Feed Section

Search

Recent Readers

Powered by Blogger.

Monday, 1 September 2014

Bapu Gari Interview

04:29 - By Swathi 0

రమణగారు లేని జీవితం కష్టంగా ఉందండీ!

బాపుగారి చివరి ఇంటర్వ్యు

 సరిగ్గా 200 రోజుల క్రితం... ఉదయం పదకొండు గంటల వేళప్పుడు -
 చెన్నైలో బాపుగారింట్లో... ఆయన ఇంటర్వ్యూకోసం
 దర్శకుడు వీఎన్ ఆదిత్య, నేను (సినిమా డెస్క్‌హెడ్ పులగం చిన్నారాయణ), ఫొటోగ్రాఫర్ శివ చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
  ఈలోగా ఒక చేదువార్త... బాపు గారికి నీరసంగా ఉందట.
 ఇప్పుడేం మాట్లాడరట.. ముగ్గురం నీరసపడిపోయాం.
 ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి.
 కనీసం ఆయనను కలిసి అయినా వెళదామని
 అలానే కూర్చుండిపోయాం..
 మా అదృష్టం బాగుంది.  బాపు గారు కరిగిపోయారు.
 లోపలకు రమ్మన్నారు. చాలా నీరసంగా కనబడ్డారాయన.
 మాటలు మొదలయ్యాక... చాలా హుషారు ఆయనలో.
 చిన్న పిల్లాడై పోయారు.
 చిత్రాలు... చిత్ర పటాలు... చిత్రాతిచిత్రమైన సంఘటనలు...
 గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌లు... మనసులో తగిలించుకున్న
 జ్ఞాపకాల చిత్తరువులు... పలు రకాల పుస్తకాలు.. బోలెడన్ని గ్రామ్‌ఫోన్
  రికార్డులు... ఆయన బొమ్మలేసే చోటు.. రంగులేసే కుంచె...
 ఆ పక్కనే ఆయనకు కావాల్సిన స్వరాలందించే పాతకాలపు టేప్‌రికార్డర్...
 బాపు గారితో అలా... అలా... లీనమైపోయాం.
 రెండున్నర గంటలు... బాపు గారితో గడపడమంటే,
 మా మనసు ముంగిట్లో ముత్యాలముగ్గు వేసుకున్నంత ఆనందం.
 ఈ ఇంటర్వ్యూ మా జీవితంలో గ్రేటెస్ట్ మెమొరీ. కానీ...
 అదే ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ అవుతుందని అనుకోలేదు. మనసు నిండా విషాద మేఘాలు
 కమ్ముకున్న ఈ వేళ... ఒక్కసారి ఆయన జ్ఞాపకాలలోకి... మాటలలోకి...

 మీకు ఈ చిత్రకళ ఎలా అబ్బింది?
 బాపు: మా నాన్నగారు కూడా బొమ్మలు వేసేవారు. ఆయన అడ్వకేట్ అయినా హాబీగా బొమ్మలు వేసేవారు. అయితే ఇది కూడూ గుడ్డా పెట్టేది కాదని ఆయన అభిప్రాయం. నిజంగానే ఆ రోజుల్లో ఆర్టిస్టుగా బతకడం కష్టం. అందుకే నన్ను ‘లా’ చదివించారు.
   
 లా పూర్తయ్యాక, ఎప్పుడైనా కోర్టులో వాదించారా?
 అస్సల్లేదు. అప్పుడప్పుడు కోర్టుకి వెళ్లా. బీఎల్ డిగ్రీ రావడానికి ఎన్‌రోల్ కావాలి కదా. స్నేహితుల దగ్గర నల్లకోటు అరువు తీసుకుని వెళ్లాను.
   
 ఇంతకూ మీరు వెళ్లింది ఏ కోర్టు?
 నేను పుట్టి పెరిగిందంతా చెన్నై కదా. అక్కడ కోర్టుకే వెళ్లా. మా నాన్నగారు కూడా అక్కడే అడ్వకేట్‌గా పనిచేశారు.
   
 తమిళంలో ఓ ఫేమస్ ఆర్టిస్ట్‌కు మీరు ఏకలవ్య శిష్యుడట?
 ఆయన పేరు గోపులుగారు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాకు ఇష్టమైన ఆర్టిస్టులు అందరి దగ్గరికీ వెళ్తుండేవాణ్ణి. శని, ఆదివారాలు అదే పని నాకు. గోపులుగారింటికి ఆదివారాలు వెళ్లి, ఆయన బొమ్మలు వేస్తుంటే చూసేవాణ్ణి. నేనంటే చాలా ప్రేమ ఆయనకు. అప్పట్లో ఆయన ‘ఆనంద వికటన్’ మేగజైన్‌లో పనిచేసేవారు.
   
 మీరు బొమ్మలు గీసే పద్ధతి ఎలా ఉంటుంది?
 (వెంటనే ఆయన తన గదిలోకి తీసుకెళ్లి తను కూర్చుని బొమ్మలు గీసే ప్లేస్ చూపించారు). ఇక్కడే నేల మీద బాసింపట్టు వేసుకుని బొమ్మలు వేస్తుంటాను. మొదట్నుంచీ ఇదే అలవాటు. టేబుల్, కుర్చీ వాడను.
   
 ఏ ఆర్ట్‌కైనా మూడ్ ప్రధానం కదా. మరి మీకు ఏ టైమ్‌లో మూడ్ ఉంటుంది.
 నాకు మ్యూజిక్ ఉంటే చాలు. మూడ్‌తో పనిలేదు. ఏ టైమ్ అయినా, అర్ధరాత్రయినా సరే మ్యూజిక్ వింటూ బొమ్మలేసుకునే పని చేసేవాణ్ణి. ఇలా బొమ్మల మధ్యనే పడుకుని నిద్రపోయిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు ఓపిక లేదు. కూర్చుంటే లేవలేను.
   
 మీ రూమ్‌లో హిందీ మ్యూజిక్ డెరైక్టర్ సి. రామచంద్ర ఫొటో పెట్టుకున్నారు..?
 చాలా మంచి మ్యూజిక్ డెరైక్టరాయన. ‘అనార్కలి’ చేయడానికి ఆయన మద్రాసు వచ్చినప్పుడు కలిశాను. నా క్లోజ్‌ఫ్రెండ్ వి.ఎ.కె. రంగారావుగారు ఆయనకు వీరాభిమాని. సి. రామచంద్రగారి పాటల వల్ల నాకు ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. నాకు నలుగురితో కలిసి మాట్లాడటమంటే భయం. జలగండంలా నాకు ‘జన’గండం ఉన్నట్టుంది. రామచంద్ర పాట అంటే ఇష్టమని చెప్పగానే, అయిదు నిమిషాల్లో నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్లు చాలామంది ఉన్నారు.
   
 మీరు వినేది గ్రామ్‌ఫోన్ రికార్డులా? ఆడియో క్యాసెట్లా?
 మొదట్లో గ్రామ్‌ఫోన్ రికార్డులే వినేవాణ్ణి. తర్వాత క్యాసెట్లు. ఇప్పుడు సీడీలు.
   
 మీ దగ్గర బ్రహ్మాండమైన మ్యూజిక్ కలెక్షన్ ఉందట?
 మెహదీహాసన్, బడే గులాం అలీఖాన్‌ల మ్యూజిక్ కలెక్షన్ మొత్తం ఉంది. వాళ్ల గజల్స్ అంటే నాకు ప్రాణం. గజల్స్ అనే కన్నా, వాళ్ల వాయిస్సే నాకిష్టం. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని వాయిస్సులు వాళ్లవి. నాకు ఉర్దూ పెద్దగా రాదు. అయినా వారి వాయిస్‌ల వల్ల ఆ పాటలు బాగా ఎంజాయ్ చేశాను. 1978లో మెహదీహాసన్‌ని కలిశాను. ఓ బొమ్మవేసి ఇచ్చి సంతకం పెట్టమన్నాను. ‘‘హార్మోనియం పెట్టె... సగం బొమ్మే గీశావ్. మొత్తం గీసి తీసుకురా. అప్పుడు పెడతాను’’ అన్నారు. పెద్దవాళ్లకు వాళ్ల కళంటే అంత అభిమానం. బడే గులాం అలీఖాన్‌ను కలవలేకపోయాను. ఆయన కచ్చేరీలకు నన్ను పీబీ శ్రీనివాస్ తీసుకు వెళ్లేవారు.
   
 సినిమాలు బాగా చూస్తారా?
 రెగ్యులర్‌గా చూస్తా. అయితే అన్నీ వీడియోల్లోనే. నేను సినిమా బఫ్‌ని. రోజుకి పది దాకా వీడియోలు చూడగలను. వీడియోలు లేని రోజుల్లో మద్రాసులో మూడు రిలీజ్‌లుండేవి. మూడు పూట్లా మూడు రిలీజ్‌లు చూసేసేవాణ్ణి. సినిమా సినిమాకీ మధ్య ఒక టీ తాగి, బిస్కెట్లు తినేవాళ్లం.
   
 సినిమాలు తీయడానికి మీకు ఇన్‌స్పిరేషన్..?
 చిన్నప్పట్నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. మద్రాసులో హాలీవుడ్ సినిమాలన్నీ విడుదలయ్యేవి. అన్నిటికీ నేలక్లాసుకి వెళ్లిపోయేవాళ్లం.
   
 మీరు మౌత్ ఆర్గాన్ బాగా వాయించేవారట?
 కాలేజీ రోజుల్లో బాగా వాయించేవాణ్ణి.
   
 ‘మూగమనసులు’ పోస్టర్ మీరే డిజైన్ చేశారు కదా?
 అవును. రమణగారు ఆ సినిమాకి వర్క్ చేశారు కదా. సినిమాలో ఉన్నదాన్నే ఎలివేట్ చేస్తూ పడవ, పంగలి కర్ర, ముద్దబంతి పువ్వు ఆర్ట్‌గా వేశాను.
   
 మీ తొలి సినిమా ‘సాక్షి’కి మీరు పబ్లిసిటీ డిజైన్ చేసుకోకుండా ఈశ్వర్‌తో చేయించారెందుకని?
 ఈశ్వర్ పోస్టర్స్ ఇష్టపడి ‘సాక్షి’కి తనతో వేయించాను.

 ‘బంగారు పిచిక’లో యద్దనపూడి సులోచనారాణిగారిని కథానాయికగా తీసుకోవాలనుకున్నారట..?
 హీరోయిన్‌గా కాదు. ఆ సినిమాలో ఓ చోట హీరోకి గొప్పింటి సంబంధాలు తీసుకు వస్తుంది తల్లి. అక్కడ ఓ పెళ్లికూతురి వేషం యద్దనపూడి గారితో చేయించాలనుకున్నాం. ఆవిడ కూడా ఒప్పుకున్నారు. కానీ చేయించడం కుదర్లేదు.
   
 మీ ప్రతి సినిమాకూ స్టోరీబోర్డ్ వేసుకుంటారు. ఆ ఆలోచన ఎందుకొచ్చింది?
 నాకు బొమ్మలేయడం వచ్చు కాబట్టి, కన్వీనియంట్‌గా ఉంటుందని స్టోరీ బోర్డ్ వేసుకుంటుంటాను. హాలీవుడ్‌లో దాదాపుగా అందరూ స్టోరీబోర్డ్ ఫాలో అవుతుంటారు. హైదరాబాద్‌లో కూడా స్టోరీబోర్డ్ వేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అది ప్యూర్లీ పర్సనల్. బయటివాళ్లకు అర్థం కావు. ఆర్టిస్టులు కూడా చూద్దామని తీసుకుని అర్థంకాక ఇచ్చేసేవారు.
   
 మీ తొలి సినిమా ‘సాక్షి’ నుంచి స్టోరీబోర్డ్ ఫాలో అయ్యారా?
 అవును. నేను హోమ్‌వర్క్ ఎక్కువ చేసేవాణ్ణి.
   
 మీ స్టోరీబోర్డ్ ఫాలో అయితే ఎవరైనా ఫొటోగ్రఫీ చేసేయొచ్చునంటారు. లెన్స్ రేంజ్‌లు కూడా డీటెల్డ్‌గా రాస్తారట?
 అబ్బే అదేం లేదండి. ఎవరి పని వాళ్లదే.
   
 మీ సినిమాలకు గొప్ప గొప్ప బాలీవుడ్ కెమెరామేన్లు పనిచేశారు కదా!
 బాబా ఆజ్మీ, ఇషాన్ ఆర్యలాంటి వాళ్లు పనిచేశారు.
   
 వాళ్లతో మీకెలా పరిచయం?
 వాళ్ల సినిమాలు చూశాను. హిందీ సినిమా ‘గరమ్ హవా’కు ఇషాన్ ఆర్య వర్క్ చూసి, ఆయన ఎక్కడుంటారో కనుక్కుని మాట్లాడాను. ‘ముత్యాల ముగ్గు’ ఆయనకు తొలి తెలుగు సినిమా. దానికి ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. స్నేహం, గోరంత దీపం, తూర్పు వెళ్లే రైలు సినిమాలకు నాతో పనిచేశారు. ఆయన అసిస్టెంటే బాబా ఆజ్మీ. నటి షబనా ఆజ్మీ తమ్ముడాయన. కైఫీ ఆజ్మీగారబ్బాయ్. రాజాధిరాజు, వంశవృక్షం, రాధా కల్యాణం, త్యాగయ్య, పెళ్లీడు పిల్లలు తదితర సినిమాలకు వర్క్ చేశారు. ‘సంపూర్ణ రామాయణం’ సినిమాకి ట్రిక్ వర్క్ అంతా రవికాంత్ నగాయిచ్‌గారు చూసుకున్నారు.
   
 మీరు షాట్ ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేవారా?
  అలా మాట వినకపోతే నాతో పని చేయడం కష్టం.
   
 ఆర్టిస్టులకి మీరు యాక్ట్ చేసి చూపిస్తారా?
 చూపించాలి కదండీ. లేకపోతే వాళ్లకు ఎక్స్‌ప్రెషన్సూ అవీ ఎలా తెలుస్తాయండీ. సినిమా మొత్తం మనకు తెలుస్తుంది. వాళ్లు ఎక్కడనుంచో ఇక్కడకు వస్తారు. మనం చెప్పకపోతే వాళ్లకు ఎలా తెలుస్తుంది?

 మీ సినిమాల్లో ‘సీతమ్మ పెళ్లి’ ప్రత్యేకంగా అనిపిస్తుంది...
 చాలా మంచి కథ అది. మహేంద్రన్‌గారని తమిళంలో నాకిష్టమైన దర్శకుడు చేసిన ‘నిండు కొయిరాన్’ని తెలుగులో నేను చేశాను. తమిళంలో రజనీకాంత్ చేసిన పాత్రని తెలుగులో మోహన్‌బాబుతో చేయించాం.
   
 అందరూ మీ బొమ్మలు వాడుతుంటారు. మీరేమో ‘సీతాకల్యాణం’లో ఓ పాటలో మీ బొమ్మలు కాకుండా వేరే చిత్రకారుని బొమ్మలు వాడినట్టున్నారు?
 పిలకా నరసింహమూర్తిగారని మా గురువుగారు. ఆయనతో దశావతారాలు బొమ్మలు వేయించాను.
   
 మీ సినిమాల్లో ఎక్కడో ఒక చోట పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకని?
 ఐజన్‌బర్గ్ గారని గాడ్‌ఫాదర్ ఉండేవారు. ఫోర్డ్ ఫౌండేషన్‌వాళ్లు పెట్టిన సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్ట్‌కి ఆయన హెడ్. ఆయన చెప్పేవారు... సినిమాలో ఎక్కడో ఒకచోట పుస్తకం చూపించమని. వంటగదిలో సీన్ అయినా సరే. ఇల్లాలు పిల్లాడికి పాలు పట్టిస్తున్నా ఓ చేత్తో పుస్తకం ఉన్నట్టు చూపించమనేవారు. అందరూ పుస్తకాలు చదవాలనేది ఆయన అభిలాష.

 ‘సాక్షి’ సినిమాని ఇప్పుడు కూడా రీమేక్ చేయొచ్చునా?
 చాలామంది స్క్రీన్‌ప్లే అది. స్క్రీన్‌ప్లే వైజ్ గొప్పదే కానీ, పర్సనల్‌గా నా వర్క్ నాకు అంత గొప్పగా అనిపించదు.

 తమిళంలో ఏమైనా చేశారా?
 ఓకే ఒక్క సినిమా చేశాను. ‘ఇన్సాఫ్ కే తరాజ్’ని తెలుగులోనూ, తమిళంలోనూ చేశాం.
   
 మీ సినిమాలకు నెగిటివ్ ఎక్స్‌పోజర్ కూడా చాలా తక్కువనుకుంటాను?
 అవునండీ. సినిమా నిడివికి మూడు రెట్లు ఎక్స్‌పోజర్ ఉండేది. ఎందుకంటే రమణగారు స్క్రిప్ట్ రాసి ఇస్తే, నేను స్టోరీబోర్డ్ వేసేసేవాణ్ణి. అక్కడే చాలామట్టుకు ఎడిటింగ్ అయిపోతుంది. ఓ హిందీ సినిమాని ఒకే సెట్‌లో రెండు చోట్ల ఊటీలోనూ, ముంబైలో తీసేశాం. కాల్షీట్లు ఇబ్బంది వల్ల. అదంతా స్టోరీబోర్డ్ వల్ల సాధ్యపడింది.
   
 రమణగారికి ఏయన్నార్ క్లోజ్ అయితే, మీకు ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఉండేదా?
 అదేం లేదండి. నాకెవ్వరితోనూ ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది కాదు. ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు చేశాను. పిల్లల కోసం ప్రభుత్వం తరఫున ఓ ప్రాజెక్ట్ చేయిస్తే చేశాను. అదంతా రమణగారి చలవవల్లే.
   
 అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉండటం చాలా కష్టం. మీది మొదట్నుంచీ అదే పద్ధతి. కానీ ఏమీ లేకపోయినా డాంబికాలు పలికేవారిని చూస్తే ఏమనిపిస్తుంది?
ఇంకొకళ్ల గురించి జడ్జ్ చేయడం కష్టం. తప్పు కదా..?
   
 ఈ గోడ మీద మీ బొమ్మలు కాకుండా పెద్ద పెద్ద పెయింటింగ్స్ ఏంటండీ?
 ఇవన్నీ ఓల్డ్‌మాస్టర్ పెయింటింగ్స్. ‘సీతా కల్యాణం’ టైమ్‌లో లండన్ వెళ్లినపుడు గూటాల కృష్ణమూర్తి గారితో వెళ్లి ఈ పెయింటింగ్స్ కొన్నా. నా ఇంకో ఫ్రెండ్ శ్రీరమణగారు ఇవన్నీ లామినేట్ చేసి పెట్టారు. 1978 నాటి బొమ్మలివి.
   
 చిత్రకళలో వచ్చే మార్పుల్ని గమనించడం కోసం ఇంటర్‌నెట్‌ని ఫాలో అవుతుంటారా?
 నాకస్సలు కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలీదు. ఎప్పటికప్పుడు పుస్తకాలు రిఫర్ చేస్తుంటాను. అప్పట్లో సెంట్రల్ స్టేషన్ దగ్గర్లో మూర్ మార్కెట్ ఉండేది. అక్కడ చిత్రకళకు, సంబంధించి ఫారిన్ బుక్స్ దొరికేవి. ఆల్‌మోస్ట్ ఆల్ అదే నాకు స్కూలులాంటిది. ప్రతివారం ఆ మార్కెట్‌కి వెళ్తుండేవాణ్ణి. లేకపోతే లైబ్రరీకి వెళ్లి బుక్స్ రిఫర్ చేస్తుండేవాణ్ణి. నా చిన్నప్పుడు ‘బాల’ అనే చిల్డ్రన్ మేగజైన్ ఉండేది. ‘రేడియో అన్నయ్య’ న్యాపతి రాఘవరావు గారిది. అందులో బొమ్మలేసేవాణ్ణి. ఆయనే ఎంకరేజ్ చేసేవారు. పుస్తకాల షాపుకి తీసుకెళ్లి ‘నీకు కావాల్సినవి కొనుక్కోవయ్యా’ అనేవారు. షీట్స్, రంగులు అన్నీనూ.
   
 ఇంటర్నేషనల్ లెవెల్‌లో మీ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ ఏమైనా పెట్టారా?
 చాలా పెట్టారండీ. అమెరికా, లండన్. ‘సీతాకల్యాణం’ టైమ్‌లో నేను కూడా లండన్ వెళ్లాను.
   
 మంచి ఆర్టిస్ట్ కావాలంటే ఏం చేయాలండీ?
 లోపల ఉండాలండీ. నేచురల్‌గా ఇంట్రస్ట్ ఉంటే ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్... చేస్తూనే ఉండాలి. అబ్దుల్ కరీం ఖాన్ అని గొప్ప క్లాసికల్ సింగర్ ఉండేవారు. చేతిలో పొన్ను కర్ర. దానికి వెండి పిడి. ఒకాయన ఎవరో మూడు నెలలు సెలవు పెట్టి వస్తాను... సంగీతం నేర్పించమన్నాడట. దానికాయన తన పొన్నుకర్రని చూపించి దీన్ని ఫ్యాక్టరీలో మెషిన్ మీద అయిదు నిమిషాల్లో తయారు చేస్తారు. కానీ నా అరచేయి కింద 30 ఏళ్లుగా ఉంది. అందుకే ఇంత నునుపు తేలింది. సంగీతం మూడు నెలల్లో నేర్చుకుంటే రాదు అన్నారట. అందుకే నిరంతరం అదే పనిలో ఉండాలి.
   
 వర్తమానంలో చిత్రకళ గురించి మీ అభిప్రాయం?
 అద్భుతంగా ఉంది. ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. పాతవే మంచివి అనుకోవడం పొరపాటు.
   
 ప్రస్తుతం మీకు నచ్చిన చిత్రకారుడెవరు?
 (నవ్వుతూ) నాకు జుట్టు లేదు కానీ, ఇంతమంది చిత్రకారులున్నారు. నిజంగా వేలల్లో ఉన్నారు.
   
 మనవళ్లూ మనవరాళ్లలో ఎవ్వరికైనా మీ ఆర్ట్ అబ్బిందా?
 నా రెండో అబ్బాయి కూతురు బొమ్మలు వేస్తుంది. దానికి 8 ఏళ్లు. మా అమ్మాయి కూడా బొమ్మలు వేస్తుంది. తను ఏదో గ్రాఫిక్స్ కంపెనీలో పనిచేస్తోంది.
   
 బొమ్మలు వేయడం నేర్పమని పిల్లలు అడగరా?
 (నవ్వేస్తూ) నాకు వస్తే కదా... వాళ్లకు నేర్పేది. నేను నిరంతర విద్యార్థిని. నేర్చుకుంటూనే ఉంటాను.
   
 ఇప్పుడు మీకు కాలక్షేపం ఏంటి?
 ఓపిక ఉంటే బొమ్మలు వేయడం. లేకపోతే పుస్తకాలు చదవడం. మొదట్నుంచీ పుస్తకాలు ఎక్కువ చదివేవాణ్ణి.
   
 రమణగారి స్క్రిప్టు లేకుండా మీరు రెండు సినిమాలు చేసినట్టున్నారు?
 లేదండీ. ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ నాటకం ఆధారంగా తీసిన సినిమా కదా. పద్యాలు ఉంటాయని గబ్బిట వెంకట్రావ్‌గారితో స్క్రిప్ట్ చేయించాం. రమణగారి ఇది లేనిదే నేను ఏ సినిమా తీయలేదు. ‘రామాంజనేయ యుద్ధం’కు రమణగారి కంట్రిబ్యూషన్ ఇన్‌డెరైక్ట్‌గా ఉంది.
   
 రమణగారు రాసిపెట్టుకున్న సినిమా స్క్రిప్టులు ఇంకేమైనా ఉన్నాయాండీ?
 లేవండీ. కొన్ని కొన్ని స్టోరీ ఐడియాలుండేవి. చేద్దామని ఫుల్‌ఫ్లెడ్జ్‌డ్‌గా ఏ స్క్రిప్టూ పెట్టుకోలేదు. ఐడియా నచ్చితే అప్పటికప్పుడు స్క్రిప్టు తయారు చేసుకునేవాళ్లం.
   
 డబ్బు ఎంత గొప్ప స్నేహితులనైనా విడదీస్తుందంటారు. మీరిద్దరూ తీసిన సినిమా ఫ్లాప్ అయితే ఏం ఇబ్బంది ఎదురు కాలేదా?
 అంతా రమణగారే చూసుకునేవారు. ఈ ఇల్లు ఆయన కట్టించిందే. ఎన్టీఆర్‌గారి స్కూలు పాఠాల ప్రాజెక్ట్ తర్వాత ఇది, పక్కన మా అమ్మాయి ఇల్లు, వెనుక రమణగారిల్లు కట్టుకున్నాం. రమణగారు ఇల్లు అమ్మేశాక, ఈ ఇంట్లోనే పైన ఉండేవారు. వెనుక ఇంట్లో ఏడాదో, రెండేళ్లో ఉన్నారంతే. ‘‘ఎప్పుడూ కలిసుండేవాళ్లం ఇలా వెనక్కు వెళ్లాను. అందుకే అమ్మేశాను’’ అని జోక్ చేసేవారు రమణ. చిన్నప్పట్నుంచీ తను మా ఇంట్లోనే ఉండేవాడు. మా అమ్మగారు తనను పెద్దబ్బాయ్ అని పిలిచేది.
   
 రమణగారు ఉండి ఉంటే... ఇంకో సినిమా చేసేవారా?
 చేసేవాణ్ణి.
   
 ‘శ్రీరామరాజ్యం’ తర్వాత ఏమైనా అనుకున్నారా?
 ‘శ్రీరామరాజ్యం’ జరుగుతుంటేనే పోయారాయన. స్క్రిప్ట్ ముందే రాసేస్తారు కనుక ఇబ్బంది అనిపించలేదు.
   
 రమణగారితో మీ లాస్ట్ వర్డ్?
 రాత్రి రెండింటికి వాళ్లావిడ పిలిచింది. నన్ను పైకి రమ్మంటున్నారని. జస్ట్ టూ మినిట్స్. అనాయాస మరణం. ఊపిరి అందలేదు.
   
 రమణగారు లేని లైఫ్ ఎలా ఉందండీ?
 చాలా కష్టంగా ఉందండీ (అంటుండగానే ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి). అప్పటి నుంచీ నాకు ఓపిక పోయింది.

 - సంభాషణ: వి.ఎన్. ఆదిత్య,  పులగం చిన్నారాయణ

Original Interview has published on sakshi. This is the last interview of bapu garu with sakshi paper.

http://www.sakshi.com/news/family/director-bapu-exclusive-interview-162686

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Pellentesque volutpat volutpat nibh nec posuere. A die shopuf pogest concludi cum administrasset slushie intus calidum brioche.
Follow me @Bloggertheme9
Subscribe to this Blog via Email :

0 comments:

WIDGET #1

Text Widget

Blogroll

Followers

Discrimination

ఈ బ్లాగులోని విషయాలు , సమాచారం మీకు ఉపయోగపడకలదు అని బావించి ఇంటర్నెట్ మరియు ఇతర వెబ్సైటు ల నుండి సేకరించడం జరిగింది.

Discussion

Powered by Blogger.
back to top