవలం సినిమాల్లోనే ప్రేమలు హిట్టవుతాయి.

 మీరెప్పుడూ ఆ లవ్ డ్రగ్‌కి ఎడిక్ట్ కాలేదా?
 వర్మ: నేను చాలాసార్లు అయ్యాను. ఇప్పటికీ అవుతూనే ఉంటాను.

 హీరోయిన్ ఊర్మిళ ఎక్కడున్నారు?
 వర్మ: ముంబైలో ఉంది.

 తను మీతో టచ్‌లో ఉందా? తను సినిమాల్లో యాక్ట్ చేస్తుందా?
 వర్మ: నాకు తెలియదు.

 ‘నిశ్శబ్ద్’ సినిమాతో మీరు పరిచయం చేసిన కథానాయిక జియాఖాన్ ఆత్మహత్య వార్త తెలిసినపుడు ఎలా రియాక్టయ్యారు?
 వర్మ: ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. తను నాకు బాగా క్లోజ్. 20 ఏళ్ల అమ్మాయి ఏ కారణాల రీత్యా ఆత్మహత్య చేసుకున్నా కూడా, అది నన్ను చాలా ఎఫెక్ట్ చేసింది.

 వృద్ధాప్యంలో మీరెలా ఉంటారో ఎప్పుడైనా ఊహించుకున్నారా?
 వర్మ: చెప్పానుగా... నాకు నచ్చనివి నేనెప్పుడూ ఊహించుకోను. నేనెప్పుడూ ఇలా సూపర్‌మేన్‌లాగా ఉంటాననేది నా కల. నన్నిలా నా కలల ప్రపంచంలో బతకనివ్వండి. ఓకేనా...

 -పులగం చిన్నారాయణ

 మీ లైఫ్‌స్టయిల్ ఎలా ఉంటుంది?

 వర్మ: నాకు నైట్ లైఫ్ ఎక్కువ. ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయం ఆరున్నర, ఏడు గంటలకల్లా నిద్రలేస్తాను. నేను రోజుకి 3, 4 గంటలు మించి నిద్రపోను. నిద్ర లేచాక కచ్చితంగా ఒక సినిమా చూస్తాను. సినిమా పూర్తయ్యాక జిమ్ చేస్తా. నాకు టోటల్‌గా సినిమానే ప్రపంచం. నో ఫ్రెండ్స్. ఎవ్వరి ఇంటికీ భోజనానికి వెళ్లను. బంధువుల ఇంటికీ వెళ్లను. గుడికి వెళ్లి 30, 40 ఏళ్లు అయ్యుంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ బలవంతం మీద ఒకసారి గుడికి వెళ్లాను. మా ఇంట్లో దేవుడు కూడా ఉండడు. పుస్తకాలు, సినిమాలూ అంతే! ముంబైలో నా ఫ్లాట్‌లో గెస్ట్ రూమ్ కూడా ఉండదు. పడుకుంటే నా బెడ్ మీదే పడుకోవాలి. లేకపోతే పడుకోకూడదు.

 మరి ఫుడ్?
 వర్మ: ఫుడ్ అస్సలు ఇంట్రస్ట్ ఉండదు. ఆకలి అనే ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి ఏదో తింటానంతే.

 ఫిట్‌నెస్‌కి బాగా ప్రాధాన్యత ఇస్తారనుకుంటాను?

 వర్మ: ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది నూటికి నూరుశాతం మనల్ని అలర్ట్‌గా ఉంచడానికి, లేజీనెస్ తీసేయడానికి, మెంటల్ ఎనర్జీకి ఉపకరిస్తుందని నా ఫీలింగ్. ఎగ్జైట్‌మెంట్ లెవెల్స్ అనేవి వెరీమచ్ క్లోజ్ టు ఫిజికల్ ఫిట్‌నెస్.

 మీరు కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డరా?

 వర్మ: బెల్ట్ ఏమీ లేదు కానీ, నేనొక మంచి ఫైటర్‌ననే అపోహ మాత్రం చాలామందికి కలిగించేవాణ్ణి.

 స్పోర్ట్స్ ఇంట్రస్టేనా?
 వర్మ: ఎప్పుడూ ఆడలేదు. ఒక్క దాగుడు మూతలు మాత్రం చిన్నప్పుడు ఆడేవాణ్ణి. క్రికెట్ అంటే బాగా చిరాకు. ఎందుకంటే హైస్కూల్లో ఉన్నప్పుడు ఓసారి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మోకాలికి తగిలి రెండు రోజులు బాధపడ్డాను. అప్పటినుంచీ క్రికెట్ వదిలేశాను.

 ************************

 ‘సిటిజన్ కేన్’ కన్నా ‘అడవిరాముడు’ 100 రెట్లు బెటర్! ‘సిటిజన్ కేన్’ నాకు బోర్ కొట్టింది. ‘అడవిరాముడు’ మాత్రం 17 సార్లు చూశాను. ఎప్పుడు చూసినా నాకు బోర్ కొట్టలేదు.

 నేను సివిల్ ఇంజినీరింగ్ చదువులో చాలా బ్యాడ్. దాదాపుగా కాపీ కొట్టి, లెక్చరర్లను కాకాపట్టి అత్తెసరు మార్కులతో పాసయ్యాను. కృష్టా ఒబెరాయ్ నిర్మాణ దశలో సైట్ ఇంజినీర్‌గా నెలకు 800 రూపాయలకు జాబ్ చేశాను. మహా అయితే ఇన్నేళ్లకో ప్రమోషన్ వచ్చి ఉండేదేమో. అంత బ్యాడ్ ఇంజినీర్‌ని.

 నేను చిన్నతనంలో జానపదాలు బాగా చూసేవాణ్ణి. ‘అగ్గి మీద గుగ్గిలం’ వంటి సినిమాలకు బాగా ఎట్రాక్ట్ అయ్యేవాణ్ణి.

 ఒకప్పడు హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇరానీ కేఫ్‌లు కనిపించేవి. ఇప్పుడంతా కాఫీ షాపులు, పబ్‌లమయం. చాలా షాకింగ్‌గానే ఉంది. ఒకప్పుడు నేను తిరిగిన ప్లేసులు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. కల్చర్, మనుషులు, డ్రెస్‌సెన్స్, ఆలోచనా విధానం మొత్తం మారిపోయింది. నాకు తెలిసిన హైదరాబాద్ ఈ హైదరాబాద్ ఒకటి కాదేమో అన్నట్టుగా మారిపోయింది.

 నేను త్వరలో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నాను. బ్లాక్ బెల్ట్ హోల్డర్ అమ్మాయిని ఎంపిక చేశాను కూడా. నేను బ్రూస్లీ సినిమాలు బాగా చూసేవాణ్ణి. అప్పట్నుంచీ అలాంటి సినిమా చేయాలని ఉండేది.

 ఒకప్పుడు హాలీవుడ్ సినిమా చేద్దామనుకున్నా. కానీ దానికి చాలా టైమ్ పడుతుంది. ఒకటి, రెండేళ్లు ఇక్కడ అన్నీ ఆపేసి అక్కడకు వెళ్లి పనిచేయాలి. ఆ టెంపర్‌మెంట్ ప్రస్తుతానికి లేదు.

 నేనింతవరకు ప్యూర్ లవ్ స్టోరీ చేయలేదు. ఇప్పుడిప్పుడే చేయాలనిపిస్తోంది. త్వరలో చేస్తాను.

 రామ్‌గోపాల్ వర్మ, డాటరాఫ్ వర్మ అంటూ నా పేరును టైటిల్స్‌గా వాడుకుని కొంతమంది సినిమాలు చేస్తున్నారు. దానిమీద నాకేం కోపంగా లేదు. ఎవరిష్టం వారిది. అసలు వాళ్లెందుకు చేస్తున్నారో నాకైతే తెలీదు. ఒకసారి ఆ సినిమాల ట్రయలర్స్ చూసి వాళ్లకు నా గురించి అర్థమైంది ఇంతేనా అనిపించింది.

http://www.sakshi.com/news/family/exclusive-interview-ram-gopal-varma-sakshi-family-67209
20:54 - By Swathi 0

0 comments:

Friday 20 September 2013

Womens's Heath

పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి

Sakshi | Updated: September 20, 2013 00:02 (IST)
పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి
హైదరాబాద్ : నా వయసు 15. రెండేళ్ల క్రితం మెన్సెస్ రావడం మొదలైంది. అప్పట్నుంచి పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా ప్రమాదమా? భవిష్యత్తులో నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? తగిన సలహా ఇవ్వండి.
 - ధరణి, ఏలూరు  


 రుతుక్రమం మొదలయ్యాక పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. చాలామంది యువతుల్లో ఇది కనిపించడం మామూలే.  దీన్ని చాలామంది ఒక జబ్బుగానో, లోపంగానో పరిగణిస్తారు. పిల్లలు పుడతారో లేదోనని అపోహలు పెంచుకుంటారు. అయితే ఇది చాలా సహజమైన అంశం.

 చాలామంది యువతులు పీరియడ్స్ సమయాన్ని అండం  విడుదలైన దశగా (ఓవ్యులేషన్ పీరియడ్‌గా) భావిస్తారు. కానీ... నిజానికి దీనికి 14 రోజుల ముందే అండం విడుదలై ఉంటుంది. అంటే పీరియడ్స్‌కు 14 రోజుల ముందే ఓవ్యులేషన్ పీరియడ్. అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం రాలిపోవడం అన్నది పీరియడ్స్ సమయంలో జరుగుతుంది. కాబట్టి దీన్ని అన్ ఓవ్యులేటెడ్ పీరియడ్‌గా పరిగణించాలి. ఈ సమయంలో నొప్పి ఉండటం ఎంత ఆరోగ్యకరమైన లక్షణం అంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి లేని యువతుల్లో కంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి ఉన్న యువతుల్లో పెళ్లి తర్వాత గర్భధారణకు అవకాశాలు చాలా  ఎక్కువ.

 పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. ఈ నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే నొప్పి తీవ్రతను బట్టి ప్రతి ఎనిమిది గంటలకు లేదా ప్రతి పన్నెండు గంటలకు ఒకటి చొప్పున రెండు మూడు నొప్పి నివారణ మాత్రలు వాడితే సరిపోతుంది.

 ఇలా రుతుసమయంలో వచ్చే నొప్పి 3, 4 రోజుల పాటు తగ్గకుండా అలాగే వస్తున్నా, లేదా నొప్పి నివారణ మందులు వాడాక కూడా నొప్పి తగ్గనంతటి తీవ్రతతో వస్తున్నా, లేదా పీరియడ్స్‌కూ, పీరియడ్స్‌కూ మధ్యన నొప్పి వస్తున్నా... డాక్టర్‌ను సంప్రదించండి. అంతేతప్ప పైన పేర్కొన్నట్లు సాధారణంగా వచ్చే రుతు సమయపు నొప్పి గురించి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు.

 డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
 ఫెర్నాండజ్ హాస్పిటల్,  హైదరాబాద్

Tags:

http://www.sakshi.com/news/family/gynic-problems-questions-and-answers-66670
02:50 - By Swathi 0

0 comments:

Saturday 14 September 2013

Venkat Akkineni With Sakshi

రిలేషణం: పైకి కనిపించని అనుబంధం మాది

Sakshi | Updated: September 01, 2013 02:43 (IST)
రిలేషణం: పైకి కనిపించని అనుబంధం మాది
అక్కినేని నాగార్జున... పరిచయం అవసరం లేని పేరు.
 వెంకట్ అక్కినేని... బయట పెద్దగా వినిపించని పేరు.
 ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఇద్దరే.
 ఒకరు తెరమీద, మరొకరు తెర వెనుక.
 కలల దారిలో ఇద్దరూ ఒకటిగా అడుగులు వేశారు.
 ఈ సృజనాత్మక ప్రయాణంలో  ఎన్నో విజయాలు, అపజయాలు, అద్భుతాలు...
 ఐతే ఒకరు ఫోకస్‌లో ఉండి మరొకరు ఔట్ ఫోకస్‌లో ఎందుకు ఉండిపోయారు?
 ఇద్దరూ ఏ విషయాల్లో ఏకీభవిస్తారు, ఎక్కడ విభేదిస్తారు?
 ఇద్దరూ కలిసి నడిచిన కాలాలు, తడియారని జ్ఞాపకాల గురించి వెంకట్ అక్కినేని అంతరంగం...


 ఈ పాతికేళ్లలో నాగార్జున లైఫ్ స్టైల్‌లో చాలా మార్పు వచ్చింది. నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మారాడు. అన్నమయ్య నుంచి దేవుని మీద భక్తి పెరిగిందనుకుంటా. ఇక తను అప్పుడూ ఇప్పుడూ హార్డ్ వర్కింగ్. ఆ విషయంలో ఎలాంటి మార్పూ లేదు.

     బాల్యంలో మీ అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండేది?
 నాన్నగారు సినిమాల్లో చాలా బిజీగా ఉండేవారు. కానీ మేం సినిమా ఆలోచన లేకుండా పెరిగాం. నేను, నాగ సుశీల దగ్గరి వయసువాళ్లం కాబట్టి ఎక్కువ క్లోజ్‌గా ఉండేవాళ్లం. నాగ్‌కు, నాకు ఐదేళ్లు తేడా. కాబట్టి మొదటి నుంచీ తన సర్కిల్ వేరు. నా సర్కిల్ వేరు. అయితే తనకు అమ్మమ్మతో చనువు ఎక్కువ. చదువుల రీత్యా కూడా వేరువేరుగా ఉండాల్సి రావడంతో మేం కలిసి పెరిగింది చాలా తక్కువ. 1975లో ఎం.బి.ఎ. కోసం యూఎస్ వెళ్లాను. నాగ్ చిన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడు. నేను యూఎస్ నుంచి వచ్చేసరికి చాలా హైట్ పెరిగి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. నేను వచ్చాక తను యూఎస్ వెళ్లిపోయాడు.

     సినిమాల్లోకి రావాలనేది మీ కలా? కేవలం యాదృచ్ఛికమా?
 మాది సినిమా కుటుంబమే అయినా మేం సినిమా ప్రపంచానికి దూరంగా, బాగా చదవాలని నాన్నగారు భావించేవారు. అంతకుముందు మా పేర్లమీద సినిమాలు తీసినా మాకు ప్రమేయం ఉండేది కాదు. కానీ అనుకోకుండా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. 1975లో నాన్నగారు అన్నపూర్ణా స్టూడియోస్ ప్రారంభించారు. నేను 1977లో అబ్రాడ్ నుంచి ఇండియాకు వచ్చాను. రాగానే స్టూడియో మేనేజ్‌మెంట్‌లో ఇన్‌వాల్వ్ అవ్వాల్సి వచ్చింది.

 అప్పటికి హైదరాబాద్‌లో ఎవరూ పెద్దగా షూటింగ్ చేసేవాళ్లు కాదు. దాంతో సంవత్సరానికి 25 లక్షలు నష్టం వచ్చేది. అలాంటి సమయంలో మాకు ప్రొడక్షన్ తప్ప వేరే దారి కనిపించలేదు. చాలామంది ఆర్టిస్ట్‌ల చుట్టూ, డెరైక్టర్ల చుట్టూ తిరిగాను. వాళ్లు ఏదో రకంగా తప్పుకునేవారు తప్ప మాతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అలా కొంతకాలం గడిచింది. నాగార్జున యూఎస్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చాడు. ఇక వేరేవాళ్ల చుట్టూ తిరిగే ఓపిక లేక, నువ్వు హీరోగా చేస్తావా అని నాగార్జునను అడిగాను. యా ఇట్స్ మై డ్రీమ్ అన్నాడు. ఇద్దరం నాన్నగారి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పాం. ఆయన కూడా ఓకే అన్నారు. అలా మా సారథ్యంలో విక్రమ్ మొదలైంది. అప్పట్లో అదంతా ఒక కలలా జరిగిపోయింది.

   మీరెప్పుడైనా హీరో కావాలనుకున్నారా?
 మొదటినుంచీ యాక్టర్ కావాలని అనుకోలేదు. నాన్నగారు ఆ ఆలోచనతో మమ్మల్నెప్పుడూ పెంచలేదు. చిన్నతనం నుంచీ మా ధాట్ ప్రాసెస్‌లో అది లేకపోవడం వల్ల జరగలేదు. కానీ హీరో అయ్యే క్యాపబిలిటీస్ నాలో ఉన్నట్లు నేను నమ్ముతాను. ఆ ఐడియా ఉంటే కచ్చితంగా హీరో అయ్యేవాణ్నేమో. ఆలోచన వచ్చేప్పటికి నేను హీరో వయసు దాటిపోయాను.

     తెర వెనుక మీ ఇంట్రస్ట్ ఏమిటి?
 ఒక దశలో డెరైక్టర్ కావాలనుకుని కొన్ని స్క్రిప్ట్‌ల మీద వర్క్ చేశాను. ఎందుకంటే నేను ప్రతీ దశలోనూ ప్రొడక్షన్‌తో ఇన్‌వాల్వ్ అయ్యాను. దాంతో నాకు డెరైక్టర్ కావాలన్న ఆలోచన వచ్చింది. నా టేస్ట్ మల్టీప్లెక్స్ సినిమాలకు దగ్గరగా ఉంటుంది. మన ఆడియన్స్ టేస్ట్, మార్కెట్ రేంజ్ ఆ స్థాయిలో లేదన్న ఉద్దేశంతో ఆ ప్రయత్నం  విరమించాను. ఎప్పటికైనా నా టేస్ట్‌కు తగ్గ సినిమా తీయాలనుంది.. అది కాకుండా ఎడిటింగ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. మా బ్యానర్‌లో చాలా సినిమాల ఎడిటింగ్‌లో నేను కీ-రోల్ ప్లే చేశాను.

     ఒక సక్సెస్‌ఫుల్ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకుడిగా ఉన్న మీరు మధ్యలో ఎందుకు వెనక్కి వచ్చారు?

 దాదాపు ఇరవై సంవత్సరాల పాటు తన వ్యవహారాలన్నీ నేనే చూసుకున్నాను. కథలు వినడం, ఏ నిర్మాతతో సినిమా చేయాలి, ఏ డెరైక్టర్‌తో పనిచేయాలి వంటి విషయాల్లో ఇన్‌వాల్వ్ అయ్యాను. ఒక దశకు వచ్చాక నాగ్‌కు సొంత నిర్ణయాలు తీసుకునే మెచ్యూరిటీ వచ్చింది. తనదైన ఐడియాలజీని రూపొందించుకుని తదనుగుణంగా కెరీర్ ప్లాన్ చేసుకునే స్థాయికి చేరుకున్నాడు. అప్పుడు నా అవసరం తనకు లేదనిపించింది. మరోవైపు ఒక దశలో మూవీ మేకింగ్ చాలా రిస్క్ అనిపించింది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ ఆర్గనైజ్డ్ బిజినెస్. అందులోనూ తను కూడా నిర్మాణంలో యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఒకే పని ఇద్దరం చేయడం కరెక్ట్ కాదనిపించింది. నేనిక రిలాక్స్ కావచ్చనిపించింది. ఈ విషయంలో నేను, నాగార్జున ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చాం.

     సినీ రంగంలో అక్కినేని వంశం అంటే నాగార్జున, నాగచైతన్య, అఖిల్... ఆ వరుసలో మీ పిల్లలు ఎక్కడా కనిపించరు ఎందుకని?
 బేసిక్‌గా మా పిల్లలకు సినిమా రంగం అంటే ఇష్టం లేదు. అబ్బాయి ఆదిత్యకు రేసింగ్ ఇష్టం. నాన్నగారికి ఆదిత్యను హీరో చేయాలని చాలా ఉండేది. తనకు కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. నేను చాలాసార్లు వాణ్ని అడిగి చూశాను. కానీ తనకు  ఇంట్రస్ట్ లేదని చెప్పాడు. నాకు తను సినిమాల్లోకి హీరోగా వస్తే బాగుండనిపించేది. మన ఆశల కన్నా పిల్లల ఆసక్తులకు ప్రయారిటీ ఇవ్వాలనుకున్నాను.తనకు ఇంట్రస్ట్ ఉన్న రంగం వైపు ప్రోత్సహించాను. ఇప్పుడు అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అమ్మాయి అన్నపూర్ణ ఆర్కిటెక్చర్ చేసి యూఎస్‌లో ఆర్కిటెక్ట్‌గా చేస్తోంది. తన టాలెంట్‌కు బోలెడన్ని అవార్డ్స్ వచ్చాయి. పిల్లలు వాళ్లు ఎంచుకున్న రంగంలో పేరు తెచ్చుకున్నారు. నాకదిచాలు.
     సినిమా నుంచి బయటకు వచ్చాక, ఏ వ్యాపారాలు చేపట్టారు?

 నాకు వైజాగ్ బేస్డ్‌గా ఫార్మా కంపెనీ ఉంది. దానికి ఎండీగా ప్రస్తుతం కంపెనీని విస్తరించే పనుల్లో ఉన్నాను. ఇంకా రకరకాల వెంచర్స్ చేస్తుంటాను. అన్నిటికన్నా నాకు ఫార్మింగ్ యాక్టివిటీ అంటే చాలా ఇష్టం. చిన్న స్కేల్‌లో హైడ్రోఫోనిక్స్ ద్వారా అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాం.
     మీకు, నాగార్జునకు మౌలికమైన తేడాలేమిటి?
 తనకు ఆరోగ్యం పట్ల, తనకు సంబంధించిన ప్రతి విషయంలోను చాలా జాగ్రత్త. బహుశా నేనంత జాగ్రత్తగా ఉండలేనేమో. అదే తేడా.
     మరి మీ ఇద్దరి మధ్య సారూప్యత?
 ఇద్దరికీ చాలా కోపమెక్కువ. అది స్వభావరీత్యా అలవడిందనుకుంటా. ఈ మధ్యే నేను కొంత తగ్గాను.
     మీ ఇద్దరిలో ఎవరు మంచి బిజినెస్‌మ్యాన్?
 నిస్సందేహంగా నాగార్జునే.
     ఇద్దరిలో రిస్క్ చేయడంలో ఎవరు ముందుంటారు?
 ఆ విషయంలో ఇద్దరమూ ముందుంటాం. రిస్క్ చేసే గుణం ఉంది కాబట్టే ఏమాత్రం అనుభవం లేని రామ్‌గోపాల్‌వర్మను దర్శకుడిగా పెట్టి ‘శివ’ తీశాం. రిస్క్ చేసే ధైర్యం ఉంది కాబట్టే నాగార్జున ‘అన్నమయ్య’ చేయగలిగాడు.
     నాగార్జునను నటుడిగా మీరు మెచ్చే సినిమాలు?
 రాజన్న, అన్నమయ్య, రామదాసు. సాయిబాబాలో తన నటన చాలా బాగున్నా, సినిమా సరిగా తీయలేదనేది నా అభిప్రాయం.
     ఇప్పుడు మీ మధ్య ఎలాంటి విషయాల్లో చర్చ జరుగుతుంది?
 మేం వారానికి రెండుసార్లు అన్నపూర్ణ స్టూడియోలో కలుస్తుంటాం. వీలైతే ఆదివారం నాన్నగారి ఇంట్లో అందరం కలుస్తాం. కలిసినప్పుడు మా ఇద్దరిమధ్యా లైఫ్‌స్టైల్, హెల్త్ విషయాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మేం ఆలోచించాల్సింది అవే కాబట్టి.  అన్నపూర్ణా స్టూడియోను ఏ రోజుకైనా ఫిలిం ప్రొడక్షన్‌లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆశయం.  
     మీ అనుబంధాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?
 ఇద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం. అలాగని చాలా దగ్గరగా ఉండే అన్నదమ్ములం కూడా కాదు. అందుకు ఒక కారణం ఏజ్ డిఫరెన్స్. రెండో కారణం... బంధం బలపడే వయసులో ఒక దగ్గర లేకపోవడం. కానీ ఏదైనా అవసరం వస్తే ఒకరి కోసం ఒకరం చాలా గట్టిగా నిలబడతాం.  డబ్బు అంత ప్రయారిటీ కాదు కాబట్టే మా మధ్య అనుబంధం అంత బలంగా వుంది.
     సినిమా, వ్యాపారం... వీటికి దూరంగా మీ హాబీలు?
 నాకు వైల్డ్ లైఫ్, ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నాను. ఇప్పుడు పరమహంస యోగానంద రాసిన ‘ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి’ చదువుతున్నాను.
 - కె.క్రాంతికుమార్‌రెడ్డి

23:42 - By Swathi 0

0 comments:

Jagapathi Babu with Sakshi

ఒకప్పుడు హార్టుని నమ్మేవాణ్ణి...ఇప్పుడు నోటుని నమ్ముతున్నాను

Sakshi | Updated: September 07, 2013 23:01 (IST)
ఒకప్పుడు హార్టుని నమ్మేవాణ్ణి...ఇప్పుడు నోటుని నమ్ముతున్నాను
హైదరాబాద్ :  ఇంతెత్తున ఉంటాడు.
 చక్కగా నవ్వుతాడు.
 వాయిస్ బాగుంటుంది.
 ఒక టైమ్‌లో...
 అమ్మాయిలకు బాగా నచ్చేసిన హీరో...
 జగపతిబాబు.
 బ్యాడ్ లక్.
 ఇప్పుడా హీరో లేడు. విలనైపోయాడు!
 ఫస్ట్ టైమ్, ఫుల్‌లెంగ్త్ నెగటివ్ రోల్‌లో...
 కనిపించబోతున్నాడు.
 నో ఇష్యూస్. అది క్యారెక్టర్.
 అసలైతే జగపతిబాబు ‘బ్యాడ్ బాయ్’ అనేవాళ్లున్నారు!
 అవునా?
 రిచ్‌గా ఉన్నాడు. డబ్బు పోయింది.
 అది బ్యాడా?!
 మనుషుల్ని నమ్మాడు. నమ్మకం పోయింది.
 అది బ్యాడా?
 ఇంకా ఏవేవో అంటారు ఆయన గురించి.
 అయితే ఎన్ని ‘బ్యాడ్స్’ ఉన్నా...
 వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసే గుడ్ ఒకటి...
 ఆయనలో ఉంది.
 అదే... ఇంటెగ్రిటీ! నిజాయితీ.
 జగపతిబాబు దాచుకున్నది లేదు.
 తన గురించి దాచిపెట్టిందీ లేదు.
 ఈవారం ‘తారాంతరంగం’ చదవండి.
 ఆయన  మీకు ఇంకా బాగా నచ్చేస్తారు.


 వీబీ రాజేంద్రప్రసాద్ లాంటి పెద్ద నిర్మాత కొడుకు మీరు... అంతా గోల్డెన్ స్పూన్ లైఫ్ అనుకుంటా...!
 జగపతిబాబు: అలా ఏం లేదండీ. పుట్టింది గోల్డ్‌స్పూన్‌తో అయినా, పెరిగిందంతా నార్మల్‌గానే! మా నాన్నగారిది పెద్ద సర్కిల్. మద్రాసులో అక్కినేని నాగేశ్వరరావుగారు, శివాజీ గణేశన్‌గారు, రామానాయుడుగారు, గుమ్మడిగారు, మేము పక్కపక్క ఇళ్లవాళ్లం. వాళ్ల పిల్లలు, మేము మంచి ఫ్రెండ్స్. సురేష్, వెంకటేష్, వెంకట్, నాగార్జున, గుమ్మడిగారబ్బాయి సత్తి, శివాజీగణేశన్‌గారబ్బాయిలు రామ్, ప్రభు, మొన్న చనిపోయిన జెమిని రవిశంకర్.. ఇలా అందరం కలిసి ఆడుకునేవాళ్లం. నేను ప్రపంచాన్ని చూసింది వీళ్లతోనే. లోకల్ బీచ్‌కెళ్లినా, ఫస్ట్ టైమ్ సింగపూర్ వెళ్లినా వీళ్లతోనే. సర్కిల్ పెద్దదే అయినా అమ్మ నిరాడంబరంగా పెంచింది. మేం ముగ్గురు అబ్బాయిలం. ఇంటి నుంచి బస్టాప్ వరకూ నడుచుకుంటూ వెళ్లి, రెండు బస్సులు మారి స్కూల్‌కి, ఎలక్ట్రిక్ ట్రెన్‌లో కాలేజ్‌కీ వెళ్లేవాళ్లం. బస్ టికెట్‌కి పోగా మిగిలిన 60 పైసలతో ఒక పరోటా తినేవాణ్ణి.

 స్కూల్ డేస్ గురించి...

 జగపతిబాబు: నాకు చదవడం అంటే పెద్ద భారం. స్కూల్ అంటే అసహ్యం. ఒక గదికి పరిమితం చేస్తే నేనస్సలు ఉండలేను. అందుకే క్లాస్‌రూమ్‌ను తల్చుకుంటే స్కూల్‌కి వెళ్లబుద్ధయ్యేది కాదు. స్వేచ్ఛని ఇష్టపడే మనస్తత్వం నాది. ఇది చెయ్యి.. అలా చెయ్యి అంటే నావల్ల కాదు. చదువు ఇంపార్టెన్స్ గురించి నాకు పెద్దగా తెలియదు. లక్కీగా ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదివాను కాబట్టి ఇంగ్లిష్ వచ్చింది. అది అడ్వాంటేజ్ అయ్యింది.

 ఎంతవరకూ చదువుకున్నారు?
 జగపతిబాబు: బీఏ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత చదవడం ఇష్టం లేదు. దాంతో వైజాగ్‌లో మా నాన్నగారి ఫర్నీచర్ షోరూమ్‌లోనే ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా చేరాను. అక్కడ లేబర్‌వర్క్ కూడా చేశాను. చెయ్యనంటే చదివిస్తారేమోనని భయం. అందుకే ఆ జాబ్ హ్యాపీ అనిపించింది.

 మరి.. హీరో అవ్వాలని ఎప్పుడు అనిపించింది?
 జగపతిబాబు: మా షోరూమ్‌కొచ్చినవాళ్లు ‘హీరో’గా చేయొచ్చుగా అంటుండడంతో, మెల్లగా నాలో కూడా ఆ ఆలోచన మొలకెత్తడం మొదలైంది. అది నాలో బలంగా వేళ్లూనుకున్నాకనే ఇంట్లోవాళ్లకి నా అభిలాష గురించి చెప్పాను. పెద్ద నిర్మాత కొడుకుని కాబట్టి... ఆ పరపతిని ఉపయోగించి అవకాశాలు తెచ్చుకోవాలని మాత్రం అనుకోలేదు. నాన్నగారు కూడా అందుకు వ్యతిరేకం.

 మొదట్లో మీ గొంతు బాగాలేదని విమర్శలొచ్చాయి. మీ పాత్రలకు వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారు కూడా. అప్పుడెలా అనిపించింది?
 జగపతిబాబు: నా వాయిస్ మీద నాకెప్పుడూ డౌట్ లేదు. ఇక్కడో ఉదాహరణ చెబుతా. సినిమాల్లోకొచ్చిన కొత్తలో అమితాబ్ బచ్చన్‌ని చాలామంది విమర్శించారు. హీరో మెటీరియల్ కాదన్నారు. ఇంత పొడవేంటి? అన్నారు. కానీ అమితాబ్ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. నేను ఆయనంతటివాణ్ణి కాదుకానీ, జస్ట్ ఉదాహరణగా చెప్పాను. నన్ను రిజెక్ట్ చేసినప్పుడు ఫీలవ్వలేదు. ఎవరైతే నా వాయిస్‌ని విమర్శించారో, వాళ్లే ఆ తర్వాత ప్లస్ అన్నారు. హీరోగా నేనేంటో ప్రూవ్ చేసుకున్నా.

 మిమ్మల్ని హీరోని చేసే ప్రయత్నంలో మీ నాన్నగారు నష్టపోయారు కదా. ఆ సమయంలో ఏమనిపించింది? వెనక్కి వెళ్లిపోదామనుకున్నారా?
 జగపతిబాబు: నాకు జీవితాన్ని చదవడం ఇష్టం. ఆ చదివే క్రమంలో ఎదురుదెబ్బలు తట్టుకునే స్థయిర్యం ఏర్పడింది. ఏదో రెండు మూడు ఫ్లాపులు వచ్చినంత మాత్రాన పారిపోయేంత పిరికివాణ్ణి కాదు నేను. నాన్నగారు నాతో ‘సింహస్వప్నం’, ‘అడవిలో అభిమన్యుడు..’ సినిమాలు తీశారు. కోటిన్నర పోయింది. అప్పులు కట్టడానికి మా ఇంటిని 45 లక్షలకు అమ్మేశారు. అప్పుడు మాత్రం బాధపడ్డాను.

 హీరోగా ఓ రేంజ్‌కొచ్చాక.. సడెన్‌గా డౌన్‌ఫాల్ అయ్యారు. కెరీర్ ప్లానింగ్‌లో లోపమా?

 జగపతిబాబు: మీరన్నది కరెక్టే. నా లైఫ్‌ని, కెరీర్‌ని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. ఇది ఫిలాసఫీ అనుకోండి.. వేరే ఏదైనా అనుకోండి. మొదటినుంచీ నా మైండ్‌లో ఉన్నది ఒక్కటే. మనం ఎప్పుడు పుడతామో తెలియదు.. ఏ క్షణాన చచ్చిపోతామో తెలియదు. మధ్యలోదంతా ఇంటర్వెల్. అంతా రాసి పెట్టి ఉంటుందని, మన చేతుల్లో ఏమీ ఉండదని, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందనీ నమ్ముతాను. అందుకే ప్లానింగ్ లేకుండా వెళ్లిపోతుంటా.

 ఎంత రాసి పెట్టి ఉన్నా, మానవ ప్రయత్నం ఉండాలిగా..!
 జగపతిబాబు: అది కూడా రాసి పెట్టే ఉంటుంది!

 అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు?
 జగపతిబాబు: కామన్‌సెన్స్‌తో చెబుతున్నా. నేను చాలా పీక్‌లో ఉన్నప్పుడు ‘మీరు గొప్ప నటుడు. బ్లాంక్ చెక్ ఇవ్వడానికి రెడీ’ అని కొంతమంది అంటే, పొంగిపోలేదు. ‘ఇప్పుడు నా టైమ్ బాగుంది కాబట్టి అభినందిస్తున్నారు. ఒకవేళ నా టైమ్ బాగాలేదనుకోండి అప్పుడు నన్ను గొప్ప నటుడనరు. కానీ నేను అప్పుడూ అదే జగపతిబాబు.. ఇప్పుడూ అదే జగపతిబాబు.

 అంటే.. టైమ్‌ని నమ్ముతారా?
 జగపతిబాబు: వందశాతం నమ్ముతా. నా కెరీర్‌లో గుడ్, బ్యాడ్ రెండు టైమ్‌లూ ఉన్నాయి. ఈ మధ్య బ్యాడ్‌టైమ్‌లో ఉన్నా. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న మంచి టైమ్ ఇప్పుడొచ్చింది. విలన్‌గా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఇప్పుడు బాలకృష్ణగారి సినిమాలో అవకాశం వచ్చింది. మంచి పారితోషికం. ఒకవేళ ఇదే కేరక్టర్ మూడేళ్ల క్రితం వచ్చి ఉంటే కొన్ని చెత్త సినిమాలు చేసి ఉండేవాణ్ణి కాదు. అప్పుడు టైమ్ కరెక్ట్‌గా లేదు కాబట్టి చేయకూడని సినిమాలు చేశానేమో. ఇప్పుడు టైమ్ బాగుంది కాబట్టి ఒకేరోజులో ఈ సినిమా ఓకే అయింది.

 సో... ఇప్పుడు విలన్‌గా చేయడం ఎలా అనిపిస్తోంది?
 జగపతిబాబు: ఎవరైనా హీరోగా చేయడానికే ఇష్టపడతారు. కానీ ఇంతకాలం విలన్లను నేను కొట్టాను... ఈసారి నన్ను కొట్టే అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడు లొకేషన్లో బాలకృష్ణగారు వస్తుంటే, అందరూ ‘హీరోగారు వస్తున్నారు’ అంటారు. అప్పుడు కొంచెం కలుక్కుమంటుంది. ఎందుకంటే పాతికేళ్లుగా నా షూటింగ్ లొకేషన్లో హీరో అంటే నేనే! ఇప్పుడు విలన్ అంటారు. హీరో అనే ఫీలింగ్‌ని ఓవర్‌కమ్ అవ్వడం నేర్చుకోవాలి. నేను మానసికంగా చాలా స్ట్రాంగ్. అందుకని ఇలాంటి వాటినుంచి త్వరగా బయటపడగలుగుతున్నాను.

 ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో మీరు పూర్ అని టాక్ ఉంది..?
 జగపతిబాబు: కరెక్టే! ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడంవల్లే నా లైఫ్ గాడి తప్పింది. ఈ కారణంగా మానసికంగా చాలా నలిగిపోయిన మాట వాస్తవం. షూటింగ్ లేక ఇంటిపట్టున కూర్చున్నప్పుడు బాధపడ్డాను. ఏది జరగాలని ఉంటే అది జరుగుతుందనే రకం నేను. అలాగని ఏం చేయకుండా ఇంట్లో కూర్చోలేదు. నా ప్రయత్నాలు నేను చేశా. అయినా ఇప్పుడేమైంది? లక్కీగా నాలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. ఇంకా బోల్డన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి కదా. హీరోగా, విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా... ఏదైనా చేయగలను. నేను పోగొట్టుకున్న డబ్బు మళ్లీ సంపాదించుకుంటాను.

 దేవుణ్ణి నమ్ముతారా?
 జగపతిబాబు: ప్రస్తుతానికి నేను భక్తుణ్ణి కాదు. దేవుడు ఉన్నాడని అనను. లేడని కూడా చెప్పను. రేపు టైమ్ వేరే విధంగా ఉందనుకోండి భక్తుణ్ణి అవ్వొచ్చేమో. సో.. భక్తి కలగడం కూడా టైమ్‌ని బట్టే ఉంటుందనుకుంటా!

 ‘జగపతిబాబు’కి ఇగో ఎక్కువ అని చాలామంది అనుకుంటారు. ఎందుకా ఇమేజ్ తెచ్చుకున్నారు?
 జగపతిబాబు: నాకు ఆత్మాభిమానం ఎక్కువ. నేను విలన్‌గా చేస్తున్నానని నన్ను వేరే రకంగా ట్రీట్ చేయొద్దు. నాకివ్వాల్సిన గౌరవం ఇవ్వాలని ముందే చెప్పా. అంతే తప్ప లొకేషన్‌కి వెళ్లి సరిగ్గా ట్రీట్ చేయలేదని గొడవపడను. ఇలా ఏదైనా ముందే ఓపెన్‌గా చెప్పేస్తా. అది ఇగో అంటే నేనేం చేయగలను? నేనెవరి దగ్గర్నుంచీ ఏమీ ఎదురు చూడను. నా లైఫ్ నేను బతుకుతున్నాను. ఎవర్నీ నమ్మను. ఇవాళ్టి ప్రపంచంలో దాదాపు దొంగలే ఉన్నారు. అయితే ఒక్కటి.. ఎవరో మోసం చేశారని నేను ఫీలవ్వడంలేదు. మోసపోవడానికి మనం ఎందుకు అవకాశం ఇచ్చాం? అనుకుంటాను.

 మీ మాటల్ని బట్టి... చాలామందిని నమ్మి మోసపోయారనిపిస్తోంది...
 జగపతిబాబు: ఫైనాన్షియల్‌గానే మోసపోయాను. పేర్లు అనవసరం. మనుషులను నమ్మకపోతే ఎవర్ని నమ్మాలి? అనుకునేవాణ్ణి. కొన్ని చేదు అనుభవాల వల్ల ఆ అభిప్రాయం మారింది. బేసిక్‌గా హార్ట్‌ని నమ్మేవాణ్ణి. కానీ ఇప్పుడు నోట్లని నమ్మాల్సి వస్తోంది. మన దగ్గరకు ఎంతోమంది వస్తారు. వీణ్ణి దోచేద్దామని స్కీమ్ వేసుకుని వచ్చేవాళ్లని కనిపెట్టలేం. ఆ పరంగా చాలా మోసాలు జరిగాయి. అప్పట్నుంచి నమ్మకం పోయింది. మనల్ని మనం కాపాడుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడానికి కొంత టైమ్ పట్టింది. మళ్లీ టైమ్‌కే వస్తున్నా కదా! (నవ్వుతూ)

 మీ లైఫ్‌స్టయిల్ కూడా చాలా లగ్జరీగా ఉంటుందట?
 జగపతిబాబు: అవును. జనరల్‌గా లగ్జరియస్‌గా ఉంటాను. డబ్బుంటే బయటికెళ్లి ఖర్చుపెడతాను. లేకపోతే ఇంట్లో కూర్చుంటాను.

 మోసపోవడంతో పాటు గోవాకెళ్లి కెసినోలు ఆడటం వల్ల కూడా మీ ఆర్థిక పరిస్థితి తారుమారయ్యిందని వినికిడి...
 జగపతిబాబు: గోవా మాత్రమే కాదు. లాస్‌వేగాస్ కూడా వెళ్లాను. అయితే అక్కడకు వెళ్లడంవల్లే ఆస్తులు పోయాయనడం కరెక్ట్ కాదు. నా ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో వెళ్తాను.  వాళ్లు పోగొట్టిన డబ్బులు కూడా నా అకౌంట్లో వేస్తే ఎలా? కెసినోల్లో మహా అయితే 30 లక్షలు పోగొట్టి ఉంటానేమో! దానివల్లే ఆస్తులు కరిగిపోవుగా!

 కెసినోలంటే ఎందుకంత క్రేజ్?
 జగపతిబాబు: ఆడటం అనేది ఒక పాయింట్ మాత్రమే. నాకు అక్కడి వాతావరణం చాలా ఇష్టం. చాలా రిచ్‌గా ఉంటుంది. లాస్‌వేగాస్‌లో అమ్మాయిలు చాలా బాగుంటారు. పెద్ద పెద్ద ధనవంతులు వస్తారు. లక్షలు తెచ్చి ఆడుతుంటారు. వాళ్ల గెలుపు, ఓటములు చూడటం కూడా నాకో ఇంట్రస్ట్. అలాగే అమ్మాయిలు ట్రేల్లో డ్రింక్స్ పెట్టుకుని, స్టయిల్‌గా నడుచుకుంటూ వచ్చి సర్వ్ చేస్తుంటే చూడటం ఇష్టం. అన్ని టేబుల్స్ తిరిగి చూసేవాణ్ణి. ఆ విధంగా బాగా ఎంజాయ్ చేసేవాణ్ణి.

 పెళ్లయ్యి, ఇద్దరు బిడ్డలకు తండ్రయిన మీరు.. ఇలా ఎంజాయ్‌మెంట్ కోసం గోవా, లాస్‌వేగాస్ వెళ్లడం కరెక్టేనా?
 జగపతిబాబు: ఓ రెండు మూడేళ్లు ఆలోచించలేదు... ఇప్పుడు ఆలోచిస్తున్నా! ఆర్థికంగా కూడబెట్టుకోలేదనే పశ్చాత్తాపం ఉన్నప్పటికీ లైఫ్‌ని ఎంజాయ్ చేశాననే సంతృప్తి ఉంది. నా సంపాదన నా కోసం కూడా. నా ఆనందాలను త్యాగం చేసేస్తే ఇంట్లోవాళ్ల మీద నిరాశా, నిస్పృహలు తప్ప ప్రేమ ఉండదు.

 ‘అమ్మాయిల మానస చోరుడ’నే బ్రాండ్ ఇమేజ్ మీపై బాగా ఉన్నట్టుంది?
 జగపతిబాబు: (నవ్వేస్తూ) ఎవరికి వాళ్లు అలా నాపై బ్రాండ్ వేసేశారు. నిజం చెప్పండి... అందమైన ఆడవాళ్లను ఏ మగాడు ఇష్టపడడు? నాకు ఆడవాళ్లంటే విపరీతమైన రెస్పెక్ట్ ఉంది. వాళ్ల సమక్షాన్ని ఆస్వాదిస్తాను. ఆడవాళ్ల సమక్షం అంటే ఏదేదో ఊహించుకోవాల్సిన అవసరంలేదు. వాళ్లతో కూర్చుని మాట్లాడుతూ ఉంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలా కొంతమందితో క్లోజ్‌గా అసోసియేట్ కావడం వల్లనో ఏమో నాకు అలాంటి ఇమేజ్ వచ్చేసింది. అలాగని నేను అందరితోనూ క్లోజ్‌గా మూవ్ కాను. బేసిగ్గా ముందు నాకా మనిషి నచ్చాలి. నచ్చడమంటే అందం ఒక్కటే కాదు. వ్యక్తిత్వం కూడా. ఆత్మవిశ్వాసం కనబరిచే ఆడవాళ్లను చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్‌ని బాగా లైక్ చేస్తాను.

 సౌందర్య కారణంగా మీ వైవాహిక జీవితంలో కొంచెం ఆటుపోట్లు వచ్చాయని అప్పట్లో ఓ వార్త వచ్చింది. సౌందర్యను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట?
 జగపతిబాబు: అది పచ్చి అబద్ధం! నాకూ సౌందర్యకు చాలాసార్లు ముహూర్తం పెట్టారు. నా భార్యకే ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి నేను, మా ఆవిడ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎవరో ఫోన్ చేసి, ‘పన్నెండున్నరకి సౌందర్యతో మీ పెళ్లని విన్నాము’ అన్నారు. అప్పుడు టైమ్ పన్నెండు పదయ్యింది. ఎవరో ఏదో ఊహించేసుకుని ఏదేదో చెప్పేస్తుంటారు. అఫ్‌కోర్స్ సౌందర్య నాకు చాలా క్లోజ్. తనెంత క్లోజో తన అన్నయ్య అమర్ కూడా అంతే క్లోజ్. ఆ విషయం బయటికి రాదు కదా. ఒకసారి నేనెవర్నో రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కెళ్లాను. అదే సమయంలో సౌందర్య ఎయిర్‌పోర్ట్‌కొచ్చింది. దాంతో సౌందర్య కోసమే వచ్చానని ప్రచారం చేశారు. సౌందర్య, అమర్ నాకు మంచి ఫ్రెండ్స్. ఓసారి నాకు 20 లక్షలు అవసరమైతే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అమర్ ఇచ్చాడు. ఆ తర్వాత నేను వెనక్కి ఇచ్చేశాను. మా మధ్య నమ్మకంతో కూడిన మంచి స్నేహం మాత్రమే ఉండేది. ఏదో కవర్ చేయడానికి నేనిలా చెప్పడంలేదు. నిజం చెప్పాను. ఇక్కడ బోయ్, గాళ్ అని కాదు.. ఫ్రెండ్‌షిప్ అనేది ఒకటుంటుంది. కానీ దాన్ని దాటేసి ఆలోచిస్తారు. అదే ప్రాబ్లమ్!

 సౌందర్య మరణ వార్త విన్నప్పుడు ఎలా అనిపించింది?

 జగపతిబాబు: అప్పుడు మలేసియాలో ఉన్నాను. మా అన్నయ్య ఫోన్ చేసి, ‘బ్యాడ్ న్యూస్... సౌందర్య చనిపోయింది’ అన్నాడు. నేనేమీ అనలేదు. ‘అమర్ కూడా చనిపోయాడా? చనిపోయి ఉంటే ఫోన్ చేయొద్దు’ అన్నాను. నాకు తెలుసు... అమర్ కూడా చనిపోయి ఉంటాడని! ఆ అన్నాచెల్లెళ్ల అనుబంధం అలాంటిది.

 మీ మీదున్న ఇమేజ్ కారణంగా, సౌందర్య విషయంలోనూ మీ భార్య ఎప్పుడూ అభద్రతాభావానికి గురవ్వలేదా?
 జగపతిబాబు: ఫీలయ్యిందో లేదో నాకు తెలియదు. కానీ ఎప్పుడూ కూల్‌గానే ఉంటుంది. పెళ్లప్పుడు నేను తనతో ఒకటే చెప్పాను. ‘సినిమా ఇండస్ట్రీ అంటే ఎఫైర్లు ఉంటాయి. నువ్వు మెంటల్లీ ప్రిపేర్ అయితేనే ఇండస్ట్రీకి వెళతాను. లేకపోతే లేదు’ అని! ‘ఎక్కడికైనా వెళ్లండి.. కానీ ఇంటికి రండి’ అని కూల్‌గా చెప్పింది తను. అప్పుడప్పుడూ ఎవరైనా ఫీలవుతారు. నేను తనను బాగా చూసుకుంటాను. తను కూడా నన్ను చాలా అర్థం చేసుకుంటుంది. అంత అర్థం చేసుకునే భార్య లభించడం ఏ హీరోకైనా అదృష్టం. ఫైనాన్షియల్‌గా చేదు అనుభవాలు ఎదురైనప్పుడు కూడా మా మధ్య ఏదైనా చిన్నపాటి డిస్కషన్స్ జరిగి ఉంటాయేమో కానీ.. పెద్ద పెద్ద డిస్కషన్లు జరగలేదు.

 మీది ఎరేంజ్డ్ మ్యారేజా? లవ్వా?
 జగపతిబాబు: లవ్ మ్యారేజే! అయితే పెద్దలను ఒప్పించే ప్రక్రియలో చిన్నపాటి చర్చలు కూడా జరిగాయి. సరిగ్గా అప్పుడు నేను వైజాగ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను. ఖాళీ దొరికితే పిట్టగోడమీద పడుకుని వాక్‌మాన్ పెట్టుకుని పాటలు వినేవాణ్ణి! కొండలు, చెట్లు.. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. దాంతో పాటలు వింటుంటే, నిద్ర పట్టేసింది. నిద్రలో మంచం మీద పక్కకు తిరిగినట్లుగా తిరిగా. అంతే.. 30 అడుగుల పైనుంచి కిందపడిపోయా. బాగా దెబ్బలు తగిలాయి. నేను అలా పడిపోవడాన్ని మా నాన్నగారు వేరేలా అర్థం చేసుకున్నారు. ప్రేమకోసం ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాననుకుని, పెళ్లికి ఒప్పుకున్నారు. భలే కనెక్ట్ అయ్యిందనుకుని, నేను కూడా సెలైంట్ అయిపోయా.

 ఫాదర్‌గా మీరెంతవరకు బెస్ట్?
 జగపతిబాబు: నా పిల్లలంటే నాకు చాలా ప్రేమ. ఫాదర్‌లా ఉండను. ఫ్రెండ్‌లా ఉంటాను. వాళ్లేం అడిగినా కాదనను. కానీ, ఫైనాన్షియల్ వైజ్‌గా నేను గుడ్ ఫాదర్ కాదు.

 ఫైనాన్షియల్ స్టేటస్ గురించి పిల్లలు ఏం అంటుంటారు?
 జగపతిబాబు: పెద్దమ్మాయి ఎప్పుడూ అనలేదు. చిన్నమ్మాయికి ఇప్పుడు పదిహేనేళ్లు. ఏమో.. రేపు ఎప్పుడైనా అంటుందేమో! నా పిల్లలు అడిగినదానికన్నా ఓ రూపాయి ఎక్కువే ఇస్తాను. అమెరికాలో చదువుకుంటానంటే ఓకే అన్నాను. ఆర్థిక ఇబ్బందులేమైనా ఉంటే ఆ బాధేదో నేను పడతాను కానీ నా పిల్లలకు తెలియనివ్వను. ఒకవేళ నాకేమైనా అయ్యిందనుకోండి.. అప్పుడు ఇన్సూరెన్స్ రూపంలో నా పిల్లలకు కావాల్సిన సేఫ్టీ క్రియేట్ చేశాను. వాళ్ల భవిష్యత్తు సెక్యూర్టీ కూడా చూసుకున్నాను. నేనేం మరీ బాధ్యతారాహిత్యమైన ఫాదర్‌ని కాను. కాకపోతే జీవితం నేర్పిన పాఠాలవల్ల ఇప్పుడు ఖర్చు తగ్గించేశాను. జాగ్రత్తపడుతున్నాను. అయినా నా పిల్లలు కరెన్సీ గురించి ఆలోచించరు. ‘మా నాన్నకి మేమంటే చాలా ప్రేమ’ అనే నమ్మకం వాళ్లకుంది. మా నాన్నను నేనెప్పుడూ డబ్బు అడగలేదు. చాలామంది ‘మా బాబు ఏం ఇచ్చాడు.. ఏమీ ఇవ్వలేదు’ అని తిట్టడం మా బంధువులో కూడా చూశాను. వాళ్లని తెగ తిట్టేవాణ్ణి.

 మీరు సిగరెట్లు బాగా కాలుస్తారు కదా..!
 జగపతిబాబు: అవును. అది తప్పే. నాకా విషయం తెలుసు. నన్ను చూసి నా అభిమానులూ ఫాలో అవుతారనీ తెలుసు. ‘అంతఃపురం’ చూసి చాలామంది ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారు. అది గొప్పగా అనిపించలేదు... బ్యాడ్‌గా ఫీలయ్యాను.

 అసలెప్పుడు అలవాటయ్యింది?
 జగపతిబాబు: మా మామయ్య కాల్చేసిన చుట్టతో మొదలైంది. అది అలవాటుగా మారిపోయింది. నేనెప్పుడూ రాడికల్. ఎంత రాడికల్ అంటే.. ఎక్కడైనా టైస్టులు ఉన్నారని తెలిస్తే, వాళ్లని చూడ్డానికి వెళ్లేవాణ్ణి. పోలీసుల గన్ ఫైరింగ్‌ని స్వయంగా చూసినవాణ్ణి. అన్నీ చూడాలనుకుంటాను. అన్నీ ట్రై చేయాలనుకునే మనస్తత్వం. అన్ని ఆశ్రమాలకు వెళ్లాను. హిమాలయాలకు వెళ్లాను. ధ్యానం చేశాను. ఈ మొత్తం ఒక రౌండ్ చూసేశాను.. చేసేశాను. ఇక చాలని ఫిక్స్ అయ్యాను.

 ఎప్పుడైనా సిగరెట్ మానడానికి ట్రై చేశారా?
 జగపతిబాబు: చాలా ప్రయత్నం చేశాను. కొకైన్, హెరాయిన్ అన్నిటికన్నా సిగరెట్ చాలా వరస్ట్ డ్రగ్. అందుకే దానికి దూరంగా ఉండాలనుకున్నాను. లాస్ ఏంజిల్స్‌లో సిగరెట్ మాన్పించడానికి ఏదో రేడియాలజీ చేస్తున్నారని విని, వెళ్లాను. దాదాపు 20, 30 లక్షలు ఖర్చు పెట్టాను. అక్కడా మోసమే ఎదురైంది. డబ్బులు పోయాయి కానీ నా సిగరెట్ నాకు వెనక్కొచ్చేసింది (నవ్వుతూ).

 మిమ్మల్ని కొంతమంది నిర్మాతలు శాటిలైట్ రైట్స్ కోసం వాడుకుని, సినిమాలు చేశారు. అలా వాడుకుంటున్నారని మీరు గ్రహించలేదా? లేక డబ్బు కోసం చేశారా?
 జగపతిబాబు: నాకంత దూరపు ఆలోచన ఉండదు. ఎంత శాటిలైట్ హక్కులు వస్తాయో కూడా ఊహించేవాణ్ణి కాదు. ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు చేయొచ్చు కదా అనుకున్నాను. ఫ్రాంక్‌గా చెప్పాలంటే డబ్బుల కోసమే చేశానని చెప్పొచ్చు.

 అడగనిదే అమ్మయినా పెట్టదంటారు కాబట్టి, ఖాళీగా ఉన్నప్పుడు ఎవరినైనా అవకాశాలు అడిగారా?

 జగపతిబాబు: నేను పరిశ్రమకు వచ్చి దాదాపు ఇరవయ్యేళ్లయ్యింది. ఇప్పటివరకు ఏ సినిమా ఆఫీసుకీ వెళ్లి అవకాశాలు అడగలేదు. నాతో సినిమా చేయాలనుకున్నవాళ్లు ఎలానూ చేస్తారు. చేయాలనుకోనివాళ్లు అడిగినా చెయ్యరు. ఒకప్పుడు రామ్‌గోపాల్‌వర్మ దగ్గర ఇదే విషయం గురించి చర్చ వచ్చింది ‘‘నేను నీకు బాగా తెలుసు కదా.. నన్ను ఛాన్స్ అడగవు ఎందుకని?’’ అన్నాడు రాము. దానికి సమాధానంగా నేను ‘రామూ... నువ్వు మంచి డెరైక్టర్. ఒక మంచి డెరైక్టర్‌కి కళాకారుడు కనబడితే, ఏ మూల దాగున్నా తనే వచ్చి అడుగుతాడు. ఒకవేళ నేను అడిగి, నువ్వు అవకాశం ఇస్తే.. నీమీద నాకు మర్యాద పోతుంది. అదే ఓ కళాకారుడ్ని గుర్తించి నువ్వు సినిమా చేశావనుకో.. అప్పుడు నాకు గౌరవం ఉంటుంది’’ అన్నాను. ఫైనల్‌గా నేను ‘గాయం’ కి సూట్ అవుతానని తీసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెబుతా... ఎలాగైనా అవకాశాలు కొట్టేయాలని మందు అలవాటున్న నిర్మాతలకు అది ఆఫర్ చేసి, వీక్ మూమెంట్‌లో అవకాశం అడగొచ్చు. నాకది ఇష్టం ఉండదు. షూటింగ్ పేకప్ చెప్పిన తర్వాత బిజినెస్ మాట్లాడను. మందు కొట్టిన తర్వాత అస్సలు మాట్లాడను. ఒకరి వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకునే మనస్తత్వం కాదు నాది. అలా చేస్తే అది ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క అని నా అభిప్రాయం.

 జగపతిబాబుకి అహం ఎక్కువన్నా ఫర్వాలేదు. నేను మాత్రం ఎవర్నీ అవకాశాలు అడగను. ముక్కుసూటిగానే మాట్లాడతాను. నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. అబద్ధం ఆడాలంటే తెలివి ఉండాలని ఆ మధ్య ఏయన్నార్‌గారు అన్నారు. ఆ మాటలు నిజం. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అందుకే అబద్ధం ఆడకపోవడమే బెటర్. నిజాయితీగా బతకడంలో ఓ ఆనందం ఉంది. జగపతిబాబు ఎప్పుడూ అలానే బతికాడు... బతుకుతాడు!

 - డి.జి. భవాని

 సుస్మితాసేన్ మా ఫ్యామిలీలో ఓ మెంబర్ అయ్యింది...
 మా ‘జగపతి’ బేనర్‌పై సినిమాలు తీసే ఆలోచనే లేదు. ఎందుకంటే నాన్నగారిలా నేను కూడా బ్యాడ్ బిజినెస్‌మేన్. హాయిగా నిర్మాతలు వచ్చి డబ్బులిస్తుంటే, యాక్ట్ చేయడం సుఖం.

 మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరికీ డబ్బు పిచ్చి లేదు. మా పెద్ద అన్నయ్య రామ్‌ప్రసాద్ మనీ మేనేజ్‌మెంట్‌లో బెస్ట్. రెండో అన్నయ్య యోగేంద్రకుమార్ అచ్చం నాలానే ఉంటాడు. నా టైపే.

 మా పెద్దమ్మాయి మేఘన అమెరికాలో, చిన్నమ్మాయి లేఖ పుణెలో చదువుకుంటున్నారు. ఇక్కడుంటే మా నాన్నకు బెంజ్ కారు ఉంది.. అంటూ పోటీలు పడటం, పనోళ్లను ఒరేయ్ అరేయ్ అనడం... ఇవన్నీ నాకు నచ్చదు. అందుకే అక్కడికి పంపించాను. మనుషులను ఎలా గౌరవించాలి? లాంటి ఎన్నో విలువలను నేర్పించే ఇన్‌స్టిట్యూషన్స్‌లో చదువుతున్నారు.

 మా అన్నయ్య రామ్‌ప్రసాద్‌కి సుస్మితాసేన్ మంచి ఫ్రెండ్. నాగార్జున ద్వారా అన్నయ్యకు తనతో పరిచయం అయ్యిందనుకుంటా. అలా మా ఫ్యామిలీ అందరితో తనకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. బేసిక్‌గా తను చాలా నైస్ పర్సన్. సింపుల్‌గా ఉంటుంది. ప్రేమగా ఉంటుంది. ఇప్పుడు తను మా ఫ్యామిలీలో ఓ మెంబర్‌లా అయ్యింది.

 చిన్నప్పుడు గోలీ సోడా బాగా తాగేవాణ్ణి. ఒక్క సోడా ఖరీదు పది పైసలుండేది. గోలీ సోడా కొడుతుంటే ఆ సౌండ్ భలే ఉంటుంది.

 పెళ్లనేది ఓ మంచి అనుబంధం. నేను కట్నానికి వ్యతిరేకం. నేను తీసుకోలేదు. ఒకవేళ నాకు కొడుకులు ఉండి ఉంటే కట్నం తీసుకోనిచ్చేవాణ్ణి కాదు. దమ్మున్న మగాడైతే నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. తండ్రి ఇస్తాడని, భార్య తెస్తుందని ఎదురు చూడకూడదన్నది నా అభిప్రాయం.

 భూమిలో పాతిపెట్టి మర్చిపోయారు
 నాకు ధ్యానం చేయడం ఇష్టం. ‘జగపతి’ సినిమా అప్పుడు నన్ను కాపాడింది అదే. శవపేటికలో నన్ను పెట్టి, దానిపైన కళ్యాణమండపం సెట్‌తో షూటింగ్ ప్లాన్ చేశాం. భూమిలో నిజంగానే నన్ను పాతిపెట్టమన్నాను. ఆ సీన్ చేయడానికి నేనే ఒప్పుకున్నాను. మూడు టేక్స్‌కి కానీ సీన్ ఓకే అవలేదు. ఆ టేక్స్ తర్వాత, మండపం సెట్ తీసేశారు. కానీ, నన్నెక్కడ పాతిపెట్టారో మర్చిపోయారు. దాంతో టెన్షన్‌తో తవ్వడం మొదలుపెట్టారు. లోపల ఆక్సిజన్ లేదు. సిలిండర్ కొనమంటే, మా నిర్మాత కొనలేదు. నాకు ధ్యానం చేసే అలవాటుంది కాబట్టి, శ్వాసను ఓ పద్ధతిలో పీల్చి వదలడం మొదలుపెట్టాను. దానివల్ల ప్రాణాపాయం నుంచి బయటపట్టాను. నేను లోపల అలా శ్వాస తీసుకుంటుంటే, ఈలోపు నన్ను పాతిపెట్టిన ప్లేస్‌ని యూనిట్ సభ్యులు గుర్తుపట్టి, బయటకు తీశారు. నేను జాతకాలను పెద్దగా నమ్మను. కానీ ఆరోజు ఒకావిడ ఫోన్ చేసి, ‘మీరు బాగానే ఉన్నారా?’ అనడిగారు. బాగానే ఉన్నానని చెప్పాను. ‘మీకు మరణగండం ఉంది.. అందుకే అడిగా’ అన్నారావిడ.

23:41 - By Swathi 0

0 comments:

R NARAYANAMURTHY WITH SAKSI

హైదరాబాద్ : నారాయణమూర్తి నడినెత్తి సూరీడు.
 అతడికి పొద్దుల్లేవ్... ఏ హద్దుల్లేవ్!
 భగభగ... భగభగ... భగభగ...
 కణకణ  తీక్షణ, జ్వలించే వీక్షణ...!
 అన్యాయాన్ని చూస్తే అగ్గైపోతాడు.
 అధర్మంపై ఆగ్రహోదగ్రుడౌతాడు.
 సినిమాలూ అంతే... ఫిల్మీ ఇన్‌ఫ్లేమబుల్!
 ఈవారం ‘తారాంతరంగం’లో మీకతడు చల్లగా నవ్వుతూ కనిపించవచ్చు.
 చెప్పలేం, ఆ నవ్వు కూడా ఒక...
 రెవల్యూషనరీ స్టేట్‌మెంట్ కావచ్చు!

 
పోరుబాటలో ఓ వ్యక్తి నడుస్తున్నాడు అంటే... దాని వెనుక కచ్చితంగా ధర్మాగ్రహం ఉండుండాలి...
 ఆర్.నారాయణమూర్తి: నువ్వన్నది నిజం సోదరా... మనిషిని ఉద్యమదిశగా నడిపించేది ధర్మాగ్రహమే. అందుకు నా జీవితమే ఉదాహరణ. మా ఊళ్లో జోగయ్య అనే దళితుడు ఉండేవాడు. ఆయన్ను ‘మామయ్య...’ అని పిలిచేవాణ్ణి. ఊరందరికీ ఆయన సేవ చేసేవాడు. ఊరి జనాలు కూడా ఆయన్ను కలవరించేవారు. కానీ కలవరించేది ప్రేమతోకాదు... అవసరాలు తీర్చుకోడానికి! జనం ఆయనకు అన్నం పెట్టే తీరు హృదయ విదారకంగా ఉండేది. అంటరాని వాడికి పెడుతున్నట్లు ఆమడదూరంలో నిలబడి, గంజి ఎత్తి పోసేవారు. అది చూసి రగిలిపోయేవాణ్ణి. ‘ఊరందరికీ అంత సేవ చేసే ఆయన్ను.. ఇంట్లో కూర్చోబెట్టి ఎందుకు అన్నం పెట్టకూడదు? నూతులు తవ్వేది వాళ్లు... కానీ ఆ నూతుల్లో నీళ్లు తాగే అర్హత వాళ్లకు లేదు. గుళ్లు కట్టేది వాళ్లు... కానీ గుళ్లోకొచ్చి దేవుణ్ణి దణ్ణం పెట్టుకునే యోగం వాళ్లకు లేదు! ఇదెక్కడి న్యాయం?’ ఈ ప్రశ్నలు నా హృదయాన్ని తొలిచేస్తుండేవి. ఓ రోజు నా కన్నతల్లి కూడా ఆయనకు అలాగే అన్నం పెట్టడం చూశాను. చెప్పలేనంత కోపం వచ్చింది. ‘ఏంటమ్మా ఈ పని?’ అని అమ్మను కోపంగా అడిగేశాను. ‘తప్పురా... మనం అతన్ని తాకకూడదు’ అంది అమ్మ. ‘ఎందుకు తాకకూడదు? నువ్వూ మనిషివే, ఆయనా మనిషే! ఏంటీ అంటరానితనం’ అని సూటిగా అడిగేశాను. ఇంతలో నా చెంప ఛెళ్లుమంది. కళ్లు బైర్లు కమ్మాయి. కళ్లు తెరిచి ఎవరో చూశాను. ఎదురుగా నాన్న! సాటి మనిషిని అమ్మానాన్నలే అంటరానివాడిగా చూడ్డం తట్టుకోలేకపోయాను. నాలో అభ్యుదయభావాలకు బీజం పడింది అప్పుడే!  అలాగే... స్కూల్లో కలిగినవారి పిల్లలందరితో... మా పంతుళ్లు  బ్యాడ్మింటన్ ఆడించేవాళ్లు. మాలాంటి పేద పిల్లలు మాత్రం చూస్తూ కూర్చోవాలి. ఇదెక్కడి న్యాయం? అని అడిగా... మళ్లీ నా చెంప చెళ్లు మంది. ఎదురుగా మాస్టర్! ఇది నా రెండో అనుభవం! పెద్దాపురంలో కాలేజ్‌లో చేరాను. అక్కడ సత్రం ప్రెసిడెంట్ అయ్యాను. పెద్దాపురం మహారాణి రాజావత్సవాయి బుచ్చిసీతయ్యమ్మగారు పేద ప్రజానీకానికి రాసిచ్చేసిన ఆస్తిలో ఆ సత్రం ఒకటి. నాలాంటి పేద విద్యార్థులందరూ ఆ సత్రంలోనే భోంచేసేవారు. అన్నం తినేటప్పుడు కూరల్లో పురుగులేమైనా కనిపించినా, అన్నం సరిగ్గా పెట్టకపోయినా... వెంటనే గొడవ పెట్టేసుకునేవాణ్ణి. దేవాదాయ శాఖకు చెందిన చింతపల్లి నరసింహారావుగారని ఓ పెద్దాయన ఉండేవారు. నా గొడవలు పడలేక ఓ సారి ఆయన మా నాన్నను పిలిపించాడు. ‘ఏరా... నువ్వేమైనా గాంధీ అనుకుంటున్నావా?’ అని మా నాన్న సమక్షంలో అడిగాడాయన. ‘నేనంత గొప్పోణ్ణి కాదులేండీ..’ అని దురుసుగా సమాధానం చెప్పాను. ఈ సారి చెంపచెళ్ళుమనడం కాదు... పెద్దాపురం రోడ్ల మీద తన్నుకుంటూ తీసుకెళ్లాడు నాన్న! అన్యాయంపై ఎదురుతిరిగిన ప్రతిసారీ... నాకు దెబ్బలే! అవి నాలో భయాన్ని పెంచాల్సిందిపోయి కసిని పెంచాయి. తప్పు జరిగిందనిపిస్తే... ఎదురున్నది ఎంత పెద్దవారైనా సరే... కడిగిపారేసేవాణ్ణి. .
 
 తొలిసారి ఎర్రకండువా ఎప్పుడు కప్పుకున్నారు?
 ఆర్.నారాయణమూర్తి: ‘కమ్యూనిస్ట్’ అనిపించుకునేంత గొప్పవాణ్ణి కాదు నేను. మనిషిని ప్రేమిస్తాను అంతే. అందుకే చదువుకునే రోజుల్లోనే కుర్రాళ్లమంతా ఓ టీమ్‌గా ఏర్పడి విరాళాలు పోగు చేసి మరీ కాలేజీ కట్టించాం. సత్రాలు నెలకొల్పాం. ఎవరైతే పీడిత ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నారో, బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తారో..  వారంటే నాకు ఆరాధన. నా సినిమాల్లో హీరోలు కూడా వాళ్లే.

 పోరాటాలు సరే... సేవాదృక్పథం ఎలా అలవడింది?

 ఆర్.నారాయణమూర్తి: దానికి ఓ గొప్ప సంఘటన కారణం మిత్రమా! బీహార్ వరద బాధితుల సహాయార్థం మా మిత్రులంతా కలిసి పెద్దాపురంలో ఇల్లు ఇల్లు తిరిగి విరాళాలు వసూలు చేస్తున్నాం. అక్కడ ‘దర్గానగర్’ అనే ఏరియా ఉంది. అది ప్రాస్టిట్యూట్లు ఉండే చోటు. ఇల్లు ఇల్లు తిరుగుతూ... అక్కడకి కూడా వెళ్లాం. ఓ ఇంటిముందు నిలబడి.. ‘బీహార్ బాధితులకు ఏదైనా సాయం చేయండమ్మా’ అని అడిగాను. ఆ ఇంట్లో నుంచి ఓ తల్లి వచ్చింది. ‘నీ పేరేంటి నాన్నా..’ అనడిగింది. ‘నారాయణమూర్తి’ అని చెప్పాను. ‘నారాయణమూర్తి.. ఇదిగో బట్టలు, బియ్యం’ అని జోలెలో వేసింది. ఆమెకు ఓ నమస్కారం పెట్టి వెళ్లబోయాను. ‘నారాయణమూర్తీ.. నాకింకా బేరం రాలేదయ్యా... రాత్రికి కచ్చితంగా బేరాలొస్తాయి. ఆ సొమ్ము మొత్తం బాధితులకు ఇస్తాను.. సరేనా’ అంది. ‘అమ్మా... నీకు వందనం’ అని పాదాభివందనం చేసినంత పని చేశాను. నాలో సేవాదృక్పథాన్ని పెంపొందింపజేసిన సంఘటన అది!
 
 మరి సినిమాలవైపు మీ దృష్టి ఎలా మరలింది?
 ఆర్.నారాయణమూర్తి: సినిమాల్లోకి రాకముందు పలు యూనియన్లకు ప్రెసిడెంట్‌గా పనిచేశాన్నేను. పోరాటాలు నాకు ఓ కన్ను అయితే... సినిమాలు నా రెండో కన్ను. తూర్పు గోదావరిజిల్లా రౌతులపూడి మండలం మల్లంపేట అనే కుగ్రామం మాది. అయితే... రౌతులపూడి మా తాతగారి ఊరవ్వడంతో అక్కడే పుట్టి పెరిగాన్నేను. మా అమ్మపేరు రెడ్డి చిట్టెమ్మ, నాన్నపేరు రెడ్డి చిన్నయ్యనాయుడు. నన్నేమో అందరూ ‘రెడ్డిబాబులు’ అని పిలిచేవారు. అక్కడ టూరింగ్ టాకీస్ ఉండేది. శ్రీవెంకటేశ్వరా థియేటర్. మీరు నమ్మండి బ్రదర్...  టికెట్లు ఇచ్చే ముందు ఆ థియేటర్ నుంచి ‘నమో వెంకటేశా... నమో... తిరుమలేశా...’ అంటూ ఘంటసాలపాట వినిపించేది. అంతే.. థియేటర్ వైపు పరుగు లంకించుకునేవాణ్ణి. వరసపెట్టి అన్ని షోలు చూసేసేవాణ్ణి. డబ్బులు లేవనుకోండీ.. పంది కన్నాల్లోంచి దూరి వెళ్లి దొంగచాటుగా సినిమా చూసేసేవాణ్ణి. అయితే... నటునిగా నన్ను విపరీతంగా ప్రభావితం చేసిన సినిమా మాత్రం అన్నగారి ‘శ్రీకృష్ణ పాండవీయం’ సోదరా! అందులో ఎన్టీఆర్‌గారు చేసిన దుర్యోధనుని పాత్ర నా హృదయంలో గాఢమైన ముద్ర వేసింది. మట్టి దిబ్బనే స్టేజ్‌గా భావించి, ఇటుకరాయి పొడుం, మసి బొగ్గులతో మేకప్ వేసుకొని, దుప్పట్లను వీపుకు కట్టుకొని  ఫ్రెండ్సందరి ముందు దుర్యోధనుని ఏకపాత్రాభినయం చేసేవాణ్ణి. స్వతహాగా అక్కినేని వీరాభిమానినైనా... నటునిగా ఎన్టీఆర్ ప్రభావమే నాపై ఎక్కువ ఉండేది. ఎస్వీఆర్, సావిత్రమ్మ తల్లి,  సూర్యకాంతం, రేలంగి అన్నా కూడా చాలా ఇష్టం.

 మద్రాస్‌లో ఎప్పుడు అడుగుపెట్టారు?

 ఆర్.నారాయణమూర్తి: ఇంటర్మీడియట్ అయిపోయింది. ‘సినిమాల్లోకి వెళతా...’ అని అమ్మని బతిమాలి.. ఆమె  దగ్గర ఓ డెబ్భై రూపాయలు తీసుకొని మద్రాస్ రెలైక్కా. ‘వెళ్లగానే.. రామారావుగారు వేషం ఇచ్చేస్తారు. నాగేశ్వరరావుగారు భోజనం పెడతారు’ అని మనసులోనే అమాయకంగా అనుకునేవాణ్ణి. అక్కడ నాలా  వందల మంది పడిగాపులు కాస్తూ ఉంటారని వెళ్లాక గానీ అర్థం కాలేదు. కష్టపడితే పడ్డాను కానీ.. ఆ రోజులు, ఆ అనుభవాలు మరిచిపోలేనివి మిత్రమా!
 
 ఆ అనుభవాలు కొన్ని...
 ఆర్.నారాయణమూర్తి: చెబుతాను మిత్రమా.. అప్పట్లో తిరుపతి వెళ్లే భక్తులందరికీ.. శ్రీవారిని దర్శించాక... అట్నుంచి అటు మద్రాసు వెళ్లి.. ఎన్టీఆర్‌ని చూసే సంప్రదాయం ఉండేది... అలా ప్రతి రోజూ పొద్దున్నే ఎన్టీఆర్ ఇంటికి వందల సంఖ్యలో భక్తులు వచ్చి చేరేవారు. ఆయన కూడా ఎర్లీ అవర్స్‌లో బయటకు వచ్చి వారికి కనిపించేవారు. ‘దర్శనం బాగా అయ్యిందా..’ అని కుశల ప్రశ్నలు వేసేవారు. రామారావుగారిని చూడాలనే కోరిక నాకు బలంగా ఉండేది. అందుకే ఆ భక్తుల్లో ఒకడిగా వెళ్లిపోయి.. ఆయన ముందు నిలుచున్నా. ఆ క్షణం గుర్తొస్తే... ఇప్పటికీ నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఆ ఆనందం కడుపు నింపదుగా. కడుపేమో నకనకలాడుతోంది. స్వతహాగా భోజనప్రియుణ్ణి. రోజుకు ఏడుసార్లు తింటా. జేబులో డబ్బుల్లేవ్. మరో వైపు లాడ్జివాడు ఖాళీ చేయమన్నాడు. వేషాలేమో రాలేదు. ఉంటానికి చోటు లేదు. దాంతో పానగల్‌పార్క్‌లో ఓ రోజు, రామకృష్ణ పార్క్‌లో ఓ రోజు, క్రిసెంట్ పార్క్‌లో ఓ రోజు పడుకునేవాణ్ణి. అన్నం లేకపోయేసరికి ట్యాప్ వాటర్ కడుపు నిండా పట్టించేవాణ్ణి. అష్టకష్టాలు అనుభవించా. కానీ వెనక్కు మాత్రం వెళ్లకూడదని దృఢంగా నిశ్చయించుకున్నా. అలాంటి సమయంలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన పేరు చిన్ని. స్టార్ కమెడియన్ రాజబాబుగారి మేకప్‌మేన్ కృష్ణకు సహాయకుడాయన. మహాలింగపురంలోని ఓ పాడైపోయిన కార్‌షెడ్‌లో చోటు ఇప్పించాడు. రాత్రిళ్లు అక్కడే పడుకునేవాణ్ణి. ఆ మహానుభావుడి దయవల్లే ‘తాతామనవడు’ సెట్‌లోకి అడుగుపెట్టా. నేను ప్రప్రథమంగా సినిమాఫుడ్ తిన్నది ఆ సెట్‌లోనే! అందుకే.. ఆ చిత్ర నిర్మాత ప్రతాప్ ఆర్ట్స్ రాఘవగారికి వందనాలు. నా అదృష్టం.. ఆ సెట్‌లోనే మహానటుడు రంగారావుగారిని, సూర్యకాంతమ్మని, సత్యనారాయణగారిని, అల్లురామలింగయ్యగారిని, రాజబాబుగారిని, రమాప్రభగారిని.. మహామహులందరినీ ఒకేసారి చూసే అవకాశం దొరికింది. ‘నేను నటిస్తానండీ.. వేషం ఇవ్వరా...’ అని డెరైక్ట్‌గా రంగారావుగారినే అడిగేశా. ఆయన సరదాగా ‘ఏది నటించి చూపించు’ అన్నారు. అంతే... ఇక రెచ్చిపోయా. అందర్నీ ఇమిటేట్ చేసేశా. రంగారావుగారు ఒకటే నవ్వు. ‘భలేవాడివిరా అబ్బాయ్. పైకొస్తావ్..’ అన్నారు. నాకు ఆనందం ఆగలేదు.
 
 ఇంతకీ మీ గురువు దాసరిగారిని ఎప్పుడు కలిశారు?
 ఆర్.నారాయణమూర్తి: వస్తున్నాను మిత్రమా, అక్కడికే వస్తున్నా! నా దేవుణ్ణి కలిసే సమయం ఆసన్నమయ్యింది. నేను బొమ్మలు బాగా గీస్తాను. మిమ్మల్ని కూర్చోబెట్టి... యాజిటీజ్‌గా మీ బొమ్మ దించేస్తా. నాలో ఉన్న ఆ కళ కూడా అక్కడ ఉన్నవారికి చూపించాలని ఓ మూల కూర్చొని ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల బొమ్మలు గీసేశాను. అప్పుడే... నా ఆరాధ్యదైవం నా గురువుగారు సెట్‌లోకి అడుగుపెట్టారు. నేరుగా గురువుగారి దగ్గరకెళ్లి నా బొమ్మలు చూపించాను. ‘ఏ ఊరు తమ్ముడూ...’ అని భుజం మీద చేయివేశారు. నా భుజంపై ఉన్నది సాధారణమైన చేయి కాదని, అది నా పాలిటి సాక్షాత్ వరద హస్తమని నాకు అప్పుడు తెలీదు. కానీ ఏదో తెలీని వైబ్రేషన్. ‘సినిమా పిచ్చితో వచ్చాను. వేషం ఇస్తే చేస్తాను’ అని అడిగేశాను. ‘ఏం చదివావ్’ అనడిగారు. ఆ రోజే ఇంటర్మీడియట్ ఫలితాలొచ్చాయి. పాసైపోయా. ఆ విషయమే చెప్పా. ‘చిన్న కుర్రాడివి. అప్పుడే సినిమాలు వద్దు. డిగ్రీ పూర్తి చేసి రా... అప్పుడు తప్పకుండా అవకాశం ఇస్తా’ అన్నారు గురువుగారు. ‘ఎన్టీరామారావు బి.ఏ’లా ‘నారాయణమూర్తి బి.ఏ’ అనిపించుకోవాలని నాక్కూడా ఉండేది. అందుకే గురువుగారి మాట ప్రకారం వెళ్లి డిగ్రీ పూరిరంగారావుగారి ముందు నేను నటించి చూపిస్తున్నప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ సప్లయిర్ శరభయ్యగారు చూశారట. ఆయన నన్ను పిలిపించి, ‘గోల్డెన్‌స్టూడియోకి వచ్చేయ్. నీకు వేషం ఉంది’ అన్నారు. ‘అబ్బడియబ్బ... యాక్టర్‌ని అయిపోయా’. ఇంకేముంది.. నా ఆనందానికి పట్టపగ్గాల్లేవ్. మహాలింగపురం నుంచి ఏడు కిలోమీటర్లు నడిచి గోల్డెన్ స్టూడియోకి చేరుకున్నా. తీరా వెళ్లాక అక్కడ నా వేషం ఏంటనుకుంటున్నారు.. ‘రాముని బంటుని రా... సీతారాముని బంటుని రా...’ అని గుడిముందు కృష్ణగారు డాన్స్ వేస్తుంటారు. ఆయన వెనుక ఎగిరే ఓ నూట డెభ్భైమందిలో నేనూ ఒకణ్ణి. ఆ సినిమా పేరు ‘నేరము-శిక్ష’... కె.విశ్వనాథ్‌గారు దర్శకుడు. కాస్త కనిపించే వేషం వేసి, ఊరెళ్లిపోవాలనేది నా ఆలోచన. అందుకే.. సహాయ దర్శకుడు కృష్ణమూర్తిగారి దగ్గరకెళ్లి, రామారావు, నాగేశ్వరరావుగారిని ఇమిటేట్ చేసి చూపించి, ‘ఏదైనా కనిపించే వేషం ఇవ్వండి సార్’ అనడిగాను. నా బాధను గ్రహించి.. సాక్షిరంగారావు, మాడా తదితర ప్రముఖులు నటిస్తున్న ఓ సన్నివేశంలో... వారి పక్కనే నన్ను కూడా నిలబెట్టాడు. డైలాగ్ అయితే.. లేదు. దక్కిందే దక్కుదల అనుకున్నా. ఆ షూటింగ్ టైమ్‌లోనే మద్రాస్‌లో ప్రథమంగా... నాన్‌వెజ్ తిన్నాను. ఆకలితో మాడీ మాడీ ఉన్న కడుపు కదా. నోరు కూడా బాగా చవిజచ్చిపోయింది. నాన్‌వెజ్ కనిపించగానే రెచ్చిపోయా. ఇంకేముందీ.. తేడా కొట్టేసింది. భయంకరమైన జ్వరం. శరభయ్యగారు ఇంటికి తీసుకెళ్లి, టాబ్లెట్ ఇచ్చారు. పొద్దున్నే జ్వరం తగ్గింది. అరడజను దోసెలు పళ్లెంలో పెట్టి తినమన్నారు. తిన్నాను. ఓ 36 రూపాయలు ఇచ్చారు. నా తొలి పారితోషికం అనమాట! అవి తీసుకొని ఆయనకు కృతజ్ఞత చెప్పి ఊరుకెళ్లే ముందు మళ్లీ మా గురువుగారిని కలిశాను. ‘ఊరు వెళుతున్నాను’ అని చెప్పాను. ‘జాగ్రత్తగా వెళ్లిరా’ అన్నారు. రాజబాబుగారు నాకు టెర్రీకాటన్ బట్టలు కొనిచ్చారు. వారి ఆప్యాయత ఇంకా నా కళ్లముందు కదులుతూనే ఉంది(చమర్చిన కళ్లతో). ముఖ్యంగా మద్రాసు మహాతల్లికి వందనాలండీ. ఆ సాంబారుకి శతకోటి వందనాలు.
 
 ఇంతకీ బి.ఏ పుర్తి చేశారా?
 ఆర్.నారాయణమూర్తి: ఓ వైపు విద్యార్థి ఉద్యమాలు. మరో వైపు చదువు. సినిమా పరిశ్రమలో ఎన్ని కష్టాలుంటాయో ప్రత్యక్షంగా చూశాను కదా. అందుకే... ‘మళ్లీ వెళ్లాలా..’ అనే ఆలోచనలో ఇంకో వైపు. అలాంటి సమయంలో... మా ఊరి టూరింగ్ టాకీస్‌లో ‘నేరము-శిక్ష’ విడుదలైంది. స్క్రీన్‌పై ఎప్పుడైతే నేను కనిపించానో.. ‘అడిగోరా.. రెడ్డిబాబులు’ అని ఒకే కేక పెట్టారు ఊరి జనాలు! నేను ఆ సినిమాలో ఉన్నట్లు చుట్టుపక్క ఊళ్లల్లో స్ప్రెడ్ అయ్యింది. అంతే.. బళ్లు కట్టుకొని మరీ సినిమాకి రావడం మొదలుపెట్టారు జనాలు! అందులో నేను చేసింది జూనియర్ ఆర్టిస్ట్ వేషం. కానీ నన్ను హీరోలా చూడ్డం మొదలుపెట్టారు. ఆ క్రేజ్ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక మద్రాస్ వెళ్ళాల్సిందే.. అని నిశ్చయించుకున్నాను. బి.ఏ. అయిపోగానే.. అమ్మానాన్నల పర్మిషన్ తీసుకొని మద్రాస్ ట్రైన్ ఎక్కేశా. సూటిగా గురువుగారిని కలిశా. వెళ్లీవెళ్లగానే.. అన్నమాట ప్రకారం ‘నీడ’ సినిమాలో సెకండ్ లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు. వందరోజులాడింది. నా అభిమాన హీరో అక్కినేని నుంచి షీల్డ్ కూడా తీసుకున్నా!
 
 కెరీర్ తొలినాళ్లలో గుర్తుండిపోయిన సంఘటనలు?
 ఆర్.నారాయణమూర్తి: అబ్బో లెక్కలేనన్ని. మనకు ఎన్టీఆర్ ఎలాగో.. తమిళనాడులో ఎమ్జీఆర్ అలా. బాత్రూమ్ గోడలమీద కూడా ఆయన పేర్లే ఉంటాయి. నేను జూనియర్ ఆర్టిస్‌గా ఉన్న రోజుల్లో సప్లయిర్ సూర్యనారాయణగారు నాకో వేషం ఇప్పించారు. వాహినీ స్టూడియోలో షూటింగ్. అందులో కూడా వందమందిలో ఒకణ్ణే. కాస్ట్యూమ్స్ వాడు అందరికీ ‘పోడుంగో... పోడుంగో...’ అని ఎవరి కాస్ట్యూమ్స్ వాళ్లకు విసురుతున్నాడు. అవి ముక్కిపోయిన వాసన వస్తున్నాయి. ‘ఇదేంటండీ... ఇవి ముక్కిపోయిన కంపు గొడుతున్నాయి. ఎలా తొడుక్కుంటాం’ అని అడిగేశా. ‘ఏయ్... ఉంగళక్కు తెరియుమా.. అంద డ్రస్ యార్ పోటాచ్చో. యమ్జీఆర్ పోటాచ్చి. పోడుంగో’ అని గదిమాడు. వాడన్నదానికి అర్థం ఏంటంటే... ‘నీకు తెలుసా... ఆ డ్రస్ ఎవరు వేసుకున్నారో... ఎమ్జీఆర్ వేసుకున్నారు. తోడుక్కో’ అని! ‘అబ్బ... ఎమ్జీఆర్ వేసుకున్న డ్రస్ వేసుకుంటున్నానా...’ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయా. ఆత్రం ఆత్రంగా ఆ డ్రస్ వేసుకున్నా. నా జీవితంలో మరిచిపోలేని సంఘటన అది. మరో సంఘటన ఏంటంటే... . హైదరాబాద్ సారథీ స్టూడియోలో ‘ఓ మనిషీ తిరిగిచూడు’ షూటింగ్ జరుగుతోంది. మా గురువుగారే దర్శకుడు. ఆ చిత్ర నిర్మాతకి తాగుడు అలవాటుంది. రోజుకు ఒకణ్ణి తిడుతుంటాడు. ఈ దఫా నా వంతు వచ్చింది. నోటికి ఏదొస్తే అది అనేశాడు. రైతు బిడ్డని అవ్వడంతో స్వతహాగా పొగరెక్కువ. దాంతో తిరగబడ్డాను. ఇద్దరం తోసుకున్నాం. ఆ నిర్మాతగారి అహం దెబ్బతినింది. ‘షూటింగ్ క్యాన్సిల్’ అని వెళ్లిపోయాడు. గురువుగారు నా దగ్గరకొచ్చి ‘సారీ చెప్పు’ అన్నారు. ‘నేను చెప్పను’ అని సూటిగా చెప్పేశా! ‘చెప్పకపోతే... నా దగ్గర ఉండవ్’ అన్నారు. ‘ఓకే’ అని మద్రాస్ ట్రైన్ ఎక్కేశా. మళ్లీ రోడ్డుమీద నిలబడ్డా. తర్వాత గురువుగారి మరో సినిమా మద్రాస్‌లో మొదలైంది. అప్పుడు ఆయనే... అసిస్టెంట్ డెరైక్టర్‌ని పిలిచి... ‘నారాయణమూర్తి ఏడయ్యా... కనబడటం లేదు. పాపం.. వాడెక్కడున్నాడో తీసుకురండి’ అన్నారు. కట్ చేస్తే గురువుగారి ముందున్నాను. ఇద్దరం కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ... ‘ఏరా... నేను పొమ్మంటే పోతావురా... నేను నిన్ను ఒక్క మాట అనకూడదా?’ అన్నారు గురువుగారు. నాకు ఏడుపు ఆగలేదు. కాళ్లమీద పడ్డంత పనిచేశాను. అసలు ఆయనకు నన్ను పిలిపించాల్సిన అవసరం ఏంటి చెప్పండి. ఆ రోజుల్లో ఆయన కారు వెళుతుంటే... సీఎం కాన్వాయ్‌లా... వెనుక ఓ పది కార్లు ఫాలో అయ్యేవి. ఆయన కోసం నిర్మాతలు పడిగాపులు కాచేవారు. ఆయన్ను నమ్ముకొని వచ్చిన ఆఫ్ట్రల్‌గాణ్ణి నేను. నా గురించి ఆయన అంతసేపు ఆలోచించడం ఏంటి? నాకు తెలిసి.. ‘గురువు’ అనే పదానికి సరైన నిర్వచనం నా గురువు దాసరే! మరో మరిచిపోలేని విషయం ఏంటంటే... నేను సక్సెస్‌లో ఉన్నప్పుడు నా చుట్టూ ఎప్పుడూ ఓ ఇరవై మంది ఉండేవారు. కోలాహలంగా ఉండేది నా లైఫ్. తర్వాత నా సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం మొదలయ్యాయి. అంతే... ఒక్కసారిగా ఆ కోలాహలం మాయం! జేబులో ఉన్న చిల్లర డబ్బులతో బన్ తిని, టీ తాగి రూమ్‌కొచ్చి పడుకునేవాణ్ణి. ‘ఏంటీ.. ఇలా అయిపోయింది జీవితం..’ తెలీకుండానే కంటి వెంట చెమ్మ. ఇంతలో బుద్ధభగవానుడి పుస్తకం కనిపించింది. పేజీ తిప్పాను. గొప్ప కొటేషన్... ‘నీవు దుఖించిన యడల దుఖము పోయినచో నువ్వు దుఖించుము’ అని. పనిగట్టుకొని ఏడవడం ఎంత దుర్మార్గమో ఒక్కమాటలో చెప్పాడు బుద్ధుడు. నా జీవితాన్ని మార్చిన సంఘటన అది.
 
 సాధారణ పేదరైతు బిడ్డ అయిన మీరు ‘స్నేహ చిత్ర’ పేరుతో నిర్మాణ సంస్థను ఎలా స్థాపించగలిగారు?
 ఆర్.నారాయణమూర్తి: హీరోని కావాలనేది నా యాంబిషన్! నాకేమో చిన్న చిన్న వేషాలొస్తున్నాయి. సో... ఏదో ఒక రిస్క్ చేస్తే తప్ప నేను హీరోని కాను.  ముందు నేను హీరో అవ్వాలంటే... నేనే దర్శకుణ్ణి అవ్వాలి. కానీ నాకెవ్వరూ డెరైక్షన్ చాన్స్ ఇవ్వరు. నేను దర్శకుణ్ణి అవ్వాలంటే.. నేనే నిర్మాతను కావాలి. నేను పేదరైతు బిడ్డను. సినిమా తీసే స్తోమత నాకు లేదు. అలాంటి దశలో నా మిత్రులు సాయం చేశారు. వారి సహకారంతో ఇండో-సోవియట్ష్య్రా మైత్రి చిహ్నాన్ని నా సంస్థకు పెట్టుకొని ‘స్నేహచిత్ర’ సంస్థను స్థాపించా. నా సంస్థలో నేను తీసిన తొలి సినిమా ‘అర్ధరాత్రి స్వతంత్రం’. అది ఏడాది ఆడింది. ఆ తర్వాత ‘‘భూపోరాటం, ఆలోచించండి, అడవి దివిటీలు, దండోరా, ఎర్రసైన్యం, స్వతంత్రభారతం, చీమలదండు, దళం, ఊరుమనదిరా, వేగుచుక్కలు, వీరతెలంగాణ, పోరు తెలంగాణ, పీపుల్స్‌వార్, చీకటి సూర్యులు, అమ్మమీద ఒట్టు, గంగమ్మజాతర’’ ఇలా స్ఫూర్తిని రగిలించే సినిమాలు తీశా. రాబోతున్న  ‘నిర్భయ భారతం’ కూడా నా సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉంటుంది.

 కథాపరంగా ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఎవరూ సినిమాలు తీయరు. కానీ మీరు తీస్తారు. ఎందుకు?

 ఆర్.నారాయణమూర్తి: ఒక్కో దర్శకునిదీ ఒక్కో శైలి! శాంతారామ్‌గారి సినిమాలు వాస్తవానికి అద్దం పట్టేలా ఉంటాయి. విశ్వనాథ్‌గారి సినిమాలు, బాపుగారి సినిమాలు కళాత్మకంగా ఉంటాయి. రాఘవేంద్రరావుగారి సినిమాలు మసాలా ఓరియంటెండ్‌గా ఉంటాయి. నా సినిమాలు ఇలా ఉంటాయి. మళ్లీ మా గురువుగారు పద్ధతి వేరు. ఆయన ఎలాంటి సినిమా అయినా తీసేస్తారు.
 
 ఇలాంటి సినిమాలు తీస్తున్నారు కదా. ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదురవ్వలేదా?
 ఆర్.నారాయణమూర్తి: అబ్బో చాలా! నేను తీసిన చాలా సినిమాలు సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పోలీసులైతే కొన్ని సినిమాల ప్రదర్శనలను కూడా అడ్డుకున్నారు. నా సినిమాకు వచ్చే జనాన్ని కూడా సోదా చేసేవారు! ఓసారి ఇంటిలిజెన్స్ ఐజీ నన్ను పిలిపించి ఇంటరాగేట్ చేశారు. ‘ఇలాంటి సినిమాలు తీశావంటే నిన్ను ఎన్‌కౌంటర్ చేస్తా’ అని బెదిరించాడు. ‘మీరు నన్నేం చేయలేరు’ అని మొహం మీదే చెప్పి వచ్చేశా. కొన్నిసార్లు నా సినిమా షూటింగులకు కూడా పర్మిషన్లు వచ్చేవి కావు.

 వ్యాపార దృక్పథంతో ఆలోచించకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం సినిమాలు తీస్తున్న మీకు... ధైర్యంగా స్నేహ హస్తం అందిస్తూ,, సాయం చేస్తున్న ఆ మిత్రులు ఎవరు?

 ఆర్.నారాయణమూర్తి: నా కాలేజ్‌మేట్స్‌తో పాటు, పలువురు చిత్ర ప్రముఖులు కూడా ఉన్నారు. అది పెద్ద లిస్ట్.  

 విప్లవాత్మక చిత్రాలే తీయడం వల్ల... నారాయణమూర్తికి నక్సల్స్‌తో సంబంధం ఉందని, ఆయన సినిమాలకు నిధులు అక్కడ్నుంచే వస్తాయని మీపై ఓ టాక్ ఉంది.

 ఆర్.నారాయణమూర్తి: చూడండీ... ఎవరైతే ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసి, ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, అనన్యసామాన్యంగా పోరాటం చేస్తూ... పీడిత ప్రజలకు అండగా నిలుస్తున్నారో... ఆ ఉద్యమకారులంటే నాకెంతో గౌరవం. అందుకే నేను తీసిన కొన్ని సినిమాల్లో వాళ్లు హీరోలయ్యారు. ఒక్క నక్సల్స్‌నే హీరోలను చేసి నేను సినిమాలు తీయలేదు. ఎవరైతే... అన్యాయానికి ఎదురుతిరిగి పోరాటం చేస్తారో... వాళ్లనే హీరోలుగా చేసుకొని సినిమాలు తీశాను. దూబగుంట రోశమ్మ.. నా హీరోయిన్, నిర్భయ.. నా హీరోయిన్, ఢిల్లీలో పోరాడిన యువతరం నా హీరోలు. నేను అందరికీ చెప్పేది ఒక్కటే. బిఫోర్ ఇండిపెండెన్స్.. భగత్‌సింగ్ నా హీరో అయితే... ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఉద్యమకారులు నా హీరోలు. ఇక అన్నల దగ్గర్నుంచి డబ్బులు తీసుకోవడం అంటారా... అది పచ్చి అబద్దం.
 
 వాళ్లతో మీకు ఎలాంటి సంబంధాలు లేవా?
 ఆర్.నారాయణమూర్తి: మీకూ నాకు సంబంధం లేదా? చెప్పండి. నిజానికి ఆ మహానుభావులతో సంబంధం ఉండటం అదృష్టం. అజ్ఞాతంగా యుద్ధం చేస్తున్న ఆ మహనీయులకు మనం రుణపడి ఉన్నాం.
 
 ఇండస్ట్రీకి వచ్చాక ఆస్తులు ఏమైనా కొన్నారా?
 ఆర్.నారాయణమూర్తి: మేం నలుగురు అన్నదమ్ములం. అక్కచెల్లెళ్లు ముగ్గురు. మా ఊళ్లో చింతపల్లి నరసింహారావుగారని ఓ పెద్దాయన ఉండేవాడు. ఆయన పొలాన్నే నాన్న కౌలు చేసేవారు. అందరం కలిసి కష్టపడి, ఇప్పుడు అదే పొలాన్ని కొనుకున్నాం. అదే నా ఆస్తి!
 
 సిల్వర్‌జూబ్లీ సినిమాలు తీశారు. ఆ లాభాలు ఏం చేశారు?
 ఆర్.నారాయణమూర్తి: అనేక చోట్ల కాలేజీలకు ఫండ్లు ఇచ్చా. హస్పిటల్స్, పీపుల్స్ కమిటీ హాల్స్ కట్టించా. బోర్లు వేయించా. ఇదంతా గుచ్చి గుచ్చి అడుగుతున్నారు కాబట్టే చెబుతున్నా. కానీ ఊరు, పేరు మాత్రం చెప్పను. అది నా భావాలకు విరుద్ధం. ప్రజల ద్వారా నాకు సంక్రమించింది ప్రజలకే చెందాలనేది నా అభిమతం! అలాగే... నా మిత్రులు నాకు ఆర్థికంగా చాలాసార్లు సహాయం చేశారు. వారందరి అప్పులూ తీర్చేయాలి. నా ప్రధాన లక్ష్యం ఇప్పుడు అదే.
 
 బాకీలు తీర్చాలంటే మీరు సినిమాలే తీయనవసరం లేదు. బయట చిత్రాల్లో పాత్రలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే.. లక్షలివ్వడానికి దర్శక, నిర్మాతలు రెడీగా ఉన్నారు.
 ఆర్.నారాయణమూర్తి: ఒక్కటి చెబుతా వినండి బ్రదర్. నా రెమ్యునరేషన్ పైసానా, కోటి రూపాయలా అనే విషయాన్ని పక్కన పెట్టండి. యాక్టింగ్ అనేది ఇష్ట ప్రకారం చేసే పని. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరో స్థాయికి ఎదిగా. మళ్లీ ఒక్కడుగు కూడా వెనక్కు వేయను.  ‘ఆర్.నారాయణమూర్తి ఫిల్మ్’ అనే స్థాయికి వచ్చా. ఆ మార్క్‌ని కాపాడుకోవడమే నా లక్ష్యం. ఇప్పటికి పాతిక సినిమాలు తీశా. అందులో పదిహేను హిట్లు. అది మూములు విషయం కాదు. ఒకానొక దశలో నా సినిమాల బాటలోనే అందరూ నడిచారు. అందుకే జనాలు మొనాటనీ ఫీలయ్యారు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది. అందుకే సముద్రం ఈదుతున్నా. కచ్చితంగా ఒడ్డుకు చేరతా.
 
 వామపక్ష భావజాలంతో ఉండే మీరు దేవుడు గుడి కనిపిస్తే మొక్కుతారు. ఈ భిన్నత్వం ఏంటి?
 ఆర్.నారాయణమూర్తి: కారల్ మార్క్స్ అంతటి వారు కూడా దేవుడు లేడని చెప్పలేదు. నేను భారతీయుణ్ణి. ముఖ్యంగా హిందువుని. ఆ సంప్రదాయాల మధ్య పుట్టి పెరిగిన వాణ్ణి. చెట్లలో, పుట్టలలో, గట్టులలో చివరకు విష సర్పాల్లో కూడా దైవాన్ని చూసే గొప్ప సంస్కృతి మనది. ఆ సంస్కృతిని ఆకళింపు చేసుకున్నాను కాబట్టే నాకు దేవుడంటే నమ్మకం. చిన్నప్పుడు మా ఇంటి నుంచి స్కూల్‌కి వెళ్లాలంటే ఏడు కిలోమీటర్లు నడిచేవాణ్ణి. మధ్యలో ఓ కొండ ఉండేది. ఆ కొండపై దెయ్యం ఉందనేవారు. రోజూ భయపడుతూ వచ్చేవాణ్ణి. ఓ రోజు అమ్మ చెప్పింది. ‘కొండ దగ్గరకు రాగానే ‘జై భజరంగబళి’ అనుకో... ఏ భయం ఉండదు’ అని. ఆ కొండ దగ్గరకు రాగానే ‘జై భజరంగబళి’ అనుకునేవాణ్ణి. ఎక్కడలేని ధైర్యం తన్నుకొచ్చేది. ఇంకా మాట్లాడితే... అక్కడ కాసేపు ఆగి... కొండవైపు పొగరుగా చూస్తూ... ‘జై భజరంగబళి’ అనేవాణ్ణి. నిజంగా దెయ్యాలనేవి ఉంటే... నా ధైర్యాన్ని చూసి పారిపోయేవి. ఆ ధైర్యమే దేవుడు.

 మీరు పెళ్లెందుకు చేసుకోలేదు?

 ఆర్.నారాయణమూర్తి: బ్రదర్.. వయసొచ్చినప్పట్నుంచీ ఉద్యమాలే ఊపిరిగా బతికా. నడుస్తున్న సూరీడులా ఉండేవాణ్ణి. పెళ్లి విషయంలో కూడా నాకంటూ కొన్ని కచ్చితమైన అభిప్రాయాలుండేవి. అవి నా భావాలకు అనుగుణంగానే ఉండేవి. దానికి పెద్దలు ఒప్పుకోలేదు. నేను అభిప్రాయం మార్చుకోలేదు. చివరకు ఒంటరిగా మిగిలిపోయా.
 
 మరి ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఎవర్నీ ఇష్టపడలేదా?
 ఆర్.నారాయణమూర్తి: అన్నా.. వదిలేసెయ్యే.. ఉహ తెలిసినప్పట్నుంచీ అనేక మంది అమ్మాయిల్ని చూసి ఇష్టపడతాం. అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని చూసి ఇష్టపడతారు. అది కామన్. అయితే.. ఇక్కడ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. కట్టుబాట్లు, ఆచారాలు ఉంటాయి. వాటిని గౌరవించుకోవాలి. గౌరవించకపోతే నేను ‘నిర్భయభారతం’ తీయడంలో అర్థం లేదు.
 
 పెళ్లి అవసరం అప్పటికంటే.. ఇప్పుడే మీకు ఎక్కువ.
 ఆర్.నారాయణమూర్తి: నాకు తెలుసు. కానీ... 60 ఏళ్లు వచ్చేశాయి. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే మనసులో లేదు.
 
 సరే... మరి భోజనం సంగతేంటి?
 ఆర్.నారాయణమూర్తి: హోటళ్లు ఉన్నాయిగా..

 భోజన ప్రియులైన మీరు ఎన్నాళ్లు తింటారు హోటల్లో?
 ఆర్.నారాయణమూర్తి: అలవాటైపోయింది సోదరా...

 మరి బస?
 ఆర్.నారాయణమూర్తి: కృష్ణానగర్‌లో రూమ్ తీసుకున్నా.
 
 వీవీఐపి అయిన మీరు కృష్ణానగర్‌లో. అదీ అద్దె ఇంట్లో...
 ఆర్.నారాయణమూర్తి: మద్రాసులో పాండీబజార్ ఎంత గొప్పదో, హైదరాబాద్‌లో కృష్ణానగర్ అంత గొప్పది సోదరా. ఆ కృష్ణానగర్‌తల్లికి వందనం. వేలాది మంది సినీకార్మికులకు ఆసరాగా నిలిచింది మహాతల్లి. ఒక్కోసారి షేర్ ఆటో ఎక్కుతుంటా. ‘సార్.. మా జన్మ ధన్యమైంది’ అంటుంటారు పక్కన కూర్చున్నోళ్లు. ‘మీ పక్కన కూర్చోవడం వల్ల నా జన్మ ధన్యమైంది...’ అని నేను అంటుంటా. అప్పుడు చూడాలి వాళ్ల ఆనందం.
 
 నిరంతరం జనం బాగుకోసం తాపత్రయపడే మీరు.. రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు?
 ఆర్.నారాయణమూర్తి: అన్నా.... నాకు కాకినాడ నుంచి మూడు సార్లు ఎంపీ ఆఫర్లు వచ్చాయి. తుని నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వెళ్లలేదు. ఎందుకంటే... నేను వెళితే... సదరు పార్టీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. అది నాకు చేతకాదు.  అయినా... నేను సినిమాలు తీస్తుంది ప్రజలకోసమే కదా.
 
 మీలాంటి నిస్వార్థపరులు రాజకీయాల్లోకొస్తే.. ప్రజలకు నిజంగా మంచి జరుగుతుంది కదా...
 ఆర్.నారాయణమూర్తి: నీ ప్రేమకు అభిమానానికీ వందనమే... కానీ నేను పాలిటిక్స్‌లోకొస్తే... నాకు లాల్‌బహుద్దూర్ శాస్త్రిగారిలా ఉండాలని ఉంటుంది. పుచ్చలపల్లి సుందరయ్యలా బతకాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు అదెంత సాధ్యమంటారు! అయినా... నాకింకా సినిమా పిచ్చిపోలా!
 
 - బుర్రా నరసింహ
 
 మా గురువుగారు నన్ను పీపుల్స్ స్టార్ అంటారు... అది భారతరత్నకంటే గొప్ప బిరుదు!
 
 గ్లామర్, కరెన్సీ, లగ్జరీ... సినీ సెలబ్రిటీ జీవితం ఇదే. కానీ మీరు అందుకు భిన్నం.
     
 సెలబ్రిటీ అయ్యుండి ఈ సాధారణమైన జీవితం ఏంటి?

 ఆర్.నారాయణమూర్తి: చూడన్నా... బంగళాలు కొనుక్కోవాలన్నా, కార్లల్లో తిరగాలన్నా... మీరంటున్న సోకాల్డ్ లగ్జరీ లైఫ్ అనుభవించాలన్నా నాకది పెద్ద సమస్యేం కాదు. స్విల్వర్ జూబ్లీ సినిమాలు తీసినోణ్ణి నేను. నా సినిమాలు రికార్డులు సృష్టించాయి. అలాంటి నేను అవన్నీ కొనుక్కోలేనా? నేను ఇలా ఓ సాధారణమైన జీవితం గడపడానికి కారణం నా ‘మెంటాలిటీ’. చిన్నప్పట్నుంచీ నేను ఇంతే. నా అభిరుచుల్ని, అభిప్రాయాల్ని, మనోభావాల్ని మార్చుకోలేని అశక్తుణ్ణి. పదిమందీ నన్ను చూసి గొప్పగా చెప్పుకోవాలని నేను ఇలా ఉండను. ఇలా బతకడమే నాకిష్టం. కాలేజీ రోజుల్లో కూడా నాకు రెండే జతల బట్టలుండేవి. ఇప్పటికీ అంతే. నా రూమ్‌లో చాప, దిండు మాత్రమే ఉంటాయి.. వేప పుల్లతో పళ్లు తోముకుంటా. సబ్బుతో స్నానం చేయను. మొహానికి పౌడర్ రాయను. నా స్వభావం ఇది. చెట్లకింద కూర్చోడం, జనంతో మమేకమవ్వడం.. ఇవే నాకు ఆనందాన్నిచ్చేవి. ఎవరో ఏదో అనుకుంటారని నా స్వభావాన్ని మార్చుకోలేను. ఇక గ్లామర్ అంటారా... నాకు గ్లామర్ లేకపోతే... నా ఇంటర్‌వ్యూ మీకెందుకు? ? చెప్పండి. సినీరంగంలో ‘అన్న’ అంటే ఎన్టీఆర్. ఆయన తర్వాత అన్నా అని నన్నే అంటారు. ‘మా ఆకలి బాధల్ని కళ్లకు కడుతున్నావ్ బిడ్డా...’ అంటూ ఈ రోజున తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు నన్ను గుండెలకు హత్తుకుంటున్నారు. ఇంతకు మించిన గ్లామర్ ఏం కావాలి? మా గురువుగారు నన్ను ‘పీపుల్స్ స్టార్’ అన్నారు. నాకు భారతరత్నకంటే గొప్ప బిరుదు అది. ‘జననాట్యమండలి గజ్జ ఆగిన చోట... ప్రజల గళాన్ని వినిపిస్తున్నాయి నారాయణమూర్తి సినిమాలు’ అన్నాడు గద్దరన్న. ఇంతకు మించిన కాంప్లిమెంట్ ఉంటుందా? స్వదేశీ భారతి అనే ప్రఖ్యాత బెంగాలీ రచయిత ఆయన రాసిన ‘ఆరణ్యక్’ బుక్‌పై ముఖచిత్రంగా నా బొమ్మ వేశాడు. పూరిజగన్నాథ్ తన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని నాకు అంకితమిచ్చాడు. ఇంతకు మించిన గౌరవం ఉంటుందా? నాకు ఈ తృప్తి చాలు.


 ‘దేవుడు నన్ను అన్ని విషయాల్లో కింగ్‌ని చేసి ఆ ఒక్క విషయంలో  అన్యాయం చేశాడు..!


 ఇంటికెళ్లగానే.. ఒంటరితనం కమ్మేస్తుంది. అప్పుడనిపిస్తుంది. ‘నిజంగా తోడు తోడే’ అని. జ్వరం వచ్చినప్పుడు పలకరించే నాథుడు లేకుండా ఒంటరిగా ముడుచుకొని పడుకొని ఉంటాను చూడండీ... అప్పుడనిపిస్తుంది. తోడులేని నా జీవితం కూడా ఓ జీవితమేనా అని. ఏ గోంగూరో, లేక చేపల పులుసో తినాలనిపించినప్పుడు, అవి హోటల్లో దొరకనపుడు... అదే నాకంటూ ఓ భార్య ఉంటే వండి పెట్టేది కదా అనిపిస్తుంది. ‘దేవుడు నన్ను అన్ని విషయాల్లో కింగ్‌ని చేశాడు. ఈ ఒక్క విషయంలో ఎందుకు అన్యాయం చేశాడు’ అనుకుంటుంటా. ఒక్కోసారి ఇంటి టైపై కూర్చుంటా. రెండు పక్షులు ఎగరడం నాకంట పడితే... వాటివంకే చూస్తుంటా. ‘వాటికీ ఓ గూడు ఉండి ఉంటుంది. చివరకు అడవిలో తిరిగే మృగాలకు కూడా తోడూ, నీడా ఉంటాయి. మరి నా కెందుకు లేవు. పిచ్చోణ్ణి... నాకెందుకు ఇంత అన్యాయం చేశాడు దేవుడు’ అని బాధపడ్డ సందర్భాలు కోకొల్లలు. కాబట్టి నేటి యువతకు నేను చెప్పేది ఒక్కటే. ‘మేం సెటిల్ అవ్వలేదు. అయ్యాక పెళ్లి చేసుకుంటాం’ అనే ధోరణి మానండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. చక్కగా పెళ్లి చేసుకోండి. చక్కని సమాజానికి నాంది పలకండి. పేరుప్రఖ్యాతుల కోసం మాత్రమే జీవించేవాడికి మానసిక శాంతి ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
http://www.sakshi.com/news/family/exclusive-interview-sakshi-family-in-r-narayana-murthy-61813
23:39 - By Swathi 0

0 comments:

WIDGET #1

Text Widget

Blogroll

Followers

Discrimination

ఈ బ్లాగులోని విషయాలు , సమాచారం మీకు ఉపయోగపడకలదు అని బావించి ఇంటర్నెట్ మరియు ఇతర వెబ్సైటు ల నుండి సేకరించడం జరిగింది.

Discussion

Powered by Blogger.
back to top