Feed Section

Search

Recent Readers

Powered by Blogger.

Saturday 21 September 2013

Ash Gourd

21:21 - By Swathi 0

కూరగాథలు : వీరీ...వీరీ... గుమ్మడి



గుమ్మడి పండు దీర్ఘకాలం పాటు నిల్వ ఉంటుంది. అందుకే పుణ్యకార్యాలకూ, పురోహితులకు సంభావనగానూ ఇవ్వడానికి ఇంట్లో గుమ్మడి పళ్ళు నిల్వ చేస్తారు గృహస్థులు. గుమ్మడి కున్న ఔషధ విలువల కారణంగా గుమ్మడి పండుతో చేసిన కూరగాని, పులుసుగాని ఏడాదికొకసారైనా తినాలంటారు పెద్దలు. గతంలో కొన్ని వైపరీత్యాల మూలంగా గుమ్మడికాయలు దొరకని పరిస్థితి ఉండేది. అలాంటప్పుడు గుమ్మడికాయను దొంగిలించినా తప్పులేదనే భావం ప్రజలలో ప్రబలింది. అందరూ సర్వసామాన్యంగా చేసే తప్పు కనుకనే 'గుమ్మడికాయల దొంగ ఎవరంటే తమ భుజాలు తడుముకున్నార'నే సామెత ఏర్పడిందేమో.

'వార్తాకం కోమలం పథ్యం - కూష్మాండం కోమలం విషం' అని ఆర్యోక్తి. దీని అర్థం తినేందుకు లేత వంకాయలు శ్రేష్టమే కాని లేత గుమ్మడికాయలు మాత్రం విషంతో సమానమని. (ముదురు వంగ విత్తనాల్లో మత్తును కలిగించే విషపదార్థాలున్నట్లే లేత గుమ్మడిలోనూ హానికారక విషపదార్థాలుంటాయి.) అందుకే పచ్చి గుమ్మడి తినరాదు. గుమ్మడి పండు మాత్రమే తినదగినది.

గుమ్మడి ఏకవార్షిక తీగ మొక్క. దీని పెద్ద ఆకులకూ, కాండానికీ మెత్తటి నూగు ఉంటుంది. ప్రతి కణుపు వద్ద స్ప్రింగుల వంటి 'ట్రెండిల్స్' వస్తాయి. వీటి సాయంతోనే గుమ్మడి తీగ ఎగబాకుతుంది. దీని పసుపు పచ్చని పెద్ద పూలు ఏకలింగ పుష్పాలు. మగ, ఆడ పూలు ఒంటరిగానే ఉంటాయి. గుజ్జు, అసంఖ్యాకమైన విత్తనాలు కలిగి ఉండే గుమ్మడి పళ్ళు గట్టి పైపొర కారణంగా మనం కోస్తే తప్ప వాటికి అవిగా పగలవు. గుమ్మడి పళ్ళు సాధారణంగా ఏడెనిమిది కేజీలు, అరుదుగా ఇరవై కేజీల బరువు వరకు కూడా ఉంటాయి. విత్తనాలు అండాకారంలో అణగగొట్టినట్లుంటాయి.


గుమ్మడిగుంట, గుమ్మడిదొడ్డి, గుమ్మడిపూండి వగైరా గ్రామనామాలు... గుమ్మడి, గుమ్మడిదల, గుమ్మళ్ళ మొదలైన ఇళ్ళ పేర్లు గుమ్మడితో మన ప్రాచీన అనుబంధానికి తార్కాణాలు. దక్షిణ అమెరికాలోని అతి ప్రాచీన రెడ్ ఇండియన్ సమాధుల్లో లభించిన అవశేషాలను బట్టి వేల ఏండ్ల క్రితం నుంచీ గుమ్మడిని మానవులు ఆహారంగా వాడేవారని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. భారతదేశంలో చరిత్ర పూర్వ యుగాల నుంచీ గుమ్మడిని పండించడం ఉంది. అయినా గుమ్మడి జాతి తొట్టతొలి జన్మస్థలం మాత్రం పదివేల సంవత్సరాలకు పూర్వమే ఉభయ అమెరికా ఖండాల్లో అత్యుష్ణ ప్రాంతాల్లో ఆవిర్భవించిందని వారి అంచనా.

అయితే గుమ్మడి జాతుల్లో కొన్నింటికి ఉన్న సంస్కృత పేర్లు కూడా అతి ప్రాచీన కాలం నాటివని నిర్ధారణ అయింది. ఉభయ అమెరికా ఖండాల నుంచి ఎటువంటి నౌకాయానాలు లేనట్టి అంత ప్రాచీన కాలంలోనే ఈ మొక్క భారతదేశం దాకా ఎలా విస్తరించి ఉంటుందనే దానిపైన కూడా శాస్త్రజ్ఞులు విస్తృతంగా చర్చించారు. చివరికి ఎండిన గుమ్మడిపళ్ళు అతి తేలికైనవైనందున అవి మహాసముద్రాల నీటిపై తేలుతూ, మొలకెత్తే సామర్థ్యం కోల్పోని విత్తనాలతో సహా ఒక ఖండం నుంచి మరో ఖండానికి విస్తరించి, అక్కడ అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తి ఉండవచ్చుననే నిర్ధారణకు వచ్చారు. అమెరికన్లు 'రెడ్ పంప్కిన్' అని పిలిచే మంచి గుమ్మడి భారతదేశంలో ప్రవేశించి, 'లాల్ కుమ్రా' అని పిలువబడుతున్నది.

అమెరికాలోనే పుట్టిన కషో అనే మరో జాతి గుమ్మడిని భారతీయ మార్కెట్లలో 'ఆఫ్రికన్ గోర్డ్' అనడాన్ని బట్టి మూలంలో అమెరికాలో జన్మించిన ఆ జాతి అక్కడ నుంచి ముందు ఆఫ్రికా ఖండానికి విస్తరించి, ఆ తరువాత భారతదేశానికి విస్తరించి ఉంటుందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ప్రస్తుతం ఆఫ్రికన్ గోర్డ్‌గా పిలవబడుతున్నప్పటికీ, ఈ జాతి భారతదేశానికి అతి ప్రాచీన కాలంలోనే వచ్చి చేరింది. విచిత్ర వీణ, తంబూరా వంటి సంగీత వాద్యాలు తయారుచేసేందుకు అతి పెద్దవైన ఈ జాతి గుమ్మడి పండు బుర్రల్నే అత్యం త ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఉపయోగించేవారు.


గుమ్మడి పండునే కాదు; వాటి లేత ఆకులు, కాండం, పూలు కూడా కూరకు వాడుకుంటారు. గుమ్మడి గింజల్ని తింటారు. హల్వాలు వంటి స్వీట్లలో బాదం, పిస్తా, చార (సార) పప్పు లాగే ఈ గింజలలోని పప్పును కూడా డ్రెస్సింగ్‌గా వాడతారు. కొందరైతే గుమ్మడి పండుతోనే హల్వా చేసుకుంటారు. గుమ్మడిలో పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఉపయుక్త ఖనిజాలే కాక, విటమిన్ ఎ (అధికంగానూ), కొద్దిగా విటమిన్ సి (కొద్దిగానూ) ఉన్నందున అది ఆహారపరంగా విలువైనదని గుర్తించారు. గుమ్మడి పండుకు ఎన్నో వైద్యపరమైన ప్రయోజనాలున్నాయి. కడుపులోని 'టేప్ వార్మ్స్' నిర్మూలన కోసం గుమ్మడి గింజల్ని పంచదారతో తినిపిస్తారు.

రాత్రి పడుకోబోయే ముందు తినిపించి, తెల్లవారుఝామునే ఆముదం తాగిస్తారు. గనేరియా, మూత్ర వ్యాధులున్న రోగులకు మూత్రం సాఫీగా వెడలేందుకు గుమ్మడి విత్తులు పంచదార లేక తేనెతో తినిపిస్తారు. సెగగడ్డలు, మొండి వ్రణాలకు గుమ్మడి పండు గుజ్జును మలాం పట్టీగా వేస్తారు. తేళ్ళు, కాళ్ళజెర్రులు, మండ్రగబ్బలు మొదలైనవి కుట్టినప్పుడు, గుమ్మడిపండు తొడిమను ఎండబెట్టి పొడి చేసి, దానితో తయారుచేసిన పేస్టును రాస్తే తక్షణ ప్రయోజనం ఉంటుంది. కాలిన గాయాలకు గుమ్మడి పండు గుజ్జుతో పట్టు వేస్తారు. గుమ్మడి విత్తులు మూత్రకారిగానే కాక, నరాల బలహీనత ఉన్నవారికి టానిక్‌లా పనిచేస్తాయి. ఇన్ని ఔషధ గుణాలున్న గుమ్మడిని దొరికినప్పుడల్లా మనం ఆహారంలో ఉపయోగించుకోవడం ఎంతైనా మంచిది కదూ! ఇదండీ గుమ్మడి గాథ.
- ముత్తేవి రవీంద్రనాథ్
http://www.andhrajyothy.com/ContentPage.jsp?story_id=54163&category=sunday_special

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Pellentesque volutpat volutpat nibh nec posuere. A die shopuf pogest concludi cum administrasset slushie intus calidum brioche.
Follow me @Bloggertheme9
Subscribe to this Blog via Email :

0 comments:

WIDGET #1

Text Widget

Blogroll

Followers

Discrimination

ఈ బ్లాగులోని విషయాలు , సమాచారం మీకు ఉపయోగపడకలదు అని బావించి ఇంటర్నెట్ మరియు ఇతర వెబ్సైటు ల నుండి సేకరించడం జరిగింది.

Discussion

Powered by Blogger.
back to top