Feed Section

Search

Recent Readers

Powered by Blogger.

Saturday 21 September 2013

bolli disease

21:00 - By Swathi 0

బొల్లి ఇప్పుడు తగ్గుతుంది!


బొల్లి ఇప్పుడు తగ్గుతుంది!
హైదరాబాద్ :  ఒంటిపై తెల్లటి మచ్చలతో కనిపించే బొల్లి వల్ల ఎలాంటి హానీ ఉండదు. కానీ దీనివల్ల వివక్షకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి బొల్లి మానసికంగా కుంగదీస్తుంది. మన జనాభాలో 0.5 శాతం మందిలో అది కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు బొల్లికి మంచి మంచి కొత్త చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. వాటితో గతంలో పోలిస్తే చాలావరకు దీన్ని నయం చేసే ఆస్కారమూ ఇప్పుడుంది. బొల్లి ఎందుకు వస్తుంది, దానికి అందుబాటులో ఉన్న చికిత్సలేమిటి అన్న అంశంపై అవగాహన కోసమే ఈ కథనం.

 మన శరీరంలోని పిగ్మెంట్ అనే రంగునిచ్చే పదార్థం వల్ల మేనిచాయ వస్తుంది. ఇది వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. కొంతమందిలో ఈ పిగ్మెంట్ ఒకేచోట కుప్పపోసినట్లుగా ఉంటే అక్కడ పుట్టుమచ్చ వస్తుంది. ఒకవేళ కొన్నిచోట్ల అది లోపిస్తే...? అప్పుడు అక్కడ చర్మం రంగును కోల్పోయి తెల్లగా మెరుపును కోల్పోయినట్లుగా ఉంటుంది. ఇలా చర్మపు రంగు లోపించడానికి... రంగును ఇచ్చే పదార్థమైన పిగ్మెంట్‌లోని కణాలు తమను తామే దెబ్బతీసుకోవడం (ఆటోఇమ్యూన్ అంశం) కూడా ఒక కారణం. మరికొందరిలో జన్యుపరంగా కూడా ఇది రావచ్చు. మరికొందరిలో ఏ కారణమూ లేకుండానే ఇది కనిపించవచ్చు. కారణం ఏదైనా బొల్లి వచ్చిన వారిలో శరీరంపై తెల్లటి మచ్చలు ప్యాచ్‌లలా కనిపిస్తాయి. వీటివల్ల ఎలాంటి నొప్పీ ఉండదు. ఆరోగ్యానికి హాని కూడా ఉండదు. కానీ చూడటానికి ఇది అంతగా బాగుండదు. కాబట్టి దీన్ని ఎవరూ కోరుకోరు.

 ఇంగ్లిష్‌లో దీన్ని విటిలిగో అంటారు. వైద్య పరిభాషలో ల్యూకోడెర్మా అంటారు. ఈ తెల్లటి మచ్చలు సాధారణంగా చేతులు, పాదాలు, భజాలు, ముఖం, పెదవులు లాంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి. కొందరిలో బాహుమూలాలు, పొత్తికడుపు కింది భాగం, నోటి చుట్టూ, కన్ను పరిసర ప్రాంతాలు, మర్మావయవాల ప్రాంతంలో ఉంటాయి. ఈ మచ్చలకు తోడుగా విటిలిగో ఉన్నవారికి ఆ తెల్లప్రదేశంలో ఉండే (అంటే ఉదాహరణకు మాడు, కనురెప్పలు, కనుబొమలు, గడ్డంలోని ప్రాంతాల్లోని) వెంట్రుకలు తెల్లగా మారిపోతాయి. చర్మం నల్లగా ఉండే వారిలో ఈ రంగు కోల్పోయిన గుణం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది.

 వైద్య చికిత్స ప్రక్రియలు...
 శరీరంపై ఉండే ఆ మచ్చల పరిమాణం, అవి వచ్చిన చోటు, అక్కడ అవి ఎంతమేర విస్తరించాయన్న అనేక అంశాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. చికిత్స కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. అలాగే చికిత్స ఫలితంగా కూడా ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో ఫలితం చాలా వేగంగా కనిపిస్తే, మరికొందరిలో ఆలస్యంగా కనిపిస్తుంది. అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలివే...

 మెలనిన్ కణాలు మరింత నాశనం కాకుండా చూడటం : ఈ ప్రక్రియలో చర్మానికి రంగును ఇచ్చే మెలనిన్ కణాలు మరింతగా నాశనమైపోకుండా చేస్తారు. అంతేకాదు... రంగు కోల్పోయిన శరీర భాగానికి మునుపటి రంగు వచ్చేలా చేస్తారు.

  స్టెరాయిడ్ క్రీములు: పైపూతగా వాడే విధంగా కొన్ని రకాల స్టెరాయిడ్ క్రీములు, టాక్రోలైమస్ క్రీములు రాస్తారు. అవి చర్మం మామూలు రంగును సంతరించుకోడానికి, మచ్చలు మరింత విస్తరించకుండా సహాయపడతాయి.

  ఫొటో థెరపీ: ట్యాబ్లెట్లు, లోషన్ రూపంలోని సోరాలెన్స్ అనేవి ఈ తరహా చికిత్సలో ఉపయోగపడతాయి. అయితే ఈ ట్యాబ్లెట్‌లు లేదా క్రీములను సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అవుతూ వాడాల్సి ఉంటుంది. సూర్మరశ్మికి బదులుగా హానికరం కాని మోతాదులో అల్ట్రావయొలెట్ కిరణాలకు కూడా ఎక్స్‌పోజ్ చేయవచ్చు. దీన్ని పూవా థెరపీ అంటారు. ఫొటోథెరపీ ప్రక్రియ నిపుణులైన డెర్మటాలజిస్ట్‌ల ఆధ్వర్యంలో మాత్రమే ప్రత్యేక ఫొటోథెరపీ ఛాంబర్లలో  చేయాల్సి ఉంటుంది.

  ఇతర ప్రక్రియలు:
 జింక్‌గో బైలోబా, లీవామీసోల్... ఇవి ఇమ్యూన్ మాడ్యులేటర్స్. ఇవి మన ఇమ్యూనిటీని పెంచడం ద్వారా విటిలిగోతో పోరాడతాయి. వీటిని ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు.

 డి-పిగ్మెంటేషన్ ట్రీట్‌మెంట్ : కొంతమందిలో దాదాపు 80 శాతం పైగా శరీరం తెల్లబడి పోతుంది. ఇలాంటివారిలో నల్లగా ఉన్న మిగతా ప్రాంతాన్ని కూడా తెల్లగా చేస్తారు.

 శస్త్రచికిత్స (సర్జికల్ ట్రీట్‌మెంట్) : ఇందులో పంచ్‌గ్రాఫ్టింగ్, స్ప్లిట్ స్కిన్ గ్రాఫ్టింగ్,  రకరకాల సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక శస్త్రచికిత్సలో భాగంగా ఇప్పుడు చర్మంపై ఇతరచోట్ల ఉండే రంగునిచ్చే పిగ్మెంట్ కణాలను అవి కోల్పోయిన ప్రాంతంల్లోకి బదిలీ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇతర సాధారణ చికిత్స ప్రక్రియల వల్ల సాధ్యం కాని సందర్భాల్లో మాత్రమే ఈ శస్త్రచికిత్స పద్ధతిని అవలంబిస్తారు. శరీరంలోని కొన్ని భాగాల్లో ... అంటే... పెదవులు, చేతులు, కాళ్ల చివరన ఉండే భాగాలు) సాధారణ చికిత్స ప్రక్రియలు అంతగా సత్ఫలితాలు ఇవ్వవు. అలాంటి సందర్భాల్లో ఈ శస్త్రచికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. అయితే విస్తరించని విటిలిగో మచ్చలు ఉన్న పేషెంట్ల  విషయంలోనే ఈ శస్త్రచికిత్స విధానాన్ని ఆలోచిస్తారు. వ్యాప్తి చెందకపోవడం అంటే... ఒక ఏడాది వ్యవధిలో మచ్చ సైజు విస్తరించకపోవడం, కొత్త ప్రాంతాల్లో మచ్చలు రాకపోవడాన్ని మచ్చలు వ్యాప్తిచెందని పేషంట్లుగా పరిగణిస్తారు. ఈ సర్జికల్ ప్రక్రియలో ఇతర చోట్ల నుంచి చర్మాన్ని తీసుకుని గ్రాఫ్ట్ చేస్తారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన శాస్త్రవిజ్ఞాన ప్రక్రియల వల్ల మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. సర్జరీ తర్వాత మళ్లీ అక్కడ సాధారణ పిగ్మెంట్ వచ్చేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చు. అయితే ఒక్కోసారి అనుకున్న ఫలితాలు వచ్చేందుకుగాను... సర్జరీ తర్వాత సాధారణ వైద్యచికిత్స కూడా అవసరం కావచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియల వల్ల విటిలిగో రోగులు మునుపటిలా ఆత్మన్యూనతకు గురికావాల్సిన అవసరంగాని, బాధపడాల్సిన పరిస్థితిగాని లేదు. అనేక నూతన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చినందున వాటి సహాయం తీసుకుని మళ్లీ మేని రంగును  మామూలుగా మార్చుకునేందుకు మంచి అవకాశాలున్నాయి.

 - నిర్వహణ: యాసీన్

 డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
 చీఫ్ డెర్మటాలజిస్ట్,
 త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్.
This is Sakshi Article, Here I am Giving for Public Benefit.
http://www.sakshi.com/news/family/-67184

Tags:
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Pellentesque volutpat volutpat nibh nec posuere. A die shopuf pogest concludi cum administrasset slushie intus calidum brioche.
Follow me @Bloggertheme9
Subscribe to this Blog via Email :

0 comments:

WIDGET #1

Text Widget

Blogroll

Followers

Discrimination

ఈ బ్లాగులోని విషయాలు , సమాచారం మీకు ఉపయోగపడకలదు అని బావించి ఇంటర్నెట్ మరియు ఇతర వెబ్సైటు ల నుండి సేకరించడం జరిగింది.

Discussion

Powered by Blogger.
back to top